అక్బరుద్దీన్ హత్యకు కుట్ర, భూవివాదమే కారణమా?
బెంగళూరు/హైదరాబాద్: మజ్లిస్ పార్టీ ముఖ్య నేత, చాంద్రాయణగుట్ట శాసన సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ హత్యకు పన్నిన కుట్రను బెంగళూరు పోలీసులు చేధించారు. అక్బర్ హత్యకు కుట్ర పన్నడం వెనుక గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. నాంపల్లిలోని ఓ స్థల వివాదం దీనికి కారణం కావొచ్చునని భావిస్తున్నారు. అదే సమయంలో ఉగ్రవాదులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలోను చూస్తున్నారు.
పలు కేసుల్లో నిందితుడైన గిరి అనే అతడు అక్బరుద్దీన్‌ను హతమార్చేందుకు సుపారీ తీసుకున్నట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో గిరి మరో నలుగురితో కలిసి అక్బరుద్దీన్‌ను హతమార్చేందుకు హైదరాబాద్‌కు బయల్దేరారు. సమాచారం అందుకున్న పోలీసులు హిందూపురం మార్గంలో వెళుతున్న వారిని పట్టుకున్నారు.

వారిని బెంగళూరుకు తరలిస్తుండగా పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఇందులో ఒకరు మృతి చెందారు. గిరికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన ముగ్గురూ పట్టుబడ్డారు. వారిని విచారిస్తున్నారు. నిందితుల్లో అక్బరుద్దీన్ సామాజికవర్గానికి చెందిన వారు కూడా ఉండటంతో.. ఉగ్రవాదం కాకుండా భూవివాదమే కావొచ్చని అనుమానిస్తున్నారు.
ఓ రియల్టర్ అక్బరుద్దీన్‌ను అంతమొందించేందుకు గిరి, గోవిందకు సుపారీ ఇచ్చినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని సమాచారం. నిందితుల నుండి పోలీసులు రెండు తుపాకులు, రెండున్నర లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురి ముఠాలో ఒకరు మృతి చెందారు. మిగతా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని బెంగళూరు తరలించారు. కాగా, అక్బరు కుట్ర కేసుపై హైదరాబాద్ సిపి కర్నాటక పోలీసుల నుండి ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications