తెలంగాణపై చంద్రబాబు చివరి నిమిషం యత్నాలు
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ తెలంగాణ బిల్లు విషయంలో స్పష్టంగా రెండు వైఖరులను ప్రదర్శిస్తోంది. తెలంగాణ పార్లమెంటు సభ్యులు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడుతుంటే, సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు సమైక్యాంధ్ర నినాదాలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే ప్రధాన డిమాండ్‌తోనే వారు పనిచేస్తున్నారు తప్ప సీమాంధ్రకు న్యాయం చేయాలనే డిమాండ్‌ను ముందుకు తేవడం లేదు. అయితే, సమన్యాయం చేయడం లేదు కాబట్టి తెలంగాణ ఇవ్వడానికి వీలు లేదనే పద్ధతిలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అంటున్నారు.
పార్లమెంటుకు తెలంగాణ బిల్లు రానున్న నేపత్యంలో దాన్ని అడ్డుకోవడానికి చంద్రబాబు చివరి నిమిషంలో ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు చెబుతున్నారు. కాంగ్రెసేతర పార్టీల నాయకులతో చంద్రబాబు చర్చలు జరుపుతూ, తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా మద్దతును కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. బిల్లు న్యాయవిరుద్ధంగానే కాకుండా సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉందని, బిల్లులో పలు న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని, అందువల్ల దాన్ని అడ్డుకోవాలని చంద్రబాబు జాతీయ పార్టీల నాయకులతో మాట్లాడుతున్నారు.

బిజెపి నేతలతో ఆయన విరామం లేకుండా చర్చలు జరిపారు. తెలంగాణ బిల్లుకు బిజెపి మద్దతు ఇవ్వకుండా చేయాలనే పట్టుదలతో ఆయన కృషి చేసినట్లు కనిపిస్తున్నారు. రెండు రోజుల పాటు బిజెపి, అన్నాడియంకె, శివసేన, తృణమూల్ కాంగ్రెసు, ఆకాలీదళ్ పార్టీల నాయకులతో మాట్లాడారు.
బిజెపికి చెందిన ఎల్‌కె అద్వాని, రాజ్‌నాథ్ సింగ్‌లతో ఆయన రెండు విడతలు చర్చలు జరిపారు, రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్రలో సాగునీటికి ఏర్పడే ఇబ్బందులను ఆయన బిజెపి నేతలకు వివరించినట్లు సమాచారం. పార్లమెంటు రాజ్యసభ ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీతో, లోకసభ ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్‌తో ఆయన మాట్లాడారు. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో మాట్లాడారు. మొత్తం మీద, చివరి నిమిషంలో తెలంగాణ బిల్లును అడ్డుకోవడానికి చంద్రబాబు తీవ్రంగానే ప్రయత్నాలు చేసినట్లు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications