బీహార్ ఎన్నికల ఫలితాల్లో జానపద గాయని మైథిలి ఠాకూర్ సంచలనం..!
బీహార్ ఎన్నికల ఫలితాల వేళ కీలక పరిణామం చేటు చేసుకుంది. ఎన్నికల్లో పోటీ చేసిన ప్రముఖ గాయకులు ఆయా నియోజకవర్గాల్లో ముందంజలో దూసుకుపోతున్నారు. ముగ్గురు ప్రముఖ సింగర్లు వేరే వేరే పార్టీల్లో ఉండగా.. తమతమ స్థానాల్లో ప్రారంభం నుంచే ఆధిక్యాన్ని కనబరుస్తూ సీనియర్ నేతలను సైతం వెనక్కి నెట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో మొత్తం 243 స్థానాలు ఉండగా.. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మ్యాజిక్ ఫిగర్ 122 స్థానాలు.
కాగా ఈ ఎన్నికల్లో అలీనగర్ స్థానం నుంచి తొలిసారి పోటీ చేసిన జానపద గాయని మైథిలి ఠాకూర్ కూడా విజయం దిశగా వెళ్తున్నారు. ఆమెకు ప్రత్యర్ధిగా ఆర్జేడీ సీనియర్ నేత బినోద్ మిశ్రా బరిలో నిలిచారు. అయితే కౌంటింగ్ మొదలైన నాటి నుంచే ముందుగా పోస్టల్ బ్యాలెట్‌లో ముందంజలో ఉన్న ఆమె.. ఈవీఎంల కౌంటింగ్‌లో కూడా ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. వాస్తవంగా అలీనగర్ స్థానం ఆర్జేడీకి కంచుకోట లాంటిదని చెబుతుంటారు. ఈ నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి ఆర్జేడీనే గెలుస్తూ వస్తుంది. కానీ ఈసారి మాత్రం అనూహ్యంగా యువ ఓటర్లంతా మైథిలి ఠాకూర్ వైపు మొగ్గు చూపడం ఆసక్తి రేకెత్తిస్తుంది. ప్రస్తుతం బినోద్ మిశ్రా వెనుకంజలో ఉన్నారు.

కాగా అంతకు ముందు ఓ జాతీయ మీడియాతో మైథిలి ఠాకూర్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేయడం తన జీవితంలో అత్యుత్తమ నిర్ణయంగా తెలిపారు. సర్వే ఫలితాలు ఎన్డీఏకు అనుకూలంగా ఉన్నాయని విజయం సాధిస్తానన్న నమ్మకం ఉందని తెలిపారు. గెలుస్తానో, ఓడిపోతానో అని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదని విజయంపై పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. అలీనగర్‌లోనే ఉంటూ ప్రజలకు సేవ చేస్తానని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో మైథిలి ఠాకూర్ గెలిస్తే.. అతిపిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించనుంది.
గెలుపు బాటలో సింగర్ల జోరు..
మరోవైపు బీహార్ ఎన్నికల్లో ప్రముఖ గాయకులు పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఫలితాలు ఆసక్తిని పెంచుతున్నాయి. ఇప్పటికే మైథిలి ఠాకూర్ ముందంజలో ఉంటే.. మరో ఇద్దరు గాయకులు కూడా విజయం దిశగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
- ఖేసరి లాల్ యాదవ్ (ఆర్జేడీ): సారన్ జిల్లాలోని ఛప్రా స్థానం నుంచి ప్రముఖ భోజ్‌పురి గాయకుడు ఖేసరి లాల్ యాదవ్ ముందంజలో ఉన్నారు. ఈ స్థానం నుంచి ఆయన ఆర్జేడీ టికెట్‌పై పోటీ చేస్తున్నారు.
- రితేష్ పాండే (జనసురాజ్): భోజ్‌పురి గాయకుడు అయిన రితేష్ పాండే జనసురాజ్ పార్టీ తరఫున కర్గహర్ స్థానం నుంచి ముందంజలో ఉన్నారు.

దూసుకుపోతున్న ఎన్డీఏ..
కాగా రాష్ట్రంలో మొత్తం 243 స్థానాలకు గాను 2616 మంది అభ్యర్థుల బరిలో నిలిచారు. ఈ ఎన్నికల లెక్కింపు కోసం 38 జిల్లాల్లో 46 చోట్ల కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మరికొన్ని గంటల్లో తుది ఫలితం వెల్లడికానుంది. మరోవైపు బీహార్‌లో కౌంటింగ్ వేళ నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఓట్ చోరీ జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
పోస్టల్ ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచే ఎన్డీఏ ముందంజలో ఉండగా, ఆ తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపులోనూ అదే జోరు కొనసాగింది. కాగా ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం National Democratic Alliance (ఎన్డీయే) కూటమి ముందంజలో దూసుకుపోతుంది. ఎన్డీయే ఇప్పటివరకు 187 స్థానాల్లో ముందుగా ఉండగా.. అధికారాన్ని దక్కించుకునేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 156 స్థానాలను దాటేసింది. విపక్ష మహాఘట్‌బంధన్ 51 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. దీంతో బీజేపీ కార్యకర్తలు స్వీట్లు పంచుకుంటూ.. బాణాసంచా కాల్చుతూ సంబరాలు చేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications