ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల సంబరాలు-ప్రార్ధనలు,, డ్యాన్సులు-ఏడాది తర్వాత హాయిగా
కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఏడాదికి పైగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు తెలిపిన రైతు సంఘాలు తమ ఆందోళనలు విరమించాయి. కేంద్రం వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకోవడం, కనీస మద్దతు ధర సహా మిగతా హామీల్ని కూడా నెరవేరుస్తామంటూ తాజాగా హామీ ఇవ్వడంతో ఇక సరిహద్దుల్లో నిరసనలు విరమించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. దీంతో ఇప్పుడు రైతులు క్రమంగా సరిహద్దుల్ని ఖాళీ చేస్తున్నారు.
ఏడాదికి పైగా సాగిన నిరసనల్ని విరమించే క్రమంలో రైతులు తమ ఇష్టదైవాల్ని ప్రార్ధిస్తున్న దృశ్యాలు, సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు, ఆనందాన్ని డ్యాన్సులు చేస్తూ ఇతరులతో పంచుకుంటున్న దృశ్యాలు ఇప్పుడు ఢిల్లీ సరిహద్దుల్లో కనిపిస్తున్నాయి. ఇవి చూపరుల్ని సైతం ఆకర్షిస్తున్నాయి. ఏడాదిగా నిర్విరామంగా సాగించిన ఆందోళనల నుంచి ఒక్కసారిగా ఊరట పొందుతున్నట్లుగా వారు కనిపిస్తున్నారు. దీంతో వారిని చూసేందుకు సైతం జనం తరలివస్తున్నారు.

హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌ల నుంచి రైతులు తమ స్వస్ధలాలకు తిరిగి తమ సుదీర్ఘ యాత్రను ప్రారంభించారు. నవంబర్ 2020 నుంచి వారు ఆక్రమించిన నిరసన స్థలాలను ప్యాకింగ్ చేసి, కూల్చివేసి మధ్యలో రైతులు డ్యాన్సులు చేస్తున్నారు. తమ డిమాండ్లన్నింటినీ కేంద్రం నెరవేర్చడంతో ఇప్పుడు వారిలో విజయగర్వం, సంతోషం కనిపిస్తోంది. ట్రాక్టర్ ట్రాలీలను పూలతో అలంకరించారు, వాటి సౌండ్ సిస్టమ్‌లలో 'విజయ గీతాలు' ప్లే చేశారు. సింగూ సరిహద్దుకు వీడ్కోలు పలికే ముందు, కొందరు రైతులు హవనాలు చేసి కీర్తనలు ఆలపించారు, మరి కొందరు 'భాంగ్రా' పాటలకు నృత్యం చేశారు.

Recommended Video
అటు ఘాజీపూర్ సరిహద్దుల్లోనూ ఇవే దృశ్యాలు. రైతులంతా కలిసి ప్రార్థనలు చేయడమే కాకుండా, తమ నిరసన ముగింపును జరుపుకోవడానికి విస్తృతంగా లంగర్ వేసి మిఠాయిలు పంచుకున్నారు. రోడ్లపైనే భోజనాలు కూడా చేశారు. ఇన్నాళ్లూ చాలా నష్టపోయామని, కుటుంబాలకు దూరంగా ఉన్నామని, పంటల్ని కోల్పోయామని, ఇప్పుడు హాయిగా తిరిగి తమ పనుల్లో నిమగ్నమవుతామని రైతులు చెప్తున్నారు. కేంద్రం ఇచ్చిన భరోసా తాలుకు విజయగర్వం వారిలో స్పష్టంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications