ఐదేళ్ల తర్వాత వైరల్ అవుతున్న ఫడ్నవీస్ ట్వీట్.. అప్పుడేమన్నారంటే..?
ముంబై: రాజకీయాల్లో ఎవరు ఎవరితో ఎప్పుడు జట్టుకడుతారో తెలియదు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు శాశ్వత మిత్రులు ఉండరు అనేదానికి తాజాగా మహారాష్ట్రలో చోటుచేసుకున్న పరిణామాలే కారణం. బీజేపీ ఎన్సీపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అది ఒకప్పుడు. ఇప్పుడు అజిత్ పవార్ బీజేపీకి స్నేహహస్తం అందివ్వడంతో ఒకప్పటి శతృవు కూడా ఇప్పుడు మిత్రుడయ్యాడు. అయితే దేవేంద్ర ఫడ్నవీస్ గతంలో చేసిన ఓ ట్వీట్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఈ ట్వీట్‌ను అదేపనిగా ట్వీట్ చేసిన నెటిజెన్లు సరదా కామెంట్స్ పెడుతున్నారు.

వైరల్ అవుతున్న ఫడ్నవీస్ ట్వీట్
మహారాష్ట్రలో రాజకీయం ఒక్కరాత్రిలోనే తారుమారైంది. అప్పటి వరకు ప్రభుత్వం ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన శివసేన కాంగ్రెస్ ఎన్సీపీలు.. శుక్రవారం రాత్రి గడవగానే భారీ షాక్‌కు గురయ్యాయి. ఏకంగా ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేయడం, అదే సమయంలో డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ కూడా ప్రమాణస్వీకారం చేయడం జరిగిపోయాయి. ఇదిలా పక్కనబెడితే ఐదేళ్ల క్రితం దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంతకీ ఫడ్నవీస్ చేసిన ట్వీట్ ఏమిటి..?
ఎన్సీపీతో ఎప్పటికీ చేతులు కలిపేది లేదు అది ఎప్పటికీ జరగదని ఫడ్నవీస్ ఐదేళ్ల క్రితం ట్వీట్ చేశారు. అంతేకాదు ఎన్సీపీతో పొత్తు ఎప్పటికీ ఉండదని ఆ పార్టీ చేసిన అవినీతిని బీజేపీ అసెంబ్లీలో ఎండగట్టిందని ఆసమయంలో మిగతా పార్టీలు చాలా సైలెంట్‌గా ఉండిపోయాయన్నారు. ఈ ట్వీట్‌ను ఆయన సెప్టెంబర్ 26, 2014లో చేశారు. సీన్ కట్ చేస్తే ఐదేళ్లు తిరగగానే ఫడ్నవీస్ ఎన్సీపీ నేత అజిత్ పవార్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు.

అజిత్ పవార్ పై రూ.20వేల కోట్ల స్కామ్ ఆరోపణలు
ఈ ఏడాది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పదునైన అస్త్రాలతో బీజేపీ అజిత్ పవార్‌పై విరుచుకుపడింది. 20వేల కోట్ల రూపాయల ఇరిగేషన్ స్కామ్‌లో అజిత్ పవార్ విచారణను ఎదుర్కొంటున్నారని బీజేపీ అటాక్ చేసింది.అజిత్ పవార్ జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నసమయంలో ఈ స్కామ్ జరిగిందంటూ ప్రచారంలో బీజేపీ విరుచుకుపడింది. ఇక శనివారం రోజున మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రం కిందకు పైకి మారింది. అజిత్ పవార్ వర్గంతో ఎన్సీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ పావులు కదిపింది. శనివారం ఉదయం ప్రతి ఒక్కరూ షాక్‌కు గురయ్యారు.
ఆటాడేసుకున్న నెటిజెన్లు
మహారాష్ట్ర రాజకీయాలను చాలా ఆసక్తితో గమనిస్తున్నవారు ఫడ్నవీస్ గతంలో చేసిన ట్వీట్‌ను రీపోస్టు చేశారు. గతంలో ఏమన్నారు.. ఇప్పుడు ఏం చేస్తున్నారంటూ నెటిజెన్లు ట్వీట్ చేస్తున్నారు. ఆదర్శ్ కుంభకోణం, కాంగ్రెస్ ఎన్సీపీల అవినీతిలను బయటపెడుతామంటూ ఎవరినీ వదిలేది లేదంటూ ఫడ్నవీస్ చేసిన ట్వీట్లను సైతం వారు ఇప్పుడు గుర్తుచేస్తున్నారు. "ఫడ్నవీస్ గారూ వెంటనే ఆ పాత ట్వీట్‌ను డిలీట్ చేయండి " అంటూ ఒకరు ట్వీట్ చేయగా మరొకరు ''నెవర్'' అనే పదం పాలిటిక్స్‌లో పొరపాటున కూడా వాడరాదంటూ ట్వీట్ చేశారు. మరొకరైతే మహారాష్ట్ర పాలిటిక్స్‌లో ఇంతటి కంటెంట్ ఉండగా నెట్‌ఫ్లిక్స్ ఎందుకు అనవసరంగా అంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications