ఒకేసారి ఏడు చోట్ల: బాంబు బెదిరింపులతో దద్దరిల్లిన ఢిల్లీ!
ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపుల కలకలం రేగింది. ఎర్రకోట వద్ద పేలుడు జరిగిన కొద్ది రోజులకే మంగళవారం(నవంబర్ 18) ఐదు ఢిల్లీ కోర్టు కాంప్లెక్సులకు, రెండు సీఆర్పీఎఫ్ పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయి. ఈ ఘటనతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.
న్యాయస్థానాల్లో భద్రత కట్టుదిట్టం
ఢిల్లీలోని పలు జిల్లా న్యాయస్థానాలకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ అందడంతో అధికారులు అన్ని కోర్టు కాంప్లెక్స్‌లలో భద్రతను పెంచారు. పటియాలా కోర్ట్, సాకేత్ కోర్ట్, రోహిణి కోర్ట్, ద్వారకా కోర్టుతో సహా మొత్తం ఐదు ఢిల్లీ కోర్టులకు ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. ఈ ఈ-మెయిల్‌ను "జైష్-ఎ-మహ్మద్" అనే పేరుతో పంపినట్లు సమాచారం. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDS) సాకేత్ కోర్ట్ ప్రాంగణంలో ముందు జాగ్రత్త చర్యగా తనిఖీలు నిర్వహించింది. బెదిరింపుల నేపథ్యంలో సాకేత్ కోర్టులో మధ్యాహ్నం లంచ్ వరకు పనులను నిలిపివేశారు. లంచ్ తర్వాత పనులు తిరిగి ప్రారంభమవుతాయని కోర్టు వర్గాలు వెల్లడించాయి. అధికారులు అప్రమత్తమై, అన్ని జిల్లా కోర్టుల్లో భద్రతా సిబ్బందిని హై అలర్ట్‌లో ఉంచి, ముందస్తు భద్రతా తనిఖీలను ముమ్మరం చేశారు.

సీఆర్పీఎఫ్ పాఠశాలలకు కూడా బెదిరింపులు
జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చిన రోజే.. రెండు సీఆర్పీఎఫ్ పాఠశాలలకు కూడా బెదిరింపు ఈ-మెయిల్స్ రావడం ఆందోళన కలిగిస్తోంది. ద్వారకా, ప్రశాంత్ విహార్‌లోని రెండు సీఆర్పీఎఫ్ పాఠశాలలకు ఈ బెదిరింపు ఈ-మెయిల్స్ అందాయి. ఎర్రకోట పేలుడు జరిగిన కొద్ది రోజులకే ఇన్ని ముఖ్యమైన ప్రాంతాలకు బెదిరింపులు రావడం ఢిల్లీలో మరోసారి భద్రతా ఆందోళనలకు దారితీసింది.
VIDEO | Delhi: Four district courts receive bomb threats, triggering a major security alert. A bomb squad arrives at Patiala House Court to conduct checks. Further details awaited.
— Press Trust of India (@PTI_News) November 18, 2025
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/KT4lxi2AFr
దేశవ్యాప్తంగా పెను సంచలనం
ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట సమీపంలో ఈ నెల 10న జరిగిన కారు పేలుడు ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నవంబర్ 10న సాయంత్రం వేళ, రద్దీగా ఉండే ప్రాంతంలో జరిగిన ఈ భయానక పేలుడులో సుమారు 13 మంది మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డారు. జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ ప్రారంభించింది. ఈ విచారణలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.












Click it and Unblock the Notifications