"అయిపాయ్ "- స్పీకర్ అనుమతితో స్టాలిన్ ను అనుకరించిన విజయ్..!
తమిళనాడు అసెంబ్లీలో ఇవాళ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీలో ఇవాళ తనదైన శైలిలో ప్రసంగం చేసిన సీఎం విజయ్ (CM Vijay) విపక్ష డీఎంకేను అడుగడుగునా ఇరుకుపెట్టేశారు. గత డీఎంకే ప్రభుత్వ హయాంలో కొనసాగిన తప్పిదాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ తన ప్రభుత్వంలో వాటికి అడ్డుకట్ట వేస్తుందని విజయ్ ప్రకటించారు. అనంతరం నీట్, హిందీ భాష విషయంలో కేంద్రం తీరును తప్పుబడుతూ విజయ్ ఆవేశంగా మాట్లాడారు.
అనంతరం ప్రసంగం ముగించేందుకు విజయ్ సిద్దమయ్యారు. అయితే ప్రసంగం ముగించేలోపే స్పీకర్ కు ఆయన ఓ కీలక విజ్ఞప్తి చేశారు. తాను సినిమా స్టైల్ లో ఓ సంజ్ఞ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. దీనికి అనుమతి ఇవ్వాలని కోరారు. దీంతో ఎమ్మెల్యేలంతా అవాక్కయ్యారు. అందరూ చూస్తుండగానే అల్లు అర్జున్ స్టైల్లో గడ్డం కింద చేయి పెట్టి అంతా అయిపోయిందన్న తరహాలో ఓ సైగ చేశారు. దీంతో టీవీకేతో పాటు కూటమి ఎమ్మెల్యేలు హర్షధ్వానాలు చేశారు. డీఎంకే సభ్యులు మాత్రం రగిలిపోతూ వాకౌట్ చేశారు.

Goosebumps 🔥🔥🔥🔥 @actorvijay pic.twitter.com/fiXtiavCY9
— Let's X OTT GLOBAL (@LetsXOtt) June 23, 2026
అయితే విజయ్ చేసిన ఆ సంజ్ఞ మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ను అనుకరించారని అక్కడ చాలా తక్కువ మందికే అర్దమైనట్లుంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్టాలిన్ తన ఇంటి నుంచి బయటికి వచ్చి కారు ఎక్కే క్రమంలో డీఎంకే-కాంగ్రెస్ మధ్య పొత్తు, సీట్ల సర్దుబాటు పూర్తయిందా అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా స్టాలిన్ దాదాపు ఇలాంటి సైగే చేశారు. ఇప్పుడు విజయ్ కూడా అలాంటి సైగ చేయడం ద్వారా స్టాలిన్ కు కౌంటర్ ఇచ్చారా అన్న చర్చ జరుగుతోంది.














Click it and Unblock the Notifications