గాంధీతో మోడీకి పోలిక: చంద్రబాబు ప్రశంసల జల్లు

న్యూఢిల్లీలోని లోఢీ రోడ్డులో గల త్యాగరాయ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటైన సిటిజన్స్ ఫోరం ఫోరం ఫర్ అకౌంటెబుల్ గవర్నెన్స్ సదస్సులో ఆయన మోడీతో కలిసి వేదికను పంచుకున్నారు. మోడీని, చంద్రబాబును, రాంజెఠ్మలానీని మందిరా బేడీ వేదికపైకి ఆహ్వానించారు. మోడీ.. మోడీ అంటూ సదస్సులో నినాదాలు దద్ధరిల్లాయి. తనకు విద్యార్థుల మధ్య కూర్చుని సదస్సును తిలకించాలని ఉందని మోడీ అన్నారు. కాగా, సదస్సులో చంద్రబాబు నాయుడు ప్రారంభోపన్యాసం చేశారు.
తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని ఆయన చెప్పుకున్నారు. గాంధీ, శాస్త్రి వంటి మహనీయుల జయంతి రోజు ఈ సదస్సులో పాల్గొనడం సంతోషంగా ఉందని చంద్రబాబు చెప్పుకున్నారు. విజన్ 2020 ద్వారా ముందుచూపుతో అనేక సంస్కరణలను చేపట్టినట్లు తెలిపారు. పివి నరసింహారావు మైనార్టీ ప్రభుత్వం ఎన్నో సంస్కరణలను ప్రవేశపెట్టిందని ఆయన చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విద్యుదుత్పత్తిలో అగ్రశ్రేణిలో నిలిపేందుకు పలు సంస్కరణలను చేపట్టినట్లు ఆయన తెలిపారు. భారత్ సూపర్ పవర్‌గా అవతరించే రోజు దగ్గర్లోనే ఉందని ఆయన చెప్పారు. తాము రాష్ట్రంలో సైబరాబాద్‌ను నిర్మించినట్లు తెలిపారు. రాష్ట్రానికి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంజనీరింగ్, వైద్య కళాశాలలను తెచ్చానని, న్యాయ విశ్వవిద్యాలయాన్ని, బిజినెస్ స్కూల్‌ను తెచ్చానని ఆయన అన్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్ ఈ రోజుల్లో ఎక్కువగా వాడడం వెనక తమ కృషి ఉందని ఆయన చెప్పారు. దేశంలోనే అగ్రశ్రేణి విమానాశ్రయాన్ని, కన్వెన్షన్ సెంటర్‌ను తమ ప్రభుత్వ హయాంలో హైదరాబాదులో నిర్మించినట్లు చంద్రబాబు తెలిపారు.
దేశం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని ఆయన విమర్శించారు. దారుణంగా పెరిగిన ధరలను ప్రభుత్వం నియంత్రించలేకపోతోందని ఆయన అన్నారు. చైనాలో కన్నా మనదేశంలోనే యువత ఎక్కువగా ఉందని ఆయన చెప్పారు. దేశాన్ని దోచుకోవడంలో కాంగ్రెసు నాయకులు బిజీగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. అవినీతిని నిర్మూలించాలంటే 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు












Click it and Unblock the Notifications