భర్త, అత్త పైశాచికం: ఆకలి వారి ఆయుధం: కోడలిని తిండి పెట్టకుండా చంపేశారు!
కొల్లం: ఓ రెండురోజులు నాలుగు వేళ్లూ నోట్లోకి వెళ్లకపోతే.. నీరసపడిపోతాం. ఆకలికి నకనకలాడతాం. తిండికోసం అల్లాడిపోతాం. అలాంటిది కట్టుకున్న భార్యను రోజుల తరబడి భోజనం పెట్టలేదు ఓ దుర్మార్గుడు. తన భార్యను హతమార్చడానికి ఆకలిని ఆయుధంగా మార్చుకున్నాడా కిరాతకుడు. ఆకలితో అలమటించేలా చేశాడు. తిండి పెట్టకుండా చంపేశాడు. ఈ ఘాతుకానికి అతగాడి తల్లి కూడా సహకరించింది. దీనికి ప్రధాన కారణం.. అదనపు కట్నాన్ని తీసుకుని రావడానికి ఆమె అంగీకరించకపోవడమే. మృతురాలి పేరు తుషార. వయస్సు 27 సంవత్సరాలు. కేరళలోని కొల్లం జిల్లా కరునాగపల్లిలో భర్త చందూలాల్, అత్త గీతాలాల్ తో కలిసి నివాసించే వారు. తుషార, చందూలాల్ కు సుమారు పదేళ్ల కిందట పెళ్లయింది. వారికి ఇద్దరు పిల్లలు.

కరునాగపల్లిలో చందూలాల్ వెల్డర్ గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా అతను అదనపు కట్నాన్ని తీసుకుని రావాలంటూ తుషారను హింసించడం మొదలు పెట్టాడు. శారీరక హింసకు గురి చేశాడు. అయినప్పటికీ.. ఆమె వాటన్నింటినీ మౌనంగా భరించారు. దీనితో చందూలాల్ రాక్షసుడిగా మారాడు. తన తల్లి గీతాలాల్ కోసం కలిసి అనాగరిక చర్యకు పాల్పడ్డాడు. తుషారకు తిండి పెట్టడాన్ని మానేశాడు. ఓ గదిలో బంధించి వేశాడు. దీనితో గత్యంతరం లేక తుషార తనకు అందుబాటులో ఉన్న నాన బెట్టిన బియ్యం, చక్కెర కలిపి కొద్దిరోజుల పాటు కడుపు నింపుకొన్నారు. ఏకంగా ఏడాది పాటు ఆమె తిండికి దూరం అయ్యారు.

చివరికి- బియ్యం కూడా అయిపోవడంతో చిక్కిశల్యమయ్యారు. ఎముకలగూడులా మారిపోయారు. ఈ నెల 21న ప్రభుత్వాసుపత్రిలో మరణించారు. ఆ సమయంలో తుషార శరీరంపై ఏమాత్రం కండరాలు లేవని డాక్టర్లు నిర్ధారించారు. చనిపోయే సమయానికి తుషార కేవలం 20 కిలోల బరువు మాత్రమే ఉన్నట్లు తేలింది. ఆమె శరీరం చర్మాన్ని కప్పుకొన్న ఎముకల గూడులా మారిందని తెలిపారు. అత్తింటివారు అయిదేళ్లుగా తుషారను కట్నం కోసం వేధిస్తున్నారని, ఏడాది కాలంగా తమ కుమార్తెను కలుసుకోనీయలేదని ఆమె తల్లి విజయలక్ష్మి ఆరోపించారు. తమ కుమార్తెను ఎంతగా హింసించినా, ఆమె జీవితం ఇబ్బందిలో పడుతుందనే భయంతో తాము పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్నారు. భర్త, అత్త మానసికంగా, శారీరకంగా వేధించినట్లు చందూలాల్ పొరుగింటి వ్యక్తి తెలిపారు. చందూలాల్, గీతాలాల్ ను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేశారు.