గోదావరి-కావేరి నదుల లింకేజీ, హోసూర్- బెంగళూరు మెట్రో రైల్: ప్రధాని మోదీకి విజయ్ ప్రతిపాదనలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం చెన్నైలో పర్యటిస్తోన్నారు. ఈ ఉదయం ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకి చేరుకున్నారు. అక్కడ ముఖ్యమంత్రి విజయ్.. సాదరంగా ఆయనను ఆహ్వానించారు. తన పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ 13,000 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే అనేక కీలక ప్రాజెక్టులకు ప్రారంభించారు. కొన్నింటికి శంకుస్థాపనలు చేశారు. వీటిల్లో మెట్రో రైల్ ఫేస్ 2 విస్తరణ, సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచడం, నగరాభివృద్ధిని వేగవంతం చేయడం వంటివి ఉన్నాయి.
ప్రధాని ముందు పలు ప్రతిపాదనలు
ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో విజయ్ మాట్లాడారు. పలు ప్రతిపాదనలను ప్రధాని ముందు ఉంచారు. రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధి, పెండింగ్‌లో ఉన్న కేంద్ర నిధుల విడుదలలో వేగం పెంచాలని కోరారు. చెన్నై మెట్రో రైల్ మూడో దశ విస్తరణకు తక్షణ ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు గోదావరి- కావేరి నదుల అనుసంధానం, సమగ్ర శిక్షా అభియాన్ కింద రావాల్సిన నిధుల విడుదల తదితర ప్రతిపాదనలను ఆమోదించాలని అన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఆయా ప్రాజెక్టులు కీలకమని స్పష్టం చేశారు.

హోసూర్- బొమ్మసంద్ర మెట్రో
చెన్నైలో ట్రాఫిక్ సమస్యలను నివారించడానికి, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడానికి చెన్నై మెట్రో ఫేజ్- 3 ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుందని విజయ్ వివరించారు. ఇందులో భాగంగా తాంబరం ఎయిర్ పోర్ట్ నుండి కీలంబాక్కం, పూనమల్లి- సుంగువార్ఛత్రం వరకు మెట్రో మార్గాలను విస్తరించాలని అన్నారు. కర్ణాటక సరిహద్దులకు ఆనుకుని ఉన్న హోసూర్ నుండి బెంగళూరులోని బొమ్మసంద్ర 20 కిలో మీటర్ల అంతర్రాష్ట్ర మెట్రో కారిడార్‌ను నిర్మించాలని విజయ్.. ప్రధాని మోదీకి విన్నవించారు.
కోయంబత్తూర్, మదురైల్లో మెట్రో రైల్
చెన్నై మెట్రో రెండవ దశలో భాగమైన పూనమల్లి- వడపళని రూట్ ప్రారంభించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూనే రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాల మెట్రో ప్రాజెక్టులపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. కోయంబత్తూర్, మదురైల్లో మెట్రో రైల్ ప్రాజెక్టులను పునఃపరిశీలించి త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ఆయా నగరాల్లో రోజురోజుకూ పెరుగుతున్న వాహన రద్దీ దృష్ట్యా మెట్రో రైల్ ను అందుబాటులోకి తీసుకుని రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
హైస్పీడ్ రైల్ కారిడార్
రైల్వే, రహదారుల అభివృద్ధికి సంబంధించి పలు విజ్ఞప్తులు చేశారాయన. బడ్జెట్లో ప్రకటించిన ఉమ్మడి హైస్పీడ్ రైల్ కారిడార్ల ప్రణాళికలో భాగంగా చెన్నై- కన్యాకుమారి, చెన్నై- కోయంబత్తూర్ వరకు నూతన హైస్పీడ్ కారిడార్లను మంజూరు చేయాలని విన్నవించారు. అలాగే.. రాష్ట్ర పరిధిలోని ప్రధాన జాతీయ రహదారులను 6- లేన్ గా విస్తరించే పనులను వేగవంతం చేయాలని అన్నారు.
జాతీయ ప్రాజెక్ట్ గా
గోదావరి-కావేరి నదుల అనుసంధానం అత్యవసరమని ఈ సందర్భంగా విజయ్ తేల్చి చెప్పారు. దీన్ని జాతీయ ప్రాజెక్ట్ గా గుర్తించాలని కోరారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య నీటి పంపిణీలో సమతుల్యత సాధించడానికి, తాగునీరు, సాగునీటి కొరతను అధిగమించడానికి ఈ నదుల అనుసంధానం ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తమిళనాడుతో పాటు పొరుగు రాష్ట్రాల రైతులకు కూడా విస్తృత ప్రయోజనం చేకూరుతుందని వివరించారు.














Click it and Unblock the Notifications
