• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దిల్లీ: ఐసీయూ వార్డు విడిచిపెట్టి వెళ్లిపోయిన డాక్టర్లు.. ఆక్సిజన్ అందక చనిపోయిన రోగులు

By BBC News తెలుగు
|
కృతి హాస్పిటల్

కోవిడ్ సెకండ్ వేవ్ దేశాన్ని కుదిపేస్తున్న సమయంలో ఏప్రిల్‌ నెలలో దిల్లీలోని ఒక ఆస్పత్రి వార్డులో ఘోర విషాదం చోటు చేసుకుంది.

ఓ రాత్రి, ఐసీయూ వార్డులో ఉన్న రోగులను అలాగే వదిలేసి డాక్టర్లు, ఇతర సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. దాంతో ఆరుగురు రోగులు ప్రాణాలు కోల్పోయారు.

వార్డులో ఉన్న ఈ ఆరుగురి మృతదేహాల వీడియో ఎంత వేగంగా వైరల్ అయిందో అంతే వేగంగా ఆ వార్త కనుమరుగైపోయింది.

ఆ రోజు రాత్రి ఏం జరిగింది? వాళ్లెలా చనిపోయారు? అనే ప్రశ్నలు మాత్రం మిగిలిపోయాయి.

పక్కన ఎవరూ లేక, చికిత్స అందక వారలా అర్థంతరంగా మరణించడంతో బంధువులు కుమిలిపోతున్నారు.

వైరల్ అయిన వీడియో ఫుటేజీలో వినిపిస్తున్న మాటలు, దృశ్యాలు కలవరపెడుతున్నాయి. ఇక్కడ ఎవరూ లేరంటూ ఓ వ్యక్తి చెప్తున్న మాటలు వెనుక నుంచి వినిపిస్తున్నాయి.

బంధువులు తమ ఆత్మీయులను బతికించుకోవడం కోసం కంగారుగా అటూ ఇటూ తిరుగుతుండగా.."డాక్టర్‌గానీ, కెమిస్ట్‌గానీ ఇక్కడ లేరు. రిసెప్షన్‌లో కూడా ఎవరూ లేరు" అని ఆ వ్యక్తి అంటున్నారు.

"మీరిక్కడ ఉంటుండగానే రోగులను అలా గాలికొదిలేసి డాక్టర్లు ఎలా వెళ్లిపోతారు?" అని ఒక వ్యక్తి అక్కడ ఉన్న ఓ పోలీసు ఆఫీసరుని నిలదీస్తున్నారు.

"చనిపోయారు, అందరూ చనిపోయారు” అని మరో వ్యక్తి పక్క నుంచి అంటున్నారు.

దహనాలు

అసలేం జరిగింది?

ఏప్రిల్ 30 రాత్రి గురుగ్రామ్‌లోని కృతి ఆస్పత్రి ఐసీయూలో ఈ వీడియో తీశారు.

"ఆస్పత్రిలో ఎక్కడా డాక్టర్లు కనిపించకపోయేసరికి తప్పనిసరై ఐసీయూ లోపలికి వెళ్లామని, అక్కడా కూడా ఎవరూ కనిపించలేదని" చనిపోయినవారి బంధువులు చెబుతున్నారు.

ఆస్పత్రిలో ఆక్సిజన్ నిండుకోగానే డాక్టర్లు రోగులను ఎక్కడికక్కడ విడిచిపెట్టి వెళిపోయారని వారంతా ఆరోపిస్తున్నారు.

చనిపోయినవారి కుటుంబ సభ్యులు దాడి చేస్తారన్న భయంతో అక్కడి నుంచి పారిపోయి, ఆస్పత్రిలోనే మరోచోట దాక్కున్నామని డాక్టర్లు చెబుతున్నారు.

మేం ఎలాంటి బెదిరింపులకు పాల్పడలేదని కుటుంబ సభ్యులు అంటున్నారు.

ఇది జరిగి నెల పైనే అవుతున్నా ఆ ఆరుగురి మరణాలకు కారణమేంటో ఇంకా తెలియలేదు. పోలీసు కేసు నమోదు చేయలేదు.

గురుగ్రామ్ డిప్యుటీ కమిషనర్ యష్ గార్గ్ ఈ దర్యాప్తు ఎప్పుడు ముగుస్తుందో స్పష్టంగా చెప్పలేదు.

కుటుంబ సభ్యులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.

'మాకు న్యాయం కావాలి'

కోవిడ్ రెండో దశలో ఏప్రిల్‌కు వచ్చేసరికి దేశంలో తీవ్రమైన ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఆక్సిజన్, మందులు, పడకల కొరతతో దేశ ఆరోగ్య వ్యవస్థ అతలాకుతలమైంది. రోగులు ఆస్పత్రుల బయటే పడిగాపులు కాస్తూ ప్రాణాలు వదిలారు. స్మశానవాటికలు నిండిపోయాయి.

ఆక్సిజన్ కోసం రోగుల బంధువులు పరుగులు పెట్టారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు.

ఆక్సిజన్ కోసం అభ్యర్థనలతో సోషల్ మీడియా వెల్లువెత్తింది. దేశమంతా విషాదంతో నిండిపోయింది.

కీర్తి ఆస్పత్రిలో ఈ ఆరుగురి మరణం అలాంటి అనేక విషాదాల్లో ఒకటి. కానీ, ఆ వీడియోలో వినిపించిన మాటలు, కనిపించిన దృశ్యాలు దిగ్భ్రాంతికి గురి చేశాయి. పరిస్థితులు ఎంత దిగజారిపోయాయో ప్రపంచానికి తెలియజేశాయి.

ఆక్సిజన్ సిలిండర్లు తెచ్చుకుంటున్న రోగుల బంధువులు

మెల్లగా ఈ వార్త మీడియా నుంచి కనుమరుగైపోవడంతో చనిపోయినవారి కుటుంబ సభ్యులు నిరాశలో కూరుకుపోయారు.

ఈ విషాదం తరువాతి పరిణామాలను సమన్వయం చేసుకోవడం కోసం ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ అంతా తీవ్ర విషాదం అలముకుంది.

"మరణించిన మా ఆత్మీయులకు న్యాయం జరగాలి" అంటూ 17 ఏళ్ల నమో జైన్ ఆ గ్రూపులో రాశారు. ఆ రాత్రి చనిపోయినవారిలో నమో తండ్రి కూడా ఉన్నారు.

వీరందరికీ ఇంతకు ముందు పరిచయం లేదు. ఈ దుర్ఘటన తరువాత వీరంతా వాట్సాప్ ద్వారా కలిశారు.

"మాకెవ్వరికీ ముఖ పరిచయాలు లేవు. కానీ, మేమంతా కలిసికట్టుగా పోతాడుతున్నాం" అని నిరుపమ వర్మ అన్నారు. నిరుపమ తల్లి గీతా సిన్హా కూడా ఆరోజు రాత్రి కీర్తి ఆస్పత్రిలో చనిపోయారు.

కీర్తి ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఉన్నట్లు తమకు చెప్పలేదని తండ్రిని కోల్పోయిన అమన్‌దీప్ చావ్లా అన్నారు.

"రెండు వాహనాలు ఆక్సిజన్ తీసుకురావడానికి వెళ్లాయని, భయపడాల్సిన అవసరం లేదని ఆస్పత్రి సిబ్బంది మాకు చెప్పారు" అని ఆయన అన్నారు.

ప్రధాన ద్వారం దగ్గర ఆక్సిజన్ సిలిండర్లు వరుసగా పేర్చి ఉండడం చూశానని చావ్లా చెప్పారు. అయితే, రాత్రి 9.00 అవుతుండగా, వాటిల్లో చాలా సిలిండర్లు మాయమైపోయాయని, దాంతో వారంతా ఆందోళన చెందారని చెప్పారు.

సమయం గడుస్తున్నకొద్దీ బంధువుల్లో కంగారు ఎక్కువైంది. కాసేపటికి ఆస్పత్రి సిబ్బంది ఎవరూ అక్కడ లేరన్న విషయం బంధువులు గమనించారు.

అంతా అనుమానాస్పదంగా కనిపించడంతో కొంతమంది ఐసీయూలోకి వెళ్లి చెక్ చేయాలని నిర్ణయించుకున్నారు.

అక్కడకు వెళ్లేసరికి ఐసీయూ వార్డులో ఎవరూ లేరని, తమ ఆత్మీయుల మృతదేహాలు మాత్రమే కనిపించాయని వారు చెప్పారు.

"డాక్టర్లు లేరు, ఆస్పత్రి సిబ్బంది కనిపించలేదు. అందరూ పారిపోయారు" అని చావ్లా అన్నారు.

ఆస్పత్రి యాజమాన్యం ఏమంటోంది

ఆ రోజు రాత్రి ఏ సమయంలో ఏం జరిగిందన్న విషయాలను బీబీసీ కచ్చితంగా ధ్రువీకరించలేకపోయింది. ఆరాత్రి సంఘటనల గురించి రెండు మూడు కథనాలు వినిపించాయి.

డాక్టర్లు ఆస్పత్రి వార్డు విడిచిపెట్టి ఎప్పుడు వెళ్లిపోయారు, ఆ సమయంలో రోగులు బతికే ఉన్నారా వంటి విషయాలు స్పష్టంగా తెలియలేదు.

కుటుంబ సభ్యులు దాడి చేయడంతో ఆస్పత్రి సిబ్బంది "కొంతసేపు వేరే చోట దాక్కున్నారని" ఆ ఆస్పత్రి యజమాని స్వాతి రాథోడ్ బీబీసీకి చెప్పారు.

కాగా, ఈ ఆరోపణలను కుటుంబ సభ్యులు ఖండిస్తున్నారు.

"రక్షణ కోసం దాక్కోవడానికి, రోగులను విడిపెట్టి వెళ్లిపోవడానికి తేడా ఉంది" అని రాథోడ్ అన్నారు.

పోలీసులను పిలిచేంతవరకు బయటకు రావొద్దని సిబ్బందికి తానే చెప్పానని ఆమె తెలిపారు.

కోవిడ్ రోగులు

రాథోడ్, బీబీసీకి ఒక వీడియో పంపించారు. అందులో, అంతకు ముందు వారం కొందరు ఆస్పత్రి సిబ్బందిపై దాడి చేస్తున్నట్లు, ఆస్పత్రిని ధ్వంసం చేసినట్లు కనిపిస్తోంది.

ఐసీయూలో రోగులు మరణించిన రాత్రి కూడా ఇలాంటి దృశ్యాలే పునరావృతమయ్యాయని ఆమె చెప్పారు.

"మాపై మరో దాడి జరగడానికి వీల్లేదు" అని రాథోడ్ అన్నారు.

ఆస్పత్రి సిబ్బంది వార్డును విడిచిపెట్టడమే కాకుండా, ఆక్సిజన్ కొరత గురించి తమకు ఎలాంటి సమాచారం అందించలేదని బంధువులు ఆరోపిస్తున్నారు.

"ఆస్పత్రిలో ఆక్సిజన్ అయిపోతోందని మాకు ముందే చెప్పాలి కదా. మా ఇంటి దగ్గర మూడు ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయి. మా చెల్లి ఒక ఆక్సిజన్ సిలిండర్ ఆస్పత్రికి తీసుకొచ్చేసరికే మా నన్న చనిపోయారు" అని జైన్ చెప్పారు.

అయితే, జుగేష్ గులాటి మరోలా చెబుతున్నారు... ఆయన తండ్రిని ఇదే ఆస్పత్రిలో చేర్చారు. ఆయన కోలుకున్నారు.

ఆస్పత్రి సిబ్బంది ఆక్సిజన్ కొరత గురించి తనకు ముందే చెప్పారని, అందుకే ఒక అదనపు సిలిండర్‌ను వెంట తీసుకువెళ్లానని జుగేష్ చెబుతున్నారు.

కాగా, తమకు ఆక్సిజన్ కొరత గురించి ఎలాంటి సమాచారం అందించలేదని మిగతా కొన్ని కుటుంబాలు బీబీసీకి చెప్పాయి.

మరోవైపు, వాట్సాప్ గ్రూపులో మాట్లాడుకుంటున్న కుటుంబ సభ్యుల్లో నిరాశ, నిస్పృహలు కమ్ముకున్నాయి.

"ఇంక ఈ గ్రూపులో ఉండడంలో అర్థం లేదు" అని జైన్ దిగులు చెందగా.. "మనం కలిసి పోరాడుదాం" అని వర్మ ధైర్యం చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Delhi: Doctors who left the ICU ward,Patients who died due to oxygen deprivation
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X