ఇండియన్ ఆర్మీకి రూ. లక్ష కోట్లు, ఫుల్ పవర్స్.. చైనా, పాకిస్థాన్ ఖేల్ ఖతం..!
భారత్ కు సరిహద్దు దేశాలైన పాకిస్థాన్, చైనాతో ఎప్పుడూ ముప్పు పొంచే ఉంది. గతేడాది పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. భారత్ పై దాడులు చేసేందుకు పాకిస్థాన్ కు చైనా ఆయుధాలు సరఫరా చేసింది. అలాగే చైనాతోనూ గతంలో గాల్వాన్ ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో భారత్ ఆర్మీ ఇరు దేశాల కుట్రలు, కుతంత్రాలను ఎప్పటికప్పుడు ఎండ గడుతూ వస్తూనే ఉన్నాయి.
భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ సైన్యానికి అత్యాధునిక శతఘ్నులు, క్షిపణులను సమకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలోని రక్షణ కొనుగోళ్ల మండలి శుక్రవారం నిర్వహించే అత్యున్నత స్థాయి సమావేశంలో లక్ష కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన రక్షణ ప్రాజెక్టులకు ఆమోదం తెలపనున్నారు. ముక్కోణపు దళాల ఆధునికీకరణ ప్రణాళికల్లో ఇది అత్యంత కీలకమైన అడుగు అని రక్షణ రంగ నిపుణులు బలంగా విశ్వసిస్తున్నారు.
ఈ ప్రతిపాదనల్లో సింహభాగం భారత సైన్యానికి (ఆర్మీ) దక్కనుంది. సరిహద్దుల్లో వ్యూహాత్మక పటిష్టం కోసం కదులుతూ దాడి చేసే 300 కే-9 వజ్ర శతఘ్నులను అదనంగా నిర్మించి సేకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. భారతీయ రక్షణ పరిశ్రమలే వీటిని తయారు చేస్తుండడం విశేషం. దీనితో పాటు ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య జరుగుతున్న తీవ్ర యుద్ధ పరిణామాల నేపథ్యంలో, ఆధునిక యుద్ధాలలో కీలకపాత్ర పోషిస్తున్న లాయిటరింగ్ మ్యునిషన్స్ (ఆత్మహుతి డ్రోన్లు) సేకరణ కూడా ఇందులో కీలకం కానుంది.
సైన్యానికి అత్యాధునిక రక్షణ వ్యవస్థలు
శత్రువుల వైమానిక దాడులను సమర్థంగా తిప్పికొట్టేందుకు రష్యా నుంచి అత్యాధునిక 'వెర్బా' మ్యాన్‌ప్యాడ్స్ (భుజంపై నుంచి ప్రయోగించే క్షిపణులు) కొనుగోలు చేయనున్నారు. శత్రు విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను గాల్లోనే కూల్చేయడానికి ఆర్మీకి ఇవి కవచంలా ఉపయోగపడతాయి. అలాగే సరిహద్దుల్లో ఉంచే మన యుద్ధ ట్యాంకులు, ఇతర సాయుధ వాహనాల భద్రత కోసం అత్యంత శక్తిమంతమైన యాక్టివ్ ప్రొటెక్షన్ సిస్టమ్స్ (APS) కొనుగోలుపై కూడా ఈ సమావేశంలో ప్రాథమిక ఆమోదం లభించనుంది.
భారత వైమానిక దళం (IAF) ప్రయోజనాల కోసం శత్రు స్థావరాలపై సుదూర పరిధి నుంచి ఖచ్చితమైన దాడులు చేసే లాంగ్-రేంజ్ స్టాండ్-ఆఫ్ మిస్సైళ్లు, యుద్ధ విమానాలకు గాల్లోనే ఇంధనం నింపే ప్రత్యేక ఎయిర్-టు-ఎయిర్ రీఫ్యూయెలింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోలు ప్రతిపాదనలు ఈ జాబితాలో ఉన్నాయి. దీనికి తోడు మన దేశ వాయు సరిహద్దుల భద్రతను పర్యవేక్షించేందుకు అత్యంత శక్తిమంతమైన రక్షణ రాడార్ వ్యవస్థలను కూడా సేకరించాలని రక్షణశాఖ సిద్ధమైంది.

మరోవైపు నౌకాదళం (నేవీ) బలాన్ని పెంచడంలో భాగంగా నీటి అడుగున శత్రువుల కదలికలను కనిపెట్టే స్వయంప్రతిపత్తి గల వినూత్న వాహనాలు, భారీ రకం టార్పెడోలు, మానవ రహిత ఉపరితల నౌకల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశం ఉంది. ఈ భారీ కొనుగోళ్లన్నీ ప్రధానంగా 'మేక్ ఇన్ ఇండియా' విధానంలోని స్వదేశీ కొనుగోలు పరిధిలోనే జరగనున్నాయి. రక్షణ రంగంలో ఆత్మ నిర్భరత పెంచడమే కాకుండా, సరిహద్దు శత్రు సవాళ్లను ఎదుర్కోవడానికి మన రక్షణ దళాలు సర్వసన్నద్ధంగా ఉండేందుకు ఈ నిర్ణయాలు దోహదపడతాయి.












Click it and Unblock the Notifications