అన్న బాటలో చెల్లి.. ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ: సేఫ్ సీట్
Priyanka Gandhi Vadra: కాంగ్రెస్ నాయకులు, అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న సమయం ఆసన్నమైంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా.. ఎన్నికల బరిలో దిగారు. ఉప ఎన్నికలో పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది కూడా.
ఊహించినట్టే- కేరళలోని వాయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆమె ఉప ఎన్నికలో పోటీ చేయనున్నారు. ఆమె అన్న, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ రాజీనామా చేయడం వల్ల ఈ స్థానానికి ఉప ఎన్నిక అవసరమైంది. ఈ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు ప్రియాంక గాంధీ.

ఈ మేరకు ఆమె అభ్యర్థితాన్ని ఏఐసీసీ అధినేత మల్లికార్జున్ ఖర్గే ఆమోదించారు. ప్రియాంక గాంధీతో పాటు కేరళలో ఉప ఎన్నికలు జరిగే రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకూ పార్టీ అభ్యర్థులను ఖరారు చేశారు. పాలక్కాడ్ నుంచి మంకూటథిల్, చెల్లక్కార నుంచి రమ్య హరిదాస్ పోటీ చేస్తారు.
వాయనాడ్ లోక్‌సభ స్థానం.. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 2009లో ఈ నియోజకవర్గం కొత్తగా ఏర్పాటుకాగా.. అప్పటి నుంచి కాంగ్రెస్ జెండా మాత్రమే ఎగురుతోంది. 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంఐ షానవాస్ గెలిచారు. 2019 నాటి ఎన్నికల్లో సందర్భంగా రాహుల్ గాంధీ ఎంట్రీ ఇచ్చారు. వాయనాడ్ నుంచి నాలుగు లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.
మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లోనూ వాయనాడ్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారాయన. అదే సమయంలో తన తల్లి సోనియా గాంధీ ఖాళీ చేసిన రాయ్‌బరేలీ నుంచీ గెలిచారు. దీనితో వాయనాడ్‌ను వదులుకోవాల్సి వచ్చింది. ఈ స్థానానికి రాజీనామా చేశారు. ఫలితంగా ఇక్కడ ఉప ఎన్నిక అవసరమైంది.
నవంబర్ 13వ తేదీన ఇక్కడ పోలింగ్ షెడ్యూల్ అయింది. అదే నెల 23వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. వాయనాడ్, మహారాష్ట్రలోని నాందెడ్ లోక్‌సభతో పాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 47 అసెంబ్లీ స్థానాలకూ అదే రోజున ఎన్నికలు జరుగుతాయి. ఇందులో ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే తొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications