ఫుడ్ యాప్స్ కు రెస్టారెంట్స్ చెక్ ? తాజా సర్వేలో షాకింగ్-ఎక్కడ తేడా వస్తోంది ?
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ నిర్వహించిన తాజా అధ్యయనంలో రెస్టారెంట్లకూ, ఫుడ్ డెలివరీ యాప్స్ కూ మధ్య సంబంధాలు బీటలువారుతున్నట్లు తేలింది.
గత దశాబ్దంలో రెస్టారెంట్ల బిజినెస్ ను అమాంతం పెంచేసిన కారణాల్లో ఫుడ్ డెలివరీ యాప్స్ కూడా ఒకటి. వీటి రాకతో కస్టమర్లు రెస్టారెంట్ కు రావాల్సిన అవసరం లేకుండానే ఇంట్లో కూర్చుని యాప్ లో తమకు నచ్చిన ఆహారం బుక్ చేసి తెప్పించుకునే అవకాశం లభించింది. దీంతో కస్టమర్లు కొన్నేళ్లుగా వీటికి అలవాటు పడ్డారు. ఇలా రెస్టారెంట్లకు, ఫుడ్ డెలివరీ యాప్స్ కు, కస్టమర్లకూ ప్రయోజనకరంగా సాగిన ఈ వ్యాపారానికి తాజాగా బీటలు వారుతున్నట్లు తెలుస్తోంది.
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ నిర్వహించిన తాజా అధ్యయనంలో రెస్టారెంట్లకూ, ఫుడ్ డెలివరీ యాప్స్ కూ మధ్య సంబంధాలు బీటలువారుతున్నట్లు తేలింది. రెస్టారెంట్లపై జరిపిన సమగ్ర సర్వే ఆధారంగా ఈ నివేదిక కీలక అంశాలను ఈ సర్వే వెల్లడించింది. అవకాశం దొరకాలే కానీ ప్రస్తుతం ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తున్న రెస్టారెంట్లలో 35 శాతం ఈ యాప్‌ల నుండి తప్పుకోవాలని భావిస్తున్నాయి. అయితే దాదాపు మూడింట రెండు వంతుల రెస్టారెంట్లు తాము యాప్‌లలోనే కొనసాగుతామని తెలిపాయి.

అయితే ఇలా ఫుడ్ డెలివరీ యాప్స్ ను వదిలేయాలని భావిస్తున్న రెస్టారెంట్ల అసంతృప్తికి ప్రధాన కారణం ప్రతి ఆర్డర్‌పై వసూలు చేసే కమీషన్. తాజా నివేదిక ప్రకారం ఈ ప్లాట్‌ఫారమ్ కమీషన్లు కొన్నేళ్లుగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఇవి మొత్తం బిల్లు విలువలో చాలా మొత్తం లాక్కుంటున్నాయి. దీంతో చాలా మంది రెస్టారెంట్ యజమానులకు, ఆర్డర్లు ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రతి ఆర్డర్‌పై నికర ఆదాయం మాత్రం తగ్గిపోతోంది. సగటున ఒక్కో ఆర్డర్‌పై కమీషన్ 2019లో 9.6 శాతం నుండి 2023లో 24.6 శాతానికి పెరిగింది. దీంతో మీడియం, పెద్ద రెస్టారెంట్లకు మాత్రమే ప్రయోజనం ఉంటోంది. దీంతో చిన్న రెస్టారెంట్లు ఈ యాప్స్ నుంచి తప్పుకునేందుకు ఆలోచిస్తున్నాయి.

అయితే మెజారిటీ రెస్టారెంట్లు ఇంకా ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లలో కొనసాగడానికి కారణం ఇందులో ఉంటే తమ పాపులారిటీ పెరుగుతుందని, నెట్‌వర్క్ విస్తరణ ఉంటుందని భావించడమేననని తేలింది. ముఖ్యంగా కొత్త కస్టమర్లను ఆకర్షించాలంటే ఇవి తప్పనిసరని సదరు రెస్టారెంట్లు భావిస్తున్నాయి. అయితే ఈ యాప్స్ చిన్న రెస్టారెంట్లు తమ పని గంటలను పొడిగించడానికి, రద్దీ లేని సమయాల్లో ఆర్డర్‌లను తగ్గించుకోవడానికి, పెట్టుబడి పెట్టకుండానే తమ డెలివరీ పరిధిని విస్తరించడానికి వీలు కల్పిస్తున్నాయి. దీంతో పలు చిన్న రెస్టారెంట్లు కూడా ఈ యాప్స్ లో కొనసాగుతున్నట్లు తేలింది.












Click it and Unblock the Notifications