రాహుల్‌కు సామర్థ్యం లేదని డిగ్గీ, దుమారంతో వివరణ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌కు పరిపాలించడానికి అవసరమైన సామర్థ్యాలు లేవనిదిగ్విజయ్ అభిప్రాయ పడ్డారు. లోకసభలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యతలను, ఎన్డీఏ ప్రభుత్వాన్ని దీటుగా ఎదుర్కొనే బాధ్యతలను రాహుల్ తీసుకుని ఉండాల్సిందని గోవాకు చెందిన ఒక కేబుల్ న్యూస్ చానల్‌కు శుక్రవారం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దిగ్విజయ్ అభిప్రాయపడ్డారట.
రాహుల్ స్వభావ రీత్యా పరిపాలించడానికి తగిన వ్యక్తి కాదని, ఆయనది అన్యాయంపై పోరాటం జరిపే స్వభావమని చెప్పారు. గోవా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి అయిన దిగ్విజయ్ పార్టీ వ్యవహారాలపై సమీక్ష జరిపేందుకు రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన కోసం వచ్చారు. లోకసభ ప్రధాన ప్రతిపక్ష నాయకత్వ బాధ్యతలను చేపట్టాలని తాను రాహుల్ గాంధీకి సూచించినట్లు దిగ్విజయ్ చెప్పారు. రాహుల్ అంగీకరించని విషయం తెలిసిందే.

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష స్థానం అవసరమని, లోకసభలో కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద పార్టీ అయినందున తమ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ ఈ బాధ్యతలను చేపట్టి ఉండాల్సిందన్నారు. ఈ విషయంలో మాజీ ప్రధాని మన్మోహన్ మరింత చురుగ్గా వ్యవహరించి ఉంటే బాగుండేదన్నారు. అయితే రాహుల్ విమర్శిస్తూ తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారే అవకాశం కనిపించడంతో దిగ్విజయ్ ఆ తర్వాత ఆ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.
రాహుల్ ఎప్పుడూ అన్యాయంపై పోరాడే వ్యక్తే తప్ప అధికారం కోసం పాకులాడే వ్యక్తి కాదని, అదే మనకు, ఆయనకున్న తేడా అని మాత్రమే తాను చెప్పానంటూ దిగ్విజయ్ శనివారం సాయంత్రం వివరణ ఇచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్ రాహుల్ నేతృత్వంలోనే ఉందన్నారు. గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి ప్రభుత్వ పథకాలపై తాము సరైన రీతిలోప్రచారం చేయలేకపోవడమూ కారణమైందన్నారు.












Click it and Unblock the Notifications