కుంభమేళా నుంచి వైదొలగిన జునా అఖాడా -కరోనా విలయం, ప్రధాని మోదీ పిలుపుతో..
ప్రతిష్టాత్మక కుంభమేళా ఉత్సవం నుంచి మరో వైదిక సంస్థ వైదొలగింది. కరోనా వైరస్ విజృంభిస్తోన్న వేళ కుంభమేళా వేడుకను ఇకపై ఒక సంకేతంగా మాత్రమే చూడాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు కుంభ మేళాను శనివారంతో ముగించినట్లు ప్రఖ్యాత జునా అఖాడా ప్రకటించింది. 13 ముఖ్యమైన అఖాడాల్లో ఒకటైన జునా అఖాడా ఈ నిర్ణయం తీసుకోడానికి ఒక రోజు ముందే నిర్వాణీ అఖాడా తమ పీఠాధిపతి కరోనాతో కన్నుమూయడంతో కుంభమేళా నుంచి వైదొలిగింది.
హరిద్వార్ లోని గంగా తీరంలో ఈనెల 30 వరకు కుంభమేళా సాగనుండగా, గడిచిన వారంలో 68 మంది ప్రముఖ స్వాములకు వైరస్ సోకడం, అందులో నిర్వాణీ అఖాడా పీఠాదిపతి మృత్యువాతకు గురికావడం, ప్రమదకర పరిస్థితుల్లో మేళాను కొనసాగించడం సరికాదని సర్వత్రా వినతులు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రధని మోదీ ఇవాళ కీలక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ వెంటనే జునా అఖాడా కుంభమేళా నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది.

కోవిడ్ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడటమే తమకు అత్యంత ముఖ్యమైన అంశమని జునా అఖాడాకు చెందిన స్వామి అవధేశానంద గిరి అన్నారు. కుంభ మేళా సందర్భంగా స్వాగతించిన అందరు దేవతలకు శనివారం ఉద్వాసన పూజలు నిర్వహించామని, జునా అఖాడా తరపున కుంభ మేళాకు ముగింపు పలికామని, కరోనా మహమ్మారి ఉధృతి పెరుగుతుండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. అంతేకాదు,
కుభమేళాలో కరోనా వ్యాప్తిపై ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపునకు సమ్మతించాలని ఇతర సాధు, సంతులను కూడా కోరుతున్నట్లు జునా అఖాడా స్వామి గిరి చెప్పారు. మిగిలిన రెండు పవిత్ర స్నానాల్లోనూ నామమాత్రంగా సాధువులు మాత్రమే పాల్గొనాలని కోరారు. కోవిడ్ కేసులు పెరుగుతున్నందువల్ల ఈ మహమ్మారిపై పోరాటాన్ని బలోపేతం చేయడానికి వీలుగా కుంభ మేళాను లాంఛనప్రాయంగా నిర్వహించాలని ప్రధాని మోదీ కోరారు.












Click it and Unblock the Notifications