దీపావళికి వెళ్లారు: దంపతులను చంపేశారు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. కొడుకుతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకునేందుకు వెళ్లిన దంపతులు దారుణ హత్యకు గురైనారు. మనోహర్ లాల్ మదన్ (86), ఆయన భార్య విమల (80) హత్యకు గురైనారని శుక్రవారం పోలీసు అధికారులు చెప్పారు.
దక్షిణ ఢిల్లీలోని ఈస్ట్ కైలాస్ రెసిడెన్సీ కాలనీలో మనోహర్ లాల్ మదన్ కుమారుడు నివాసం ఉంటున్నాడు. దీపావళి పండుగ సందర్బంగా నాలుగు రోజుల క్రితం మనోహర్ లాల్ భార్యతో కలిసి కుమారుడి ఇంటికి వెళ్లారు.
గురువారం రాత్రి మనోహర్ లాల్, విమల దంపతులు మాత్రం ఇంటిలో ఉన్నారు. మనోహర్ లాల్ కుమారుడు, ఆయన కుటుంబ సభ్యులు బంధువుల ఇంటికి వెళ్లారు. శుక్రవారం కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకుని చూడగా మనోహర్ లాల్ దంపతులు శవమై కనిపించారు.

దుండగులు ఇద్దరి గొంతులు బిగించి దారుణంగా హత్య చేశారు. పోలీసులు సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. బీరువాలోని వస్తువులు చెల్లాచెదురు అయ్యాయి. ఇంటిలోని వస్తువులు ఎక్కడపడితే అక్కడ ఉన్నాయని పోలీసులు చెప్పారు.
చోరీ చెయ్యడానికి వచ్చిన వారే మనోహర్ లాల్ దంపతులను హత్య చేసి ఉంటారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. అయితే ఎంత విలువైన నగలు, నగదు చోరీ అయ్యింది అని తెలియడం లేదని కేసు దర్యాప్తులో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications