మోదీ సర్కార్ గుడ్ న్యూస్- రేట్లు భారీగా పెంపు
PM Modi: దేశంలో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర, జార్ఖండ్‌లల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. ఫలితంగా ఈ రెండు చోట్లా రాజకీయ వేడి రాజుకుంది. ఎన్నికల్లో గెలుపోటములపై వ్యూహ, ప్రతివ్యూహాలను రచించుకుంటోన్నాయి అన్ని పార్టీలు.
మహారాష్ట్రలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి, జార్ఖండ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి భారతీయ జనతా పార్టీ కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా రైతాంగంపై భారీగా వరాలను కురిపించింది. ప్రత్యేకించి- మహారాష్ట్రను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది.

వివిధ రకాల పంటలకు కనీస మద్దతు ధరను భారీగా పెంచింది కేంద్ర ప్రభుత్వం. మొత్తం ఆరు రకాల పంటలకు దీన్ని వర్తింపజేసింది. 2025- 2026 సంవత్సరంలో రబీ సీజన్‌కు దీన్ని వర్తింపజేసింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఏర్పాటైన కేంద్ర మంత్రివర్గం దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆమోదం తెలిపింది.
ఆరు రకాల పంటలు- గోధుమలు, బార్లీ, పప్పు ధాన్యాలు (ఛనా), మసూరి పప్పు (లెంటిల్), ఆవాలు, కుసుమ కనీస మద్దతు ధరను పెంచింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో గోధుమల కనీస మద్దతు ధర రూ. 2,275 నుంచి 5,425 రూపాయలకు పెరిగింది. 150 రూపాయల మేర ఎంఎస్‌పీ పెరిగినట్టయింది.
బార్లీ- రూ. 1,850 నుంచి 1,980 రూపాయలు (రూ.130 పెంపు) పప్పు ధాన్యాలు- రూ. 5,440 నుంచి 5,650 రూపాయలు (రూ.210 పెంపు), మసూరి పప్పు- రూ. 6,425 నుంచి 6,700 రూపాయలు (రూ.275 పెంపు), ఆవాలు- రూ. 5,650 నుంచి 5,950 రూపాయలు (రూ. 300 పెంపు), కుసుమలు- రూ. 5,800 నుంచి 5,940 రూపాయల (రూ. 140 పెంపు)కు కనీస గిట్టుబాటు ధర పెరిగింది.
ఈ ఆరు రకాల పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను పెంచాల్సిన అవసరం ఉందని అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ కమిషన్ సిఫారసు చేసింది. ఈ సిఫారసులపై కేంద్ర మంత్రివర్గం చర్చించింది. అనంతరం వాటిని యధాతథంగా ఆమోదించింది. అలాగే- వ్యవసాయానికి సంబంధించి ఈ కమిషన్ ఇచ్చిన ఇతర సిఫారసులను కూడా ఆమోదించినట్లు కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications