మెట్రోలో ప్రసవించిన మహిళ.. పోలీసులే డాక్టర్లుగా మారి..
మెట్రో రైలులో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళకు రైల్వే స్టేషన్ లోని మహిళా పోలీసులే డాక్టర్లుగా మారి పురుడు పోసి మానవత్వం చాటుకున్నారు. వీరికి తోటి ప్రయాణికులు కూడా తోడు కావడంతో ప్రసవం సాఫీగా జరిగింది. ఈ ఘటన దిల్లీ మెట్రోలో జరిగింది.
ఏం జరిగింది..?
బిహార్ లోని సమస్తీపుర్ కు చెందిన ఓ మహిళ దిల్లీ మెట్రో రైలు ఎక్కింది. రైలు ప్రయాణిస్తున్న సమయంలో ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో తోటి ప్రయాణికులు మెట్రో సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే లోకోఫైలట్ రైలును ఆనంద్ విహార్ మెట్రో స్టేషన్ లో నిలిపారు. వెంటనే అక్కడకు చేరుకున్న ఆర్పీఎఫ్ ఎస్సై నవీన కుమారి, తోటి లేడీ కానిస్టేబుళ్లు, ప్రయాణికుల సాయంతో ఆమెకు పురుడు పోశారు. దీంతో మెట్రోలోనే ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే అంబులెన్సుకు ఫోన్ చేసి తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు ఎస్సై నవీన కుమారి తెలిపారు.

"నేను డ్యూటీలో ఉండగా నాకు ఫోన్ వచ్చింది. బిహార్ కు చెందిన మహిళ పురిటినొప్పులతో బాధపడుతోందని లోకోఫైలట్ చెప్పారు. నేను వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేశాను. ఈలోగా ట్రెయిన్ స్టేషన్ లో ఆగింది. నేను,కానిస్టేబుళ్లు, తోటి ప్రయాణికులు కలిసి ఆమెకు పురుడు పోశాం. వెంటనే అంబులెన్స్ లో తల్లీ బిడ్డను స్థానిక ఆస్పత్రికి తరలించాం. ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు" స్టేషన్ ఇన్ స్పెక్టర్ శైలేంద్ర కుమార్ తెలిపారు.
గతేడాది తెలంగాణలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఆర్టీసీ బస్సులో ఓ మహిళ ప్రసవించింది. బస్సు కండక్టర్, తోటి ప్రయాణికులు కలిసి ఆమెకు పురుడు పోశారు. దీంతో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కండక్టర్, డ్రైవర్ ను అభినందించారు.












Click it and Unblock the Notifications