జూన్ నెలలో 12 కోట్ల కరోనా వ్యాక్సిన్లు, మే కంటే 50 ఎక్కువ: కేంద్రం భరోసా
న్యూఢిల్లీ: దేశం కరోనా వ్యాక్సిన్ కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే వార్తను అందించింది. వచ్చే జూన్ నెలలోనే 12 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రస్తుత మే నెలలో 7.9 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయి. ఈ సంఖ్యను జూన్ నెలలో 12 కోట్లకు పెరగనుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మే నెలతో పోల్చుకుంటే ఇది దాదాపు 50 శాతం ఎక్కువ కావడం గమనార్హం.
45 ఏళ్ల వయసుపైబడిన వారితోపాటు ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ అందించడంలో భాగంగా జూన్ నెలలో 6.09 కోట్ల డోసులను అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగానే సరఫరా చేస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. వీటికి అదనంగా మరో 5.86 కోట్ల డోసులు రాష్ట్రాలు, ప్రైవేటు ఆస్పత్రులు సేకరించేందుకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. దీంతో దేశ వ్యాప్తంగా జూన్ మొత్తంలో దాదాపు 12కోట్ల(11,95,70,000) డోసులు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

దేశంలో కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన జూన్ నెలలో అందుబాటులో ఉండే వ్యాక్సిన్ డోసుల సమాచారాన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ముందుగానే తెలియజేస్తున్నామని, దీంతో వ్యాక్సిన్ సేకరణ, పంపిణీకి ఆయా రాష్ట్రాలు ముందుగానే ప్రణాళికలు రూపొందించుకునే వెసులుబాటు ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
Recommended Video
వ్యాక్సిన్ పంపిణీ, జనాభా, డోసుల వృథాను దృష్టిలో పెట్టుకుని ఆయా రాష్ట్రాలకు డోసుల సరఫరా చేస్తున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ వృథాను అరికట్టడంతోపాటు హేతుబద్ధంగా వినియోగించాలని కేంద్రం సూచించింది. కాగా, మే నెలలో ఆయా రాష్ట్రాలు, ప్రైవేటు ఆస్పత్రులు దాదాపు 3.9 కోట్ల డోసులను సమీకరించుకోగా, కేంద్ర ప్రభుత్వం 4.03 కోట్ల డోసులను రాష్ట్రాలకు ఉచితంగా అందజేసింది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 21.20 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.












Click it and Unblock the Notifications