కేరళ రాజకీయాల్లో హైడ్రామా: పినరయి విజయన్ కుమార్తెకు ఈడీ సమన్లు!
మనీలాండరింగ్ కేసులో కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్‌కు ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. సీఎంఆర్ఎల్-ఎక్సాలాజిక్ ఆర్థిక లావాదేవీల వివాదానికి సంబంధించి విచారణకు హాజరుకావాలంటూ ఆమెకు ఈడీ సమన్లు జారీ చేసింది. రాబోయే శుక్రవారం రోజున కొచ్చిలోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలంటూ ఉన్నతాధికారులు ఆమెను ఆదేశించారు. ఈ కేసులో వీణా విజయన్‌తో పాటు కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్(సీఎంఆర్ఎల్) సంస్థకు చెందిన కీలక అధికారులతో కలిపి మొత్తం 9 మందికి ఈడీ సమన్లు పంపినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
ఖనిజాల సంస్థ అయిన సీఎంఆర్ఎల్, వీణా విజయన్‌కు చెందిన ఐటీ సంస్థ 'ఎక్సాలాజిక్' మధ్య జరిగినట్లు చెబుతున్న కొన్ని అనుమానాస్పద, మోసపూరిత ఆర్థిక లావాదేవీలపై ఈడీ ప్రస్తుతం దృష్టి సారించింది. ఈ సమన్లు జారీ చేయడానికి కొన్ని రోజుల ముందే.. వీణా విజయన్, ఎక్సాలాజిక్ సంస్థ, ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తుల నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. ఈ దాడుల సమయంలో సీజ్ చేసిన డిజిటల్ ఆధారాలు, కీలక పత్రాలను ముందుంచి.. సమన్లు అందుకున్న వారిని అధికారులు శుక్రవారం రోజున ముఖాముఖి ప్రశ్నించే అవకాశం ఉంది.

ఈ కేసులో సీఎంఆర్ఎల్ సంస్థకు ఇటీవల కోర్టు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ దర్యాప్తునకు కీలక పత్రాలను పంచుకోవడాన్ని సవాల్ చేస్తూ ఆ సంస్ఖ దాఖలు చేసిన పిటిషన్‌ను కార్పొరేట్ నేరాల ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. అంతేకాకుండా సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (SFIO) నివేదికలోని రికార్డులను పరిశీలించేందుకు ఈడీకి అనుమతి ఇచ్చింది. వీణా విజయన్, సీఎంఆర్‌ఎల్ మధ్య జరిగిన ఒప్పంద పత్రాలు, ఆదాయపు పన్ను రికార్డులు, ఇతర ఆర్థిక పత్రాలను ఈడీ కోరగా.. వాటిని అప్పగించడానికి ఎలాంటి చట్టపరమైన అడ్డంకులు లేవని ఎస్‌ఎఫ్‌ఐఓ కోర్టుకు తెలిపింది.
ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఈడీ ఇప్పటికే భారీగా డాక్యుమెంట్లు, డిజిటల్, ఆర్థికపరమైన సాక్ష్యాలను సేకరించింది. ఇటీవల జరిపిన సోదాల్లో దాదాపు 242 బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన రూ. 18 కోట్ల నిధులను ఈడీ స్తంభింపజేయడంతో ఈ విచారణ మరింత వేగవంతమైంది. ఇలా హోల్డ్‌లో పెట్టిన ఖాతాలలో ఒకటి వీణా విజయన్‌కు చెందినది కూడా ఉందని, అందులో సుమారు రూ. 1.5 లక్షల వరకు నిధులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపై ఈ నిధుల ప్రవాహం ఎక్కడి నుంచి ఎక్కడికి సాగిందనే అంశంపైనే అధికారులు పూర్తిగా దృష్టి పెట్టనున్నారు.
మరోవైపు ఈ ఈడీ దర్యాప్తు కేరళ రాజకీయాల్లో తీవ్రదుమారం రేపుతోంది. కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే వీణా విజయన్‌ను లక్ష్యంగా చేసుకుందని సీపీఎం, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈడీ సోదాలు నిర్వహించిన ప్రాంతాల్లో వామపక్ష కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. తిరువనంతపురంలో జరిగిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారడంతో.. ఈడీ అధికారులు, పోలీసులపై దాడులు చేశారనే ఆరోపణలతో దాదాపు 300 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి, ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో శుక్రవారం జరగబోయే వీణా విజయన్ ఈడీ విచారణ దేశవ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.












Click it and Unblock the Notifications