పాక్ చుట్టూ మోదీ చక్రబంధం?
పాకిస్తాన్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి నిప్పులు చెరిగారు. ఘాటు వ్యాఖ్యలు చేశారు. కెనడాలోని కననాస్కిస్ లో ఏర్పాటైన జీ7 ఔట్రీచ్ సమ్మిట్ లో పాక్ ను ఎండగట్టారు. సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్నందుకు పాకిస్తాన్ కు తరచూ రివార్డులు సైతం లభిస్తోన్నాయంటూ చురకలు అంటించారు.
ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలు సాగిస్తోన్న పోరాటంలో ఎటువంటి ద్వంద్వ ప్రమాణాలకు అవకాశం ఉండకూడదని, దీనికి భిన్న పరిస్థితులు నెలకొన్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతు ఇచ్చే దేశాలకు తరచుగా రివార్డులు లభిస్తున్నాయని అన్నారు.

వివిధ అంతర్జాతీయ ఆర్థక సంస్థల నుంచి పాకిస్తాన్ బిలియన్ల డాలర్ల కొద్దీ సహాయాన్ని పొందుతోందని పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఆ నిధులను సరిహద్దు ఉగ్రవాదానికి మళ్లిస్తోందని ధ్వజమెత్తారు. నిధులన్నీ కూడా దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. దీనిపై ఆయా ఆర్థిక సంస్థలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సూచించారు.
ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో చోటు చేసుకున్న ఉగ్రదాడిని మోదీ ప్రస్తావించారు. మానవత్వంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. మానవత్వానికి .. ఉగ్రవాదం ప్రధాన శత్రువు అని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య విలువలను సమర్థించే ఏ దేశం కూడా ఉగ్రవాదాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించదని తేల్చి చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా శాంతియుత వాతావరణం నెలకొనాల్సిన అవసరం ఉందని, ఆ బాధ్యత తమ అందరిపై ఉందని మోదీ గుర్తు చేశారు. ఈ దిశగా తమ ఆలోచనలు, విధానాలు విస్పష్టంగా ఉండాలని పేర్కొన్నారు. ఏ దేశమైనా ఉగ్రవాదానికి అనుకూలంగా వ్యవహరిస్తే దానికి తగిన మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలకు ఆర్థిక సహాయం చేయడం ఎంతమాత్రం సరికాదని మోదీ అన్నారు. ఒకవంక- పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులు.. వంటి ప్రాధాన్యతా రంగాలకు నిధులను కేటాయిస్తూ మరోవంక ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలకు ఆర్థిక చేయూతను అందించడంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు.
గ్లోబల్ సౌత్ దేశాలు.. అనిశ్చితి, ఘర్షణపూరక వాతావరణంతో సతమతమౌతున్నాయని మోదీ గుర్తు చేశారు. ఆహారం, ఇంధనం, ఎరువులు, ఆర్థికరంగానికి సంబంధించిన సంక్షోభాల వల్ల ముందుగా దెబ్బతినేవి ఆయా దేశాలేనని చెప్పారు. గ్లోబల్ సౌత్ దేశాల ప్రాధాన్యతలను అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించడాన్ని బాధ్యతగా భావిస్తోన్నామని అన్నారు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అంశాన్నీ ప్రధాని మోదీ ప్రస్తావించారు. డీప్ ఫేక్ టెక్నాలజీ పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ ఆధారిత కంటెంట్ పై వాటర్-మార్కింగ్ లేదా స్పష్టమైన ప్రకటనను పొందుపర్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. సాంకేతికతను దుర్వినియోగడం చేయడం వల్ల అనర్థాలు సంభవిస్తాయని, దీనికి డీప్ ఫేక్ ఓ నిదర్శనమని అన్నారు.












Click it and Unblock the Notifications