వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోవిడ్-19: నిద్ర సరిగ్గా పట్టడం లేదా... ఎందుకో తెలుసుకోండి

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
నిద్ర

పరుపులు తయారుచేసే ఓ సంస్థ 2019లో 'స్లీప్ ఇంటర్న్‌షిప్‌'కు 20 పోస్టులు ప్రకటించింది. వాటి కోసం అక్షరాలా 1.7 లక్షల దరఖాస్తులు వచ్చాయి.

ఈ స్లీప్ ఇంటర్న్‌షిప్‌లో 100 రోజుల పాటు రోజుకు తొమ్మిది గంటల చొప్పున నిద్రపోవాలని నియమం. దీని కోసం ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు చెల్లిస్తామని ఆ సంస్థ ప్రకటించింది.

"ఇందులో పెద్ద కష్టమేముంది. నేను సులువుగా రోజూ తొమ్మిది గంటలు నిద్రపోతాను అనుకుని దరఖాస్తు పెట్టాను. కానీ, అదెంత కష్టమో ఇంటర్వ్యూకు హాజరయ్యాకే తెలిసింది" అని ఓ వ్యక్తి చెప్పారు.

మీకు కూడా అలాగే అనిపిస్తుందా? ఏకబిగిన ఎనిమిది, తొమ్మిది గంటలు పడుకోవడం కష్టమా?

నిద్రలేమి సమస్య చాలామందికి ఉంటుంది. ప్రతీ పది మందిలో ముగ్గురు నిద్రలేమితో బాధపడుతున్నారని అధ్యయనాల్లో తేలింది.

కోవిడ్-19 నుంచి కోలుకున్న రోగులలో కూడా పది మందిలో ముగ్గురు నిద్ర సమస్యలతో బాధపడుతున్నారని పరిశోధనలు చెబుతున్నాయి.

అయితే, నిద్రకు సంబంధించిన ప్రతి సమస్యా జబ్బు కానవసరం లేదు.

నిద్రలేమిని ఎప్పుడు వ్యాధిగా పరిగణిస్తారో వైద్యులను సంప్రదించి తెలుసుకోవాల్సిందే.

నిద్ర

నిద్రలో దశలు

నిద్రలో ఒక సైకిల్ 90 నిమిషాలు ఉంటుంది. ఒక రాత్రి నిద్రలో మనం సుమారు 4-5 సైకిళ్లను పూర్తి చేస్తామని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ అలైడ్ సైన్సెస్ (ఐహెచ్‌బీఏఎస్) సీనియర్ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఓం ప్రకాశ్ వివరించారు.

"90 నిమిషాల సైకిల్లో మొదటి దశను 'నాన్-రాపిడ్ ఐ మూవ్‌మెంట్' (ఎన్ఆర్ఐఎం) అంటాం. మామూలు మాటల్లో చెప్పాలంటే గాఢ నిద్ర. రెండో దశతో పోల్చుకుంటే ఇది ఎక్కువ సమయం ఉంటుంది. సుమారు 60-70 నిమిషాలు ఇది కొనసాగుతుంది.

రెండో దశను 'రాపిడ్ ఐ మూవ్‌మెంట్' (ఆర్ఐఎం) అంటాం. ఈ దశలోనే మనం కలలు కంటాం. ఈ దశలో జరిగేవన్నీ సాధారణంగా మనకు గుర్తుంటాయి.

నిద్రలోకి జారుకున్నాక క్రమంగా ఎన్ఆర్ఐఎం తగ్గుతూ ఆర్ఐఎం పెరుగుతుంటుంది.

నిద్రలేమితో బాధపడేవారికి ఈ రెండు దశల్లో ఒకదానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి.

ఎన్ఆర్ఐఎం దశలో సమస్య ఉన్నవాళ్లు, నాకసలు ఒంటి మీద తెలివే లేదు. బాగా నిద్రపోయాను అని చెప్తారు.

ఆర్ఐఎంతో సమస్యలు ఉన్నవాళ్లు, తొందరగా మెలకువ వచ్చేసిందని, సరిగా నిద్రపోలేదని చెప్తారు.”

నిద్ర

నిద్రలేమి ఎప్పుడు జబ్బుగా మారుతుంది?

నిద్ర సమస్యలంటే నిద్రలేమి, అధిక నిద్ర, గురక, టెర్రర్ అటాక్ రావడం ఇలా అనేక రకాలుగా ఉంటాయి.

కోవిడ్-19 నుంచి కోలుకున్నాక వచ్చే నిద్ర సమస్య జబ్బు కావపోవచ్చు.

"నిద్ర సమస్యలు, అవి జబ్బుగా మారడం రెండూ వేరు వేరు. ఎలాగంటే, ఆకలి అనేది ఒక సమస్య కాదు. కానీ ఆకలేసినప్పుడల్లా విపరీతంగా తినడం, కనిపించిన ప్రతిదీ తినడం రుగ్మత (డిజార్డర్) కిందకు వస్తుంది. అలాగే నిద్ర విషయంలో కూడా ఈ రెండింటికీ తేడా ఉంది" అని డాక్టర్ ఓం ప్రకాశ్ తెలిపారు.

ప్రతి ఒక్కరూ నెలలో మూడు, నాలుగు రోజులు సరిగా నిద్రపోలేదని చెప్తారు. కోవిడ్-19 నుంచి కోలుకున్నవారు కూడా ఇలాగే చెప్తే అది రుగ్మత కాదు.

డిప్రెషన్, ఆందోళన, ఊపిరితిత్తుల సమస్య ఉన్నవారికి నిద్రపట్టకపోయే సమస్య ఎక్కువగా ఉంటుంది.

దీనివలన కలిగే దుష్ప్రభావాలు అనేకం. జ్ఞాపకశక్తి కోల్పోవడం, త్వరగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం, అంటు వ్యాధులు త్వరగా సోకడం, ఊబకాయం. వీటిని చాలామంది గమనిస్తూ ఉంటారుగానీ పట్టించుకోరు.

నిద్ర

నిద్రలేమి రుగ్మతగా మారే లక్షణాలు

నిద్రలేమి జబ్బుగా మారే ప్రారంభ దశలో కనిపించే మూడు లక్షణాలను డాక్టర్ ఓం ప్రకాశ్ వివరిస్తున్నారు.

మొదటిది, నిద్ర గంటలు తగ్గిపోవడం. రెండవది, నిద్ర నాణ్యత తగ్గడం, నిద్రవేళల్లో ఇబ్బంది.

ప్రతీ వ్యక్తికి నిద్ర అవసరం ఒకేలాగ ఉండదు. కొంతమందికి రోజులో 5-6 గంటలు నిద్రపోయినా చాలు, రోజంతా ఉత్సాహంగా ఉంటారు. వీరిని 'షార్ట్ టర్మ్ స్లీపర్స్' అంటారు. మరి కొంతమంది 8-9 గంటలు నిద్రపోతారు. వీరిని 'లాంగ్ టర్మ్ స్లీపర్స్' అంటారు.

ఐదారు గంటలు నిద్రపోయేవారు రెండు, మూడు గంటలే పడుకుంటే... ఎనిమిది, తొమ్మిది గంటలు నిద్రపోయేవారు ఐదారు గంటలే పడుకుంటే నిద్రలేమి వ్యాధిగా మారే ప్రారంభ దశలో ఉన్నట్టు లెక్క.

ఈ సమస్య రెండు, మూడు వారాల పాటు కొనసాగితే వైద్యులను సంప్రదించడం మంచిది. ముందు జనరల్ ఫిజిషియన్‌ను కలుసుకుని, వారి సలహా మేరకు మానసిక వైద్యులను సంప్రదించాలి.

రెండోది, నిద్ర నాణ్యత. 8-10 గంటలు నిద్రపోతారుగానీ కనీసం 4-5సార్లు మధ్యలో మేల్కొంటారు. సరిగా పడుకున్నట్లు అనిపించలేదని చెప్తారు. ఇలా జరిగితే కూడా నిద్రలేమి, వ్యాధి కాబోతున్న సూచనే.

నిద్ర

మూడవ లక్షణం నిద్రవేళలు. మంచంపైకి చేరిన కొన్ని గంటలకుగానీ కొంతమందికి నిద్రపట్టదు. ఊరికే అటూ ఇటూ దొర్లుతుంటారు తప్ప చాలాసేపటికిగానీ నిద్రపోరు. దీన్ని ప్రారంభ నిద్రలేమి (ఇనిషియల్ ఇన్సోమ్నియా) అంటారు.

కొంతమంది తొందరగానే నిద్రపోతారు. కానీ, అర్థరాత్రి మేలుకుని కూర్చుంటారు. దీన్ని మిడిల్ ఇన్సోమ్నియా అంటారు.

కొంతమందికి తెల్లవారుజామున నిద్రపడుతుంది. దీన్ని టెర్మినల్ ఇన్సోమ్నియా అంటారు.

ఈ మూడు రకాల సమస్యల్లో ఏది కనిపించినా వెంటనే డాక్టరును కలవాలి.

నిద్రలేమి సమస్య ఉందో లేదో తెలుసుకోవడానికి మరొక మార్గం స్లీప్ హైజినిస్ట్. ఇందులో ప్రశ్నలకు సమాధానం చెప్పడం ద్వారా నిద్ర సమస్యలు ఉన్నాయో లేవో తెలుసుకోవచ్చు. వ్యాధి లక్షణాలు స్పష్టంగా తెలిస్తే తప్ప చికిత్స ఏమిటో తెలీదు. కనుక, వ్యాధి లక్షణాలు తెలుసుకోవడం ముఖ్యం.

నిద్ర

కోవిడ్-19 తరువాత నిద్ర సమస్యలు

కోవిడ్-19 సోకినవారు, లేనివారు కూడా వివిధ రకాల మానసిక ఒత్తిడులను ఎదుర్కొంటున్నారని చెన్నై ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ పూర్ణ చంద్రిక అంటున్నారు.

"కరోనా కాలంలో ప్రజల జీవనశైలి మారిపోయింది. కోవిడ్ సోకిన తరువాత ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి వస్తోంది. ఇంట్లోనే లేదా ఆస్పత్రుల్లో ఒక్కరే గడపాల్సి వస్తోంది. ఇది మానసిక ఆరోగ్యం మీద దెబ్బ తీస్తోంది. కోవిడ్ లేనివారు కూడా రోజుల తరబడి ఎవరినీ కలవకుండా ఇంట్లో నాలుగు గోడల మధ్య బందీ అయిపోవడం, బయటికెళ్లి వ్యాయామం చేసే అవకాశం లేకపోవడం, స్నేహితులను, బంధువులను కలవలేకపోవడం, ఎక్కువగా సోషల్ మీడియాపై ఆధారపడడం మానసిక ఒత్తిడిని పెంచుతోంది.

ప్రజలు రకరకాల సమస్యలతో పోరాడుతున్నారు. ఎక్కడ చూసినా అనిశ్చితి, అస్థిరత. రోజంతా ఇంట్లోనే ఉండడంతో దినచర్య మారిపోతోంది. నిద్రవేళలు మారిపోతున్నాయి. ఇవన్నీ నిద్ర సైకిలు మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఈ సమస్యలు ఇప్పుడు ఎక్కువమందిలో కనిపిస్తున్నాయి. దీంతో ఎక్కువమంది నిద్రకు సంబంధించిన సమస్యల బారిన పడుతున్నారు. ఈ నిద్రలేమి రుగ్మత కావొచ్చు. లేదా ఇంకేదైనా వ్యాధికి సూచన కూడా కావొచ్చు" అని డాక్టర్ చంద్రిక వివరించారు.

కరోనా నుంచి కోలుకున్నవారిలో అధికంగా నిద్ర సమస్యలు కనిపిస్తున్నాయి. డాక్టర్లలో కూడా ఈ సమస్యలు ఎదుర్కొంటున్నవారు ఎక్కువే.

2020లో లాన్సెట్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, చైనాలో కరోనా సమయంలో 35 లేదా అంతకన్నా ఎక్కువ వయసు ఉన్న 7236 మందిలో నిద్ర క్రమాన్ని అధ్యయనం చేశారు. వీరిలో కొందరు హెల్త్ వర్కర్లు కూడా ఉన్నారు.

వీరిలో 35 శాతం మందికి జనరల్ డిప్రెషన్ ఉందని, 20 శాతం మందికి పూర్తి డిప్రెషన్, 18 శాతానికి నిద్రలేమి సమస్యలు ఉన్నాయని తేలింది. వీటన్నిటికీ కారణం కరోనా గురించి ఆందోళన, దిగులు.

నిద్ర

దీనికి పరిష్కారం ఏమిటి?

శుభ్రమైన నిద్ర ఆరోగ్యానికి మేలని డాక్టర్ ఓ ప్రకాశ్, డాక్టర్ చంద్రిక కూడా సూచిస్తున్నారు.

నిద్రకు ఉపక్రమించే ముందు నిద్రపోయేటప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించాలని వీరు సూచిస్తున్నారు. దీన్నే స్లీప్ హైజిన్ అంటారు.

  • పడుకోవడానికి రెండు గంటలముందు టీ, కాఫీలు తాగకూడదు.
  • కడుపు నిండా భోజనం చేయకూడదు.
  • నిద్రపోయే ముందు సిగరెట్ తాగకూడదు.
  • పడుకోవడానికి ఒక నిర్దిష్టమైన స్థలన్ని కేటాయించుకోవాలి. పక్క మీద తినడం, చదువుకోవడం, ఆటలాడుకోవడం లాంటివి చేయకుండా ఉంటే మేలు.
  • రోజులో ఎప్పుడైనా చిన్న కునుకు తీయాలనిపిస్తే, ఆ మంచం మీద మాత్రం పడుకోకండి.
  • నిద్రపోవడానికి రెండు గంటల ముందు నుంచి ఎలాంటి స్క్రీన్ చూడకండి.
  • నిద్రలో పదే పదే బాత్రూంకు లేవాల్సి వస్తే, వెంటనే వైద్యులను సంప్రదించి ఆ సమస్యను పరిష్కారాన్ని కనుక్కోండి.
  • మధుమేహం, రక్తపోటు ఉన్నవారు మర్చిపోకుండా ఆ మాత్రలు వేసుకోవాలి.
  • ఒక నిర్దిష్టమైన దినచర్య అవలంబించడం మంచిది. రోజూ ఒకే సమయానికి తినడం, పడుకోవడం చేయాలి.

వీటిని అనుసరిస్తే నిద్ర సమస్యలను చాలావరకు జయించవచ్చు. ఇలా చేసిన తరువాత కూడా నిద్రలేమి బాధపెడుతూ ఉంటే వైద్యులను సంప్రదించడమే మేలు.

నిద్రలేమిని తగ్గించడానికి రెండు మూడు వారాలు మందులు వేసుకోవచ్చని డాక్టర్ చంద్రిక అంటున్నారు.

మీ సమస్యను పరిశీలించి డాక్టర్లు సరైన మందులు సూచిస్తారు. అయితే ఇవి అడిక్ట్ అయిపోయే నిద్రమాత్రలు కావు. రెండు మూడు వారాలు మందులు వేసుకున్నాక చాలావరకు మీ సమస్యలు తగ్గుతాయని డాక్టర్ చంద్రిక తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Covid-19: Find out if you are sleeping properly or not
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X