ఢిల్లీకి హర్యానా మతఘర్షణలు ? గురుగ్రామ్ లో మరిన్ని ప్రాంతాల్లో-ఆరుగురు హత్య..
హర్యానాలోని నూహ్ లో విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన ఓ ర్యాలీ తర్వాత చెలరేగిన మతఘర్షణల చిచ్చు ఇంకా ఆరడం లేదు. అంతే కాదు మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో ఉన్న గురుగ్రామ్ లోని మరిన్ని ప్రాంతాలకు ఈ చిచ్చు విస్తరించింది. దీంతో పోలీసులు భారీగా అరెస్టులు చేస్తూ పరిస్ధితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు.
హర్యానాలోని నూహ్ జిల్లాలో వీహెచ్పీ ర్యాలీ, అనంతరం మసీదుపై దాడి చేసి ఇమామ్ ను హతమార్చిన తర్వాత చెలరేగిన ఘర్షణలు అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి. పరస్పర దాడుల్లో మృతుల సంఖ్య ఆరుకు చేరినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఇద్దరు హోంగార్డులు కూడా ఉన్నారు. దాడులకు కారణంగా భావిస్తున్న 116 మందిని ఇప్పటికేఅరెస్టు చేసినట్లు సీఎం మనోహర్ లాల్ ఖత్తర్ వెల్లడించారు. వీహెచ్పీ ర్యాలీపై స్ధానిక అధికారులకు పూర్తి సమాచారం ఇవ్వకపోవడమే ఈ అల్లర్లకు కారణమని డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా తెలిపారు.

మరోవైపు పోలీసులు అల్లర్లను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నా ఇవాళ గురుగ్రామ్ లోని మరిన్ని ప్రాంతాలకు ఇవి విస్తరించాయి. దీంతో ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. మరోవైపు మతఘర్షణల తర్వాత హిందు సంఘాలు ర్యాలీలకు ప్రయత్నిస్తున్నారు. వీటిని అడ్డుకోవాలని కోరుతూ ముస్లింలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జూలై 31న మొదలైన ఈ ఘర్షణల తర్వాత ఇప్పటివరకూ 15 ఎఫ్ఐఆర్ లు నమోదు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు ఎలాంటి భావోద్వేగాలకు లోనుకాకుండా సంయమనం పాటించాలని సీఎం ఖత్తర్ కోరారు.

అటు హర్యానాలో పరిస్దితులు కూడా మణిపూర్ లాగే తయారయ్యాయన్న విమర్శలు మొదలయ్యాయి. బీజేపీ మణిపూర్ లా హర్యానాను మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపించారు. హర్యానాలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు. కాంగ్రెస్ కూడా హర్యానా ఘర్షణల్ని నియంత్రించడంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాన్ని టార్గెట్ చేస్తోంది. హర్యానాలో హింసకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాంగ్రెస్ సీనియర్ నేత రణ్ దీప్ సూర్జేవాలా సూచించారు.












Click it and Unblock the Notifications