సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్..!!
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సాయికృష్ణ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజు ను సిట్ అధికారులు అరెస్ట్ చేసారు. ఈ కేసులో ఇప్పటికే నాగరాజును సస్పెండ్ చేసారు. కాగా, సాయికృష్ణ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాగరాజు పైన హత్యాయత్నం కేసు నమోదు చేసారు. నాగరాజును విచారణ చేసిన పోలీసు ఉన్నతాధికారులు.. ఆయన్ను అరెస్ట్ చేసారు. ఇదే సమయంలో నాగరాజుకు మద్దతుగా స్థానికులు నిరసనకు దిగారు. సిట్ అధికారులు నాగరాజును విచారణ చేయనున్నారు.
విజయవాడలో సాయికృష్ణ కేసు వ్యవహారంలో సీఐ నాగరాజును అరెస్ట్ చేసారు. స్టేట్ గెస్ట్ హౌస్ లో విచారణకు తరలించారు. ఆ తరువాత కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని సమాచారం. నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగింది. డీసీపీ లలిత కుమారి ఇప్పటికే సీఐ నాగరాజును విచారణ చేసారు. ఇదే సమయంలో నాగరాజు ఇంటికి లాయర్లు చేరుకున్నారు. మరో వైపు సాయికృష్ణ మిస్సింగ్ కేసులో మూడో రోజు విచారణ కొనసాగుతోంది. కృష్ణ లంక పోలీస్టేషన్‌లో స్టేషన్ సిబ్బందితోపాటు టాస్క్‌ఫోర్స్ పోలీసులను సిట్ బృందం విచారించింది. సాయి కృష్ణ లాకప్ డెత్.. దహనం చేశారంటూ అతడి తల్లి విజయలక్ష్మీ ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో కృష్ణ లంకలోని స్వర్గపురి శ్మశానవాటికలో సిబ్బంది నుంచి పటమట సీఐ పవన్ కిషోర్ వివరాలు సేకరించారు.

స్థానికుల ఆందోళన.. సిట్ అధికారుల విచారణ
కాగా, సీఐ నాగరాజుకు మద్దతుగా స్థానికులు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. నాగరాజు పైన చర్యలు తీసుకోవద్దని నినాదాలు చేస్తున్నారు. పోలీసులు నాగారాజును అరెస్ట్ చేసేందుకు వచ్చిన సమయంలో అడ్డుకునే ప్రయత్నాలు చేసారు. దీంతో, అదనపు సిబ్బందిని మోహరించిన సిట్ అధికారులు సీఐ నాగారాజును అదుపులోకి తీసుకున్నారు. సాయికృష్ణ ను మే నెలలో ప్రకాశం జిల్లా నుంచి విజయవాడ కు తరలింపు.. విచారణ తరువాత ఏం జరిగిందనే అంశాల పైన సిట్ ఫోకస్ చేసింది. క్రిష్ణలంక పోలీసు స్టేషన్ లో సీసీ కెమేరా ఫుటేజ్ ను పరిశీలన చేసింది. అయితే, అప్పటికే ఫుటేజ్ తీసేసినట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ వ్యవహారంలో ఇప్పుడు సీఐ నాగారాజు ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకోవటంతో.. విచారణ సమయంలో ఏం చెబుతారు.. తదుపరి పరిణామాలు ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.













Click it and Unblock the Notifications