Rahul Gandhi: రాహుల్ కు ఈసీ నోటీసు-మోడీపై పనౌతీ (దుష్టశక్తి) వ్యాఖ్యలపై...
రాజస్తాన్ లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసే వేళ కేంద్ర ఎన్నికల సంఘం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి షాకిచ్చింది. ప్రధాని మోడీని ఉద్దేశించి రాజస్తాన్ ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై అందిన ఫిర్యాదుపై స్పందించింది. దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ రాహుల్ కు నోటీసులు పంపింది. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు ప్రధాని మోడీ వెళ్లడంపై రాహుల్ చేసిన పరోక్ష వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.
రాజస్తాన్ లో తాజాగా ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అహ్మదాబాద్ లో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో కుర్రాళ్లు బాగా ఆడుతున్నారని, అదే సమయంలో అక్కడికి ఓ పనౌతీ(దుష్టశక్తి) వచ్చిందన్నారు. అంతే భారత్ ఓటమి పాలైందని రాహుల్ వ్యాఖ్యానించారు. దీంతో రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈసీని ఆశ్రయించారు.

ప్రధాని మోడీపై చేసిన పనౌతీ వ్యాఖ్యకు వివరణ ఇచ్చేందుకు శనివారం వరకూ రాహుల్ కు ఈసీ గడువు ఇచ్చింది. శనివారమే రాజస్తాన్ లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్థాన్‌లో తన ప్రచారంలో రాహుల్ గాంధీ ఇతర అవమానకరమైన పదాలను ఉపయోగించారని, ధృవీకరించని ఆరోపణలు చేశారని బీజేపీ తన ఫిర్యాదులో ఆరోపించింది. ఒక సీనియర్ నాయకుడికి ఇలాంటి పదజాలం తగదని ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీంతో ఈసీ రాజకీయ ప్రత్యర్థులపై నిర్ధారణ కాని ఆరోపణలు చేయడాన్ని ఎన్నికల నియమావళి నిషేధించిందని రాహుల్ కు జారీ చేసిన నోటీసులో ఎన్నికల సంఘం పేర్కొంది. కాబట్టి దీనిపై వివరణ ఇవ్వాలని ఆయన్ను ఆదేశించింది. ఈసీ నోటీసులకు రాహుల్ ఎలా స్పందిస్తారో శనివారం తేలనుంది.












Click it and Unblock the Notifications