ముంబయి పేలుళ్ల ఉగ్రవాదికి చైనా అండ
ఐక్యరాజ్యసమితి వేదికగా ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భారత్, అమెరికా చేస్తున్న ప్రయత్నాలను డ్రాగన్ చైనా మరోసారి మోకాలడ్డుపెట్టింది. లష్కరే తోయిబాకు చెందిన కీలక టెర్రరిస్ట్, 2008లో ముంబయి వరుస పేలుళ్ల సూత్రధారి అయిన సాజిద్‌మీర్ ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడానికి ప్రయత్నించగా చైనా నిరాకరించింది. భద్రతా మండలిలో ఈ రెండు దేశాలు చేసిన ప్రతిపాదనను చైనా 'హోల్డ్'లో పెట్టింది.
అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో సాజిద్ పేరును చేర్చడంవల్ల అతడి ప్రయాణాలపై నిషేధం విధించడంతోపాటు ఆస్తులను స్తంభింపచేయడం వంటి ఆంక్షలు విధించాలన్న ఉద్దేశంతో అమెరికా, భారత్ ప్రతిపాదించగా ఇతర దేశాలు ఆమోదించినప్పటికీ చైనా అడ్డుకుంది. దీంతో ఇతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే ప్రక్రియ మరింత ఆలస్యం కాబోతోంది.

చైనా ఇలాంటివాటిని అడ్డుకోవడం నాలుగు నెలల సమయంలో ఇది మూడోసారి. జూన్‌లో లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీ, ఆగస్టులో జైషే మహ్మద్ ఉగ్ర ముఠా చీఫ్ మసూద్ అజార్ సోదరుడు అబ్దుల్ రౌఫ్ అజార్‌కు కూడా చైనా 'హోల్డ్'లో పెట్టింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తోన్న లష్కరే తోయిబాలో సాజిద్ 2001 నుంచి పనిచేస్తున్నాడు.
2008లో ముంబయిలో 26/11 దాడులకు ఇతనే కీలక సూత్రధారి. అతనిపై అమెరికా 50 లక్షల డాలర్ల రివార్డు కూడా ప్రకటించింది. సాజిద్ మరణించాడంటూ పాకిస్తాన్ ప్రచారం చేసినప్పటికీ ఎవరూ నమ్మలేదు. ఆధారాలు చూపించాలంటూ డిమాండ్ చేశాయి. ఈ ఏడాది జూన్‌లో అతడికి 15 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.












Click it and Unblock the Notifications