కేంద్రం ఉక్కుపాదం: పదేళ్ల జైలు, రూ. కోటి ఫైన్: డ్రాఫ్ట్ బిల్ ప్రిపేర్.. !!
దేశంలో పరీక్షాపత్రాల లీకేజీల వ్యవహారాన్ని శాశ్వతంగా చెక్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. ప్రభుత్వ విద్యా, ఉద్యోగ పోటీ పరీక్షలలో ప్రశ్నాపత్రాల లీకేజీలపై ఉక్కుపాదం మోపబోతోంది. వాటిని అరికట్టడమే ధ్యేయంగా ప్రస్తుతం ఉన్న కాపీయింగ్ నిరోధక చట్టాన్ని మరింత కఠినతరం చేయాలని యోచిస్తోంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత భవిష్యత్తును అంధకారం చేస్తోన్న ఇలాంటి పరిణామాలపై ఉపేక్షించకూడదని నిర్ణయించింది.
పేపర్ లీకులు, ఢిల్లీ ఆందోళనల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా తెరమీదికి వచ్చిన విషయం తెలిసిందే. అర్ధరాత్రి ఓ వీడియోను రిలీజ్ చేశారాయన. ఈ వ్యవస్థాగత లోపాల గురించి మాట్లాడిన కొన్ని గంటల్లోనే కేంద్రం ఈ దిశగా అడుగులు వేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ క్రమంలో 2024 ఫిబ్రవరిలో అమలులోకి తీసుకువచ్చిన ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్ కు మరింత పదును పెట్టబోతోంది.

ప్రస్తుత చట్టం ప్రకారం ఎవరైనా వ్యక్తిగతంగా పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే మూడు నుంచి అయిదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. దీంతో పాటు 10 లక్షల రూపాయల వరకు జరిమానా విధించే వెసలుబాటు ఉంటోంది. అలాగే పరీక్షల నిర్వహణ బాధ్యతలను చూసే ఏజెన్సీలు గానీ అనుబంధ సంస్థలు గానీ, ప్రైవేట్ ఇన్ స్టిట్యూషన్లు గానీ ఇలాంటి తప్పులకు పాల్పడితే గరిష్టంగా కోటి రూపాయల వరకు జరిమానా విధించే నిబంధన ఉంది.
ఇప్పుడు ఇవే నిబంధనలను మరింత పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది. వ్యక్తిగతంగా ఎవరైనా పేపర్ లీక్ లకు పాల్పడినా, అక్రమాలకు కారణమైనా ఇకపై పడే జైలు శిక్ష రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. అంటే జైలు శిక్ష కాల పరిమితి అయిదు నుంచి 10 సంవత్సరాల వరకు పెంచేలా కేంద్రం ఈ కాపియింగ్ నిరోధక చట్టంలో సవరణలు చేయనుంది. అలాగే.. కోటి రూపాయల జరిమానను కనిష్టం చేయనుంది. తీవ్రత ఆధారంగా ఈ మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్లొచ్చు.
ఈ కొత్త సవరణలు అమల్లోకి వస్తే ఇలాంటి పేపర్ లీక్ ముఠాల సభ్యులకు ఒక్కొక్కరికి వేర్వేరుగా కఠిన శిక్షలు అమలు చేసే అవకాశాలను కేంద్రం పరిశీలిస్తోంది. వ్యక్తిగతంగా వారిపై భారీ పెనాల్టీలను విధించే వీలు కల్పించేలా సవరణలను ప్రతిపాదించింది. చట్టంలో ప్రస్తుతం ఉన్నట్లుగా భావిస్తోన్న లొసుగులను నిర్మూలించడం, దోషులకు ఎట్టి పరిస్థితుల్లోనూ జైలు శిక్ష గానీ, జరిమానా గానీ తగ్గించే ఆస్కారం లేకుండా చట్టంలో మార్పులను తీసుకుని రానుంది కేంద్రం.
ప్రతిపాదిత కొత్త సవరణల నిబంధనల ప్రకారం.. లీకేజీలకు పాల్పడే వ్యవస్థీకృత ముఠాలపై పీడీ యాక్ట్ తరహా అత్యంత కఠినమైన నాన్-బెయిలబుల్ సెక్షన్లను ప్రయోగించేందుకు మార్గం సుగమం అవుతుంది. పేపర్ లీక్ అక్రమాలపై విచారణలు చేపట్టడానికి దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడం, నిర్దేశిత గడువులోగా వాటిపై విచారణ జరిపి, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి కేంద్రం ఇప్పటికే అంగీకారం తెలిపింది.












Click it and Unblock the Notifications