సుప్రీంకోర్టు సీజేకి కేంద్రం భారీ షాక్ ? ఇవాళ రాజ్యసభలో మరో వివాదాస్పద బిల్లు !
దేశంలో కార్యనిర్వాహక వ్యవస్ధకూ,న్యాయ వ్యవస్ధకూ జరుగుతున్న పోరులో ఇవాళ మరో కొత్త అంకం అవిష్కృతం కాబోతోంది. దేశంలో ఎన్నికల కమిషనర్ల నియామకాలు చేసే కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తితో పాటు ప్రధాని,విపక్ష నేత సభ్యులుగా ఉండగా.. ఇందులో మార్పులు చేసి సీజేకు షాకిచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఇవాళ రాజ్యసభలో ఓ కీలక బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఇది ఆమోదం పొందితే ఈసీల నియామక కమిటీ నుంచి సీజేను తొలగిస్తారు.
దేశంలోని అత్యున్నత ఎన్నికల అధికారులను నియమించే ప్రక్రియ నుండి భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించే చట్టాన్ని కేంద్రం ఇవాళ రాజ్యసభ ముందుకు తీసుకురానుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్లు (నియామకం, సేవల నిబంధనలు మరియు పదవీకాలం) బిల్లు, 2023ని ఇవాళ కేంద్రం రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది. ఇందులో ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమించాలని ప్రతిపాదించింది.

ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ప్రధానమంత్రి నామినేట్ చేసిన కేంద్ర క్యాబినెట్ మంత్రి ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో ఉండేలా కేంద్రం ఈ బిల్లు ద్వారా మార్పు చేస్తోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్లు, ఎన్నికల కమిషనర్ల నియామకం ప్రధానమంత్రి, లోక్ సభలో విపక్ష నేత, సీజేఐతో కూడిన ప్యానెల్ సలహా మేరకు రాష్ట్రపతిచే నిర్వహించబడుతుందని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మార్చిలో ఇచ్చిన తీర్పును పక్కనబెట్టడమే ఈ బిల్లు లక్ష్యం.
అయితే పార్లమెంటు చట్టం తెచ్చే వరకు ఈ ఏర్పాటు కొనసాగుతుందని సుప్రీంతీర్పు రాజ్యాంగ ధర్మాసనం గతంలో పేర్కొంది. దీంతో కేంద్రం ఈ బిల్లు తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లు ఆమోదం పొందితే ఇక ఎన్నికల కమిషనర్ల నియామకం పూర్తిగా కేంద్రంలో అధికార, విపక్షాల చేతుల్లోకి వెళ్లిపోతుంది. న్యాయవ్యవస్ధలో ఎలాంటి సంబంధం ఉండదు. దీంతో రాజ్యసభలో విపక్షాలు దీనిపై ఎలా స్పందిస్తాయో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications