నిశ్చితార్థం రోజే మందేసి.. చిందులు..: వరుడికి వధువు షాక్..
స్నేహితులతో కలిసి ఓ గదిలోకి వెళ్లిన వరుడు.. వారితో కలిసి ఫుల్లుగా మందు కొట్టాడు. అనంతరం గది నుంచి బయటకొచ్చి విందు వైపు వెళ్లాడు.
చెన్నై: పురుషాధిక్య సమాజంలో మగవాడు ఏం చేసినా చెల్లుతుందన్న మూర్ఖపు ఆలోచనలో చాలామంది ఉంటారు. అయితే అన్నిసార్లు.. తాము తానా అంటే తంథానా అనేవారు ఉండరు. తీరు నచ్చకపోతే మొహం పోతే నిరభ్యంతరంగా తమ వైఖరిని ప్రకటించే ఆడవాళ్లు కూడా ఉంటారు.
తాజాగా చెన్నైలోను ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. నిశ్చితార్థం రోజే తాగి నానా రచ్చ చేసిన వరుడిని నాకు వద్దంటూ తెగేసి చెప్పింది వధువు. చిదంబరం శివారు కిళ్లయైకి చెందిన ధర్మరాజన్(28)కు సమీప యువతితో పెళ్లి సంబంధం కుదిరింది. దీనికి సంబంధించిన నిశ్చితార్థ ఏర్పాట్లు కూడా చేసుకున్నారు.

ఆదివారం నాడు నిశ్చితార్థం జరగ్గా.. బంధుమిత్రుల కోసం భారీ విందు ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో.. స్నేహితులతో కలిసి ఓ గదిలోకి వెళ్లిన వరుడు.. వారితో కలిసి ఫుల్లుగా మందు కొట్టాడు. అనంతరం గది నుంచి బయటకొచ్చి విందు వైపు వెళ్లాడు. అప్పటికే చాలా సమయం కావడం.. ధర్మరాజన్ స్నేహితులు కూడా ఎక్కువగా ఉండటంతో అందరికీ భోజనం లభించలేదు.
దీన్ని అవమానంగా భావించిన ధర్మరాజన్ వంటవాళ్లపై దాడికి దిగాడు. వరుడి చర్యకు ఇరు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వరుడి తీరు నచ్చని వధువు తనకీ వివాహం వద్దని తెగేసి చెప్పింది. నిశ్చితార్థం నాడే మందుకొట్టిన తాగుబోతుని తాను చేసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.
వధువు నిర్ణయంతో వరుడు పోలీసులను ఆశ్రయించి సహాయం చేయాల్సిందిగా కోరాడు. ఆమెతోనే తన వివాహం జరిపించాల్సిందిగా కోరాడు. కానీ ఓ తాగుబోతు వ్యక్తిని పెళ్లి చేసుకునేది లేదని వధువు పట్టుబట్టడంతో.. నిశ్చితార్థం రద్దు చేసుకుని వధువు కుటుంబ సభ్యులు వెళ్లిపోయారు. ఆ తర్వాత వరుడికి కౌన్సెలింగ్ ఇచ్చి పోలీసులు ఇంటికి పంపారు.












Click it and Unblock the Notifications