వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనావైరస్: ఏపీలో కొత్త లక్షణాలు, కనుగుడ్డు నుంచి కూడా వ్యాపిస్తున్న వైరస్ : ప్రెస్ రివ్యూ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కరోనా కొత్త లక్షణాలు

ఏపీలో కోవిడ్ బాధితుల్లో కొత్త కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారని ఈనాడు దినపత్రిక కథనం ప్రచురించింది.

కోవిడ్‌ బాధితుల్లో కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి. జ్వరంతోపాటు ఒళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

తలనొప్పి, తీవ్ర నీరసం వంటి సమస్యలతో బాధపడే వారిని పరీక్షించినప్పుడు కూడా పాజిటివ్‌ వస్తోందని చెబుతున్నారు.

కనుగుడ్డు నుంచి సైతం వైరస్‌ శరీరంలోనికి చేరుతోందని, అలాంటి వారిలో కళ్లు ఎర్రబడుతున్నాయని పేర్కొంటున్నారు.

గుంటూరుకు చెందిన 45 ఏళ్ల వ్యక్తికి నాలుగు రోజుల కిందట జ్వరం వచ్చి తగ్గింది. ఒళ్లు నొప్పులు తగ్గడంలేదని, అనుమానంతో పరీక్ష చేయించగా పాజిటివ్‌గా తేలింది.

అందుకే ఒళ్లు, కీళ్ల నొప్పుల విషయంలో అశ్రద్ధ చేయొద్దని సీనియర్‌ వైద్యులు హెచ్చరిస్తున్నారు. జ్వరంతో విరేచనాలు ఉన్నా... ఉపేక్షించవద్దని, వెంటనే కొవిడ్‌ పరీక్ష చేయించుకోవాలని పేర్కొంటున్నారు.

వైరస్‌... తొలి, మలి దశ బాధితుల్లో కనిపించిన అనుమానిత లక్షణాలపై గుంటూరు, విజయవాడ, విశాఖ జిల్లాల్లో నమోదైన కేసులను పరిశీలించారని పత్రిక చెప్పింది.

ఒళ్లు, కీళ్ల నొప్పులతో వచ్చిన వారికి పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అవుతోందని, ఈ తరహా లక్షణాలు ఈసారి ఎక్కువ మందిలో కనిపించినట్లు ప్రభుత్వ వైద్య నిపుణుల కమిటీ ముఖ్య ప్రతినిధి డాక్టర్‌ సుధాకర్‌ తెలిపారు.

గతంలో కంటే... ఈసారి యువత ఎక్కువగా వైరస్‌ బారిన పడుతున్నారు. మాస్కులు ధరించకపోవడం, భౌతికదూరం పాటించకపోవడం ఇందుకు ఎక్కువ కారణాలుగా కనిపిస్తున్నాయి.

తొలిదశలో 40-45 సంవత్సరాల మధ్యన ఉన్న వారు అధికంగా కొవిడ్‌ బారిన పడ్డారు. ప్రస్తుతం 20-35 ఏళ్లలోపు వారికి ఎక్కువగా కరోనా సోకుతోందని వైద్యులు తెలిపారని ఈనాడు రాసింది.

గత నెల రోజుల్లో నమోదైన కేసుల్లో 20-25% మంది యువతేనని ఓ అంచనా.

లక్షణాలు కనిపిస్తున్నా... యువకులు కరోనా నిర్ధారణ పరీక్షలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఈ నిర్లక్ష్య ధోరణితో కుటుంబంలో రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాల వ్యాధులున్న పెద్దలకు వైరస్‌ త్వరగా సోకుతోంది.

వారు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. ఇంటర్‌, ఇంజినీరింగ్‌ విద్యార్థులు, ఉపాధి, ఉద్యోగాల కోసం బయట తిరిగే యువకులు వైరస్‌ బారిన పడుతున్నారు.

వైరస్‌ తొలి దశలో కంటే ప్రస్తుతం చురుగ్గా వ్యాపిస్తోందని ప్రధాన కొవిడ్‌ ఆసుపత్రుల వైద్యులు తెలిపారు.

గతంలో ఒకేసారి రెండు, మూడు కేసులు మాత్రమే వచ్చేవన్నారు. ప్రస్తుతం ఒకేసారి 10, 15 కేసులు వస్తున్నాయన్నారు.

అయితే, బాధితులకు అందించే చికిత్స, పరీక్షలు, మందులు ఇవ్వడంలో ఎలాంటి మార్పు లేదన్నారు. కిందటేడాది మాదిరిగానే చికిత్స అందించిన అనంతరం కోలుకుంటున్నారని వైద్యులు భరోసా ఇస్తున్నారని ఈనాడు తెలిపింది.

పవన్‌ కల్యాణ్‌కు కరోనా, వ్యవసాయ క్షేత్రంలో విశ్రాంతి

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్ అని తేలినట్లు ఆంధ్రజ్యోతి దిన పత్రిక కథనం ప్రచురించింది.

సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ప్రస్తుతం ఆయన తన వ్యవసాయ క్షేత్రంలోనే చికిత్స పొందుతున్నారని, అపోలో వైద్యుల బృందం ఆయనను పర్యవేక్షిస్తోందని జనసేన పార్టీ కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది.

పవన్‌కు అవసరమైనపుడు ఆక్సిజన్‌ అందిస్తున్నట్టు వెల్లడించింది. పవన్‌ ఈ నెల 3న తిరుపతిలో జరిగిన పాదయాత్ర, బహిరంగ సభలో పాల్గొన్నారు.

హైదరాబాద్‌కు చేరుకున్న అనంతరం ఆయన వ్యక్తిగత సిబ్బందిలో కొందరికి పాజిటివ్‌ రావడంతో ఆయన కూడా కరోనా పరీక్ష చేయించుకున్నారు. నెగటివ్‌ వచ్చింది.

అయినా వైద్యుల సూచన మేరకు వ్యవసాయ క్షేత్రంలో క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఆ తర్వాత కూడా జ్వరం, ఒళ్లు నొప్పులు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయని పత్రిక చెప్పింది.

రెండు రోజుల క్రితం మరోసారి కొవిడ్‌ పరీక్ష చేయగా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ వైరాలజీ నిపుణులు, కార్డియాలజిస్ట్‌ సుమన్‌ వెంటనే చికిత్స ప్రారంభించారు.

ఆయనతో పాటు అపోలో హాస్పటల్స్‌ వైద్యుల బృందం కూడా పవన్‌కు ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతానికి తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలు, అభిమానులు ముందుకు వస్తానని పవన్ తెలిపారని ఆంధ్రజ్యోతి రాసింది.

పవన్‌ కరోనా బారిన పడడంతో అన్నయ్య చిరంజీవి, వదిన సురేఖ, రామ్‌చరణ్‌, ఉపాసన ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తూ అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారని ఆంధ్రజ్యోతి వివరించింది.

తాయత్తులు

పసిబిడ్డను తల్లి గొంతుకోసిన ఘటనలో కొత్త విషయాలు

తెలంగాణ సూర్యాపేట జిల్లాలో పసిబిడ్డను కన్నతల్లే హత్య చేసిన ఘటనలో కొత్త విషయాలు బయటపడినట్లు సాక్షి దినపత్రిక కథనం ప్రచురించింది.

ఆరునెలల పసిబిడ్డ బలితో మేకలపాడు తండాలో విషాదం అలుముకుంది. మూఢ నమ్మకాలతో కన్న తల్లే గొంతుకోసి పసిపాప ప్రాణాలు తీయడంతో తండా వాసులు ఇంకా షాక్‌లోనే ఉన్నారు.

ఈ దారుణ ఘటనకు ముందు పరిస్థితుల గురించి ఆరా తీయగా, వారం రోజులుగా ఆ పాప తల్లి భారతి ఇంట్లో పూజలు చేస్తోంది. అదీ ఎవరూ లేనప్పుడు.. అగర్‌బత్తీ లు ముట్టించి కొబ్బరికాయలు కొడుతున్నట్లు తెలిసిందని సాక్షి రాసింది.

దీనిపై భర్త కృష్ణ ఇవేం పూజలు? అని ప్రశ్నిస్తే ఏమీ లేదులే .. అంటూ ఆమె దాటవేస్తూ వచ్చింది. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చి బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నాడు. కానీ తండ్రి చిన్న ఆదమరుపు ఆ పసిబిడ్డ ప్రాణాలు తీసింది.

సూర్యాపేట జిల్లా మోతె మండలం బుర్కచర్ల ఆవాసమైన మేకలపాడు తండాలో గురువారం భారతి తన ఆరునెలల కూతురును గొంతుకోసి బలిచ్చిన విషయం తెలిసిందే. దీంతో తండాఒక్కసారిగా ఉలిక్కిపడిందని పత్రిక రాసింది.

శుక్రవారం ఆ తండావాసులను ఎవరినీ పలకరించినా భయాందోళనలోనే ఉన్నారు.

తండాకు చెందిన భారతికి కృష్ణతో రెండో వివాహం జరిగింది. ఆమెకు ఆరేళ్లక్రితం మొదటి వివాహం జరిగింది. ఏం జరిగిందో తెలియదు కానీ విడాకులు తీసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత కృష్ణను ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.

అయితే, కొంతకాలంగా ఆమె మానసికస్థితి బాగా ఉండడం లేదని పలు ఆలయాలు, చర్చిలు, దర్గాలు తిప్పారు.

అందరితో కలిసి ఉన్నప్పుడు సాధారణంగా ఉంటుందని, ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం ఆమె మానసిక పరిస్థితి భిన్నంగా ఉంటుందని తండావాసులు చెబుతున్నారు.

ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు శివుడు ఫొటోతోపాటు యూట్యూబ్‌లో చూసి వారం రోజులుగా వివిధ దేవుళ్ల ఫొటోలకు అగర్‌బత్తీలు ముట్టించి, కొబ్బరికాయలు కొడుతోంది.

చుట్టుపక్కల వారికి అగర్‌బత్తీల వాసన వచ్చి రోజూ ఏం పూజలు చేస్తున్నావని ప్రశ్నిస్తే 'మీకేం అవసరం. దేవుడికి నా ఇష్టం వచ్చినట్లు పూజలు చేసుకుంటా'అని ఎదురు సమాధానం చెబుతుండడంతో వారు కూడా మిన్నకుండిపోయారని సాక్షి రాసింది.

ఈ విషయాన్ని భర్త కృష్ణ కూడా గమనిస్తూ వస్తున్నాడు. ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో కూతురు రీతును జాగ్రత్తగా చూసుకుంటున్నాడు.

గురువారం సూర్యాపేటకు వెళ్లిన ఆయన.. అత్తామామలకు చెప్పినా వారు కొంత ఆలస్యం చేయడంతో ఘోరం జరిగిపోయింది.

అంతలోనే భారతి కూతురును గొంతుకోసి చంపింది. ప్రస్తుతం తండాలో భారతి అంటేనే భయపడుతున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.

కృష్ణ్త ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల అనంతరం నిందితురాలు భారతిని అదుపులోకి తీసుకొంటామని చెప్పారని సాక్షి వివరించింది.

గాంధీ ఆస్పత్రిలో పూర్తిగా కోవిడ్ చికిత్సలు

హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిని ప్రభుత్వం పూర్తిగా కోవిడ్‌ చికిత్సకే కేటాయించిందని నమస్తే తెలంగాణ దినపత్రిక కథనం ప్రచురించింది.

రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో గాంధీ దవాఖానను మరోసారి పూర్తిస్థాయిలో కోవిడ్‌ చికిత్సకే కేటాయిస్తూ వైద్యారోగ్యశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.

శనివారం నుంచి ఔట్‌పేషెంట్‌ (ఓపీ)సేవలను నిలిపివేయనున్నారు. సాధారణ కేసులను తీసుకోకుండా అత్యవసర చికిత్స అవసరమైనవారిని చేర్చుకొని సేవలు అందించనున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా మారిత తర్వాత మరో దవాఖానలకు మార్చాలని వైద్యులకు ఆరోగ్యశాఖ సూచించింది.

ఇప్పటికే సాధారణ చికిత్స పొందుతున్నవారిని ఉస్మానియాకు, ప్రసూతి సేవలను పేట్లబుర్జు, సుల్తాన్‌బజార్‌ ప్రసూతి దవాఖానలకు తరలించి ఆ పడకలను కొవిడ్‌ బాధితులకు అందుబాటులో ఉంచాలని తెలిపింది.

బాధితులను ఆన్ని వార్డుల్లో చేర్చుకోవాలని గాంధీ హెచ్‌వోడీలను ఆదేశించింది. డ్యూటీ రోస్టర్‌ విధానాన్ని రూపొందించుకొని 24 గంటలపాటు సేవలను అందించాలని, అన్ని డిపార్ట్‌మెంట్లు కరోనా బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరంగా సేవలు అందించాలని పేర్కొన్నది.

ఇప్పటికే గాంధీలో 450కి పైగా కరోనా బాధితులు ఉన్నారు. గురువారం ఒక్క రోజే 150 మంది చేరారు. ప్రతి 10 నిమిషాలకు ఒక బాధితులు గాంధీలో చేరుతున్నారు.

ఈ నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా పడకలు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గాంధీలో శుక్రవారం నాటికి మొత్తం 1,890 పడకలు ఉండగా, 424 బాధితులు చికిత్స పొందుతున్నారు. 1,466 పడకలు ఖాళీగా ఉన్నట్టు హెల్త్‌ బులెటిన్‌లో వెల్లడించింది.

గాంధీలో ప్రస్తుతం దాదాపు 36 విభాగాలను కొవిడ్‌ కేంద్రాలుగా మార్చి సేవలందించనున్నారని నమస్తే తెలంగాణ వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Coronavirus: New sympotms in AP, virus that also spreads from the ovary
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X