"మామిడికాయ పులిహోర".. ఇలా చేస్తే టేస్ట్ నెక్ట్స్ లెవెల్ అంతే..!
వేసవి సీజన్ లో మామిడికాయ అంటేనే నోరూరుతుంది. మరి మామిడికాయతో పప్పు, పచ్చడి చేసుకోవడం చూస్తుంటాం.. ఇంకొంతమంది మామిడికాయతో పులిహోర కూడా చేసుకుంటారు. అయితే చాలా మందికి టేస్ట్ సరిగా రాదు.. పులుపుగానో చప్పగానో అవుతుంది. అయితే ఫర్ ఫెక్ట్ కొలతలతో మామిడికాయ పులిహోర చేస్తే ఆ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మరి సూపర్ టేస్టీ మామిడికాయ పులిహోరను ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? తక్కువ పదార్థాలతో ఈ వంటకాన్ని ఎలా తయారు చేయాలి..? పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం..
మామిడికాయ పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. వండిన అన్నం ఒక కిలో, పచ్చిమామిడికాయ తురుము ఒకటిన్నర కప్పు, వేరుశనగ పప్పు ఒక కప్పు, శనగపప్పు, మినప్పప్పు తలో ఒక టేబుల్ స్పూన్, ఆవాలు ఒక టేబుల్ స్పూన్, పసుపు పొడి ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్, ఇంగువ అర టేబుల్ స్పూన్, కరివేపాకు నాలుగు రెబ్బలు, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి నాలుగు నుంచి ఐదు చీల్చినవి, బెల్లం తురుము కొద్దిగా, ఎండుమిర్చి నాలుగు, నూనె అర కప్పు తీసుకోవాలి.
మామిడికాయ పులిహోర తయారీ విధానం చూస్తే.. ముందుగా పచ్చిమామిడికాయను శుభ్రంగా కడిగి, తొక్క తీసి సన్నగా తురుముకోవాలి. దాన్ని పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు వండిన అన్నం చల్లారిన తర్వాత, అందులో కొద్దిగా ఉప్పు, పసుపు అలాగే కరివేపాకు వేయాలి. ఆ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఇప్పుడు ఒక బాణలిలో నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పల్లీలు, పప్పులను వేసి వేయించుకోవాలి.

ఇప్పుడు ఈ తాలింపులో మామిడికాయ తురుము వేసి, మామిడికాయ తురుమును పచ్చి వాసన పోయేంత వరకూ వేయించుకోవాలి. అలాగే అందులో బెల్లం తురుము కూడా కలిపి నూనె పైకి తేలేంత వరకూ వేయించుకోవాలి. దాంతో మామిడికాయ తురుము సిద్ధం అవుతుంది. ఇప్పుడు ఉడికిన మామిడికాయ మిశ్రమాన్ని చల్లారిన అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమం మొత్తం అన్నంలో బాగా కలిసేలా చూసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, మామిడికాయ పులుపు సరిచూసుకోవాలి. అలా మామిడికాయ పులిహోరను ఒక గంటపాటు పక్కన పెట్టుకోవాలి. అంతే సూపర్ టేస్టీ మామిడికాయ పులిహోర రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications