డ్రై ప్రూట్స్ ధరకు రెక్కలు.. తాలిబన్ల ఆక్రమణతో..? కారణమిదే..
ఆప్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించేశారు. ఇక అక్కడ వారి రాజ్యమే నడుస్తోంది. వారి పాలన ఎలా ఉంటుందో అందరికీ తెలుసు.. అందుకే జనం వెళ్లిపోయేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. అయితే ఆప్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించడంతో భారత్‌కు కూడా నష్టమే.. రాజకీయంగా, రక్షణపరంగా నష్టం అనే విశ్లేషణలు వస్తున్నాయి. కానీ ఆర్థిక అంశం ప్రధానం కానుంది.
ఆఫ్గానిస్తాన్ ప్రజల స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తూ తాలిబన్ ఉగ్రమూకలు ఆ దేశాన్ని హస్తగతం చేసుకున్నాయి. కాబూల్‌ను కూడా తాలిబన్లు ఆక్రమించడంతో అధ్యక్షుడు సైతం వేరే దేశానికి పారిపోయాడు. దీంతో ఆఫ్గాన్ పూర్తిగా తాలిబన్ల వశమైంది. ఆఫ్గానిస్తాన్ తాలిబన్ల హస్తగతం కావడం వల్ల భారత్‌కు రాజకీయంగా, ఆర్థికంగా, రక్షణ పరంగా చాలా నష్టపోనుంది. రాజకీయ, ఆర్థిక నష్టాలను పక్కనబెడితే.. తాలిబన్లు ఆక్రమించడం వల్ల.. ఆ ప్రభావం వెంటనే భారత్‌లోని డ్రై ఫ్రూట్స్‌పై పడుతోంది.

ఆఫ్గానిస్తాన్ తాలిబన్ల వశం కావడం వల్ల భారత్‌లో డ్రై ఫ్రూట్స్ రేట్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. భారత్ నుంచి పలు రకాల వస్తువులను ఆఫ్గానిస్తాన్ దిగుమతి చేసుకుంటుంది. ఆ దేశం నుంచి భారత్ కూడా కొన్నింటిని దిగుమతి చేసుకునేది. వాటిల్లో ముఖ్యమైనవి డ్రై ఫ్రూట్స్. చాలా రకాల డ్రైఫ్రూట్స్ ఆఫ్గానిస్తాన్ నుంచి ఇండియాకి దిగుమతి అవుతాయి. ఎండు ద్రాక్ష ఆఫ్గానిస్తాన్ నుంచే భారత్‌కు భారీ స్థాయిలో దిగుమతి అవుతుంది. జీలకర్ర కూడా అక్కడి నుంచే ఎక్కువగా దిగుమతి అవుతుంది.
కిస్‌మిస్, వాల్‌నట్స్, బాదం, పైన్ నట్, పిస్తా, ఆప్రికాట్, కుంకుమపువ్వును భారతదేశం దిగుమతి చేసుకుంటోంది. ఇప్పుడు తాలిబన్లు ఆక్రమించుకోవడంతో గతంలో మాదిరిగా ఎగుమతి, దిగుమతి సాధ్యం కాదు. దీంతో భారత్‌లో డ్రై ఫ్రూట్స్ ధర విపరీతంగా పెరగనుంది. ఢిల్లీలోని ఖారీ బవాలీ బజార్‌కు ఆఫ్గానిస్తాన్ నుంచి దిగుమతులు ఈ నెలలో భారీగా తగ్గిపోయాయి. ఈ నెలలో డ్రై ఫ్రూట్స్ ధరలు రెట్టింపు అవుతాయని విశ్వసనీయంగా తెలిసింది. దీపావళి నాటికి ఆఫ్గానిస్తాన్‌లో పరిస్థితులు చక్కబడితే అప్పటికి డ్రై ఫ్రూట్స్ ధరలు తగ్గే అవకాశముందని వ్యాపారులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications