తెలంగాణలో విచిత్ర దొంగతనం.. 10 కేజీలు చికెన్ చోరీ !!
తెలంగాణ రాష్ట్రంలో విచిత్ర దొంగతనం చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేటలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సాధారణంగా నగదు, బంగారం, వాహనాలు లేదా ఇళ్లలోని విలువైన వస్తువుల చోరీల గురించి తరచూ వింటుంటాం. కానీ ఈసారి ఏకంగా చికెన్ మాంసాన్ని దొంగతనం చేయడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తూనే.. ఇందుకు కూడా పాల్పడతారా అనే అనుమానాలు రేకెత్తిస్తుంది.
స్థానికుల కథనం ప్రకారం..
దమ్మపేటలోని ఓ చికెన్ షాపుకు ఉదయం సుమారు 10 గంటల సమయంలో ఓ మహిళ మరో వ్యక్తితో కలిసి వచ్చింది. ఇద్దరూ రెండు కిలోల చికెన్ కావాలని కోరుతూ రూ.500 నగదు ఇచ్చారు. షాపు యజమాని సుభాని వారికి చికెన్ కోసి ప్యాక్ చేసే పనిలో నిమగ్నమయ్యాడు. అదే సమయంలో షాపు యజమానికి ఫోన్ రావడంతో ఆయన కొద్దిసేపు మాట్లాడాల్సి వచ్చింది. ఆ హడావుడిలో రెండు కిలోల చికెన్ ప్యాకెట్‌ను కౌంటర్‌పై ఉంచాడు. ఇదే సమయంలో మరో కస్టమర్ కోసం సిద్ధం చేసిన 10 కిలోల చికెన్ మాంసాన్ని కూడా ప్రత్యేకంగా ఒక పెద్ద కవర్‌లో ప్యాక్ చేసి పక్కన ఉంచాడు.

అయితే పది నిమిషాల తర్వాత మరో కస్టమర్‌కు ఇవ్వాల్సిన 10 కిలోల చికెన్ కనిపించకపోవడంతో యజమాని అయోమయానికి గురయ్యాడు. షాపు మొత్తం వెతికినా ఆ కవర్ కనిపించకపోవడంతో వెంటనే సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాడు. సీసీటీవీ వీడియోలో ఇద్దరు వ్యక్తులు పథకం ప్రకారమే వచ్చినట్లు స్పష్టంగా కనిపించిందని యజమాని తెలిపాడు. రెండు కిలోల చికెన్ కొనుగోలు చేసిన మహిళ, అవకాశం చూసుకుని 10 కిలోల చికెన్ ఉన్న కవర్‌ను తీసుకుని బయటకు వెళ్లిపోవడం ఫుటేజీలో రికార్డైంది. దీంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సుభాని వెల్లడించాడు.
అయితే కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మహిళ, ఆమెతో వచ్చిన వ్యక్తిని గుర్తించే ప్రయత్నాలు ప్రారంభించారు. సమీప ప్రాంతాల్లోని ఇతర సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇటీవల చికెన్ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ ఘటన మరింత చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ చికెన్ చోరీ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో సైతం వైరల్ గా మారింది.












Click it and Unblock the Notifications