మత్తు..సెల్ఫీలు.. నిర్లక్ష్యం: ముంబై 1 అబవ్ పబ్‌లో దారుణానికి కారణాలు ఇవే!

Posted By:
Subscribe to Oneindia Telugu
  Mumbai Fire Reasons : ముంబై కమలా మిల్స్ ప్రమాదానికి కారణాలు : మత్తు, సెల్ఫీ, నిర్లక్ష్యమే

  ముంబై: ముంబైలోని కమలా మిల్స్ కాంపౌండ్‌లో గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రమాదానికి మత్తు, సెల్ఫీ, నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. ఈ విషాదం వెనక ఉన్న కారణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.

  పుట్టిన రోజు పార్టీ చేసుకోవడానికి స్నేహితులతో కలిసి పబ్‌కు వచ్చిన ఖుష్బూ బన్సాలీ బర్త్ డే కేక్ కట్ చేసిన కాసేపటికే జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఖుష్బూ సహా 14 మంది ప్రాణాలు కోల్పోయారు.

   పబ్‌లో ఎటుచూసినా సందడే...

  పబ్‌లో ఎటుచూసినా సందడే...

  అది ముంబైలోని లోయర్‌పరేల్‌ ప్రాంతం. అక్కడి కమలామిల్స్‌ కాంపౌండ్‌లోని ఓ భవనంలోని ఉన్న రూఫ్‌టాప్‌ పబ్‌ ‘1 అబవ్‌'లో ఓ బర్త్ డే పార్టీ సందర్భంగా సందడి నెలకొంది. పబ్‌లోని సంగీతం హోరు.. అదే భవంతిలో కింద ఉన్న సంస్థల్లోకి కూడా వినిపిస్తోంది. పుట్టిన రోజు జరుపుకుంటున్న ఖుష్బూ బన్సాలీ 10 మంది స్నేహితురాళ్లతో కలిసి పబ్‌కు వచ్చింది. అందరూ ఎంజాయ్‌మెంట్‌లో మునిగిపోయారు. సమయం రాత్రి 12 గంటలు దాటింది. పబ్‌లో సంగీతాన్ని ఆస్వాదిస్తూ కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఖుష్బూ చాకొలెట్‌ కేక్‌ను కట్‌చేసింది. ఖుష్బూ వీడియాను ఆమె స్నేహితులు ఫేస్‌బుక్‌లో ఉంచారు. ‘హ్యాపియెస్ట్‌ బర్త్‌డే ఖుష్బూ' అని క్యాప్షన్‌ జతచేశారు.

  వేడుకలు కాస్తా విషాదంగా...

  వేడుకలు కాస్తా విషాదంగా...


  అంతలోనే ఊహించని ఉత్పాతం. క్షణాల్లో పరిస్థితి మారిపోయింది. అకస్మాత్తుగా ఎక్కడో చిన్నగా ప్రారంభమైన మంటలు.. క్షణాల్లో పబ్‌ అంతా వ్యాపించాయి. చూస్తుండగానే భవనాన్ని చుట్టుముట్టాయి.. ఓవైపు మంటలు, మరోవైపు కమ్ముకుంటున్న పొగతో పబ్‌లో భీతావహ వాతావరణం నెలకొంది. అందరిలోనూ ప్రాణభయం. హాహాకారాలు చెలరేగాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు అటూ ఇటూ పరుగులుతీశారు. మంటల ధాటిని తప్పించుకునేందుకు కొంతమంది వాష్‌రూమ్‌లలో దూరారు. అయినా ప్రయోజనం లేదు. పొగతో ఊపిరాడని పరిస్థితి.

  చాలామంది ఊపిరాడక చనిపోయారు...

  చాలామంది ఊపిరాడక చనిపోయారు...


  ప్రతి ఒక్కరూ ఎలాగైనా బయటపడాలని అనుకున్నారు. అంతలోనే - అగ్నికీలలు ఎగిసి పడ్డాయి. వెదురు కర్రలతో నిర్మించిన టెర్రస్ కావడంతో మంటలు క్షణాల్లో వ్యాపించాయి. మూడో అంతస్తులో ఉన్న మోజో పబ్‌కూ ఈ మంటలు విస్తరించాయి. ఖుష్బూ స్నేహితురాళ్లతోపాటు ఈ వేడుకకు వచ్చిన అమెరికాకు చెందిన భారత సంతతి సోదరులిద్దరు, వారి బంధువు కూడా అగ్నికి ఆహుతయ్యారు. బయటికెళ్లే మార్గం ఇరుకుగా ఉండడంతో తొక్కిసలాట మొదలైంది. మెట్లకు దగ్గరగా ఉన్న వారు ప్రాణాలతో బయటపడ్డారు. బాధితుల్లో చాలా మంది కాలిన గాయాలకంటే ఊపిరాడకే చనిపోయారని.. బాధితులను తరలించిన కింగ్‌ ఎడ్వర్డ్‌ మెమోరియల్‌ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

  ఖుష్బూ సహా 14 మంది దుర్మరణం...

  ఖుష్బూ సహా 14 మంది దుర్మరణం...

  ఈ దుర్ఘటనలో అప్పుడే పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న ఖుష్బూ సహా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 11 మంది మహిళలున్నారు. ఈ ప్రమాదంలో మరో 21 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఆ భవనంలో ఉన్న పలు టీవీ చానెళ్ల కార్యాలయ ఉద్యోగులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌ ఈ దుర్ఘటనపై విచారణకు ఆదేశించారు. తప్పుచేసిన వారు ఎంతవారైనా వదిలిపెట్టబోమన్నారు. నలుగురు అగ్నిమాపక సిబ్బందిని సస్పెండ్‌ కూడా చేశారు. 1 అబవ్‌ యజమానులు హ్రతేశ్‌ సంఘ్వీ, జిగర్‌ సంఘ్వీ, అభిజిత్‌ మకా సహా పలువురిపై ఐసీపీ 337, 338 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కేసు నమోదైన వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

  అత్యవసర ద్వారాలూ తెరుచుకోలేదు...

  అత్యవసర ద్వారాలూ తెరుచుకోలేదు...

  అగ్నిప్రమాదం చోటుచేసుకున్న భవనంలో సరైన భద్రతా ప్రమాణాల్లేవు. దీనికి తోడు.. మూడు, నాలుగు అంతస్తుల్లో ఉన్న మోజో, 1 అబవ్‌ పబ్‌లలో మంటలను ఆర్పే పరికరాలు కూడా లేకపోవటంతో ప్రమాదం తీవ్రత పెరిగింది. ఈ విషయంలో నిర్వాహకుల నిలువెత్తు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. పైగా కిందకు వెళ్లే అత్యవసర మార్గాలన్నీ మూసే ఉన్నట్లు తెలిసింది. ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది మరో మార్గంలో కొందరిని తరలించి ఉండకపోతే మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండేది.

  ప్రత్యక్ష సాక్షులు ఏమన్నారంటే...

  ప్రత్యక్ష సాక్షులు ఏమన్నారంటే...

  ‘నేను రాత్రి షిప్టులో ఉన్నాను. పబ్‌ ఫ్లోర్‌ నుంచి అరుపులు వినిపించాయి. బయటకు వచ్చి చూడగానే 1 అబవ్‌ ఫ్లోర్‌ మంటల్లో కాలిపోతోంది. మంటల కారణంగా మా కార్యాలయం ప్రధాన ద్వారాన్ని కూడా మూసేశారు...' అని ఓ టీవీ చానెల్‌ ఉద్యోగి తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో 1 అబవ్‌ రెస్టారెంట్లో ఉన్న డాక్టర్‌ సులభా అరోరా అయితే.. ఇంకా షాక్‌ నుంచి తేరుకోలేదు. తను ప్రాణాలతో బయటపడతాననుకోలేదని ఘటనను గుర్తుచేసుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ఈ భవన సెక్యూరిటీగాఉన్న మహేశ్‌ సబ్లే మాట్లాడుతూ..‘రాత్రి 12.30 సమయంలో పెద్దఎత్తున గందరగోళం చెలరేగడంలో నేను టెర్రస్‌పైనున్న ఆఫీస్‌ నుంచి బయటికొచ్చాను. తీవ్ర ఆందోళనలతో ఉన్న ప్రజలు నావైపు పెద్దసంఖ్యలో దూసుకొచ్చారు. దీంతో 150 నుంచి 200 మందికి కిందకు వెళ్లడానికి దారిచూపించాను. వీరందర్ని కిందకు పంపాక టాయిలెట్లలో ఉండిపోయిన మరో 10 మందిని బయటకు తీసుకొచ్చాను. వీరందరికీ స్వల్పంగా కాలిన గాయాలయ్యాయి. మంటలు ఎక్కువ కావడంతో మరోసారి నేను లోపలకు వెళ్లలేకపోయాను..' అని తెలిపారు.

  మత్తు, సెల్ఫీలతో పెరిగిన ప్రమాద తీవ్రత...

  మత్తు, సెల్ఫీలతో పెరిగిన ప్రమాద తీవ్రత...

  పబ్‌లో మంటలు చెలరేగినప్పుడు అతిథుల్లో కొందరు సెల్ఫీలు తీసుకుంటూ, మరికొందరు తప్పతాగి ఉండటంతో సహాయక చర్యలు ఆలస్యమయ్యాయి. ప్రమాదంలో ఎక్కువమంది ప్రాణాలు కోల్పోవడానికి మత్తు, సెల్ఫీలు, నిర్లక్ష్యమే కారణమని చెబుతున్నారు. మంటలు వ్యాపించే సమయానికి మత్తులో జోగుతున్న వారంతా వెంటనే స్పందించలేకపోయారు. సృహలో ఉన్నవారు ఇరుకుగా ఉన్న గుమ్మం నుంచి బయటపడి మంటలతో సెల్ఫీలు దిగడంలో మునిగిపోయారు. దీంతో అక్కడ జనాలు పోగయ్యారు. ఫలితంగా బయటకు వచ్చే వారికి దారి కరువైంది.

  బీఎంసీ వైఫల్యం కూడా...

  బీఎంసీ వైఫల్యం కూడా...

  ఇలాంటి పబ్‌లపై కఠినమైన చర్యలు తీసుకోవటంలో బీఎంసీ వైఫల్యం కూడా కొట్టొచ్చినట్లు కనబడుతోంది. తాము అన్ని నిబంధనలు పాటించామని పబ్ యజమానులు చెబుతున్నప్పటికీ అది వాస్తవం కాదని తెలుస్తోంది. 1 అబవ్‌ పబ్‌కు మూడుసార్లు హెచ్చరికలు జారీ చేశామని బీఎంసీ అధికారులు చెబుతున్నారు. అధికారులకు మామూళ్లు ముడుతున్నందునే వీరిపై చర్యలు తీసుకోలేదని ముంబై వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో ఐదుగురు బీఎంసీ అధికారులను కూడా ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆలస్యంగా మేల్కొన్న అగ్నిమాపక సిబ్బంది తేరుకుని 10 ఫైరింజన్లు, 18 ట్యాంకర్లతో మంటలార్పేందుకు నాలుగు గంటలు పట్టింది. ప్రమాదం సమయంలో కస్టమర్లను కాపాడాల్సిన పబ్ సిబ్బంది.. ఏమీ పట్టనట్టు పారిపోయి వారి ప్రాణాలను రక్షించుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  At midnight, Khushbu Bhansali brought in her 28th birthday with her husband and family members at the One Above lounge and pub. Barely an hour later, she was killed in the fire that broke out in the restaurant around 12.30 am Friday. At least 14 people died, including 11 women, and 19 others were injured when a major fire broke out on the top floor of a building inside the Kamala Mill compound in Lower Parel today. After preliminary investigations into the cause of the fire, the Mumbai police registered a case of culpable homicide against the owner of an establishment named One Above. The fire broke out in the One Above eatery and engulfed neighbouring establishments.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి