కరోనాతో రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా కన్నుమూత...
రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా(89) కరోనాతో కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం కరోనా బారినపడిన ఆయన... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. జగన్నాథ్ పహాడియా మరణంపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొలి నుంచి పహాడియాతో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని గుర్తుచేసుకున్నారు. ఆయన మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అన్నారు.
పహాడియా మృతికి రాజస్తాన్ ప్రభుత్వం గురువారం(మే 20) సంతాప దినంగా ప్రకటించింది. దీంతో నేడు ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూతపడనున్నాయి. అధికారిక లాంఛనాలతో పహాడియా అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేటి మధ్యాహ్నం 12 గంటలకు కేబినెట్ సమావేశమై పహాడియాకు నివాళులు అర్పించనుంది.

జగన్నాథ్ పహాడియా 1980-81లో రాజస్తాన్ ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఆ తర్వాత హర్యానా,బిహార్ రాష్ట్రాలకు గవర్నర్‌గా కూడా వ్యవహరించారు. రాజస్తాన్‌లో దిగ్గజ కాంగ్రెస్ నేతగా గుర్తింపు పొందిన ఆయన మరణంపై పార్టీ శ్రేణులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ ఎంతోమంది ప్రజాప్రతినిధులు కరోనాతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ మంత్రి విజయ్ కశ్యప్ కరోనాతో మృతి చెందారు.
గతేడాది కేంద్రమంత్రి సురేశ్ అంగడి కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే. చాలా రాష్ట్రాల్లో పలువురు ప్రజాప్రతినిధులు కరోనా కాటుకు బలయ్యారు.
ఇక కరోనా కేసుల విషయానికి వస్తే... బుధవారం(మే 19) దేశవ్యాప్తంగా 2.67లక్షల కేసులు నమోదైన సంగతి తెలిసిందే. మరో 4529 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 2.54 కోట్లకు చేరింది. దేశంలో ప్రస్తుతం 22 రాష్ట్రాల్లో కరోనా పాజిటివిటీ రేటు 15శాతంగా ఉంది.












Click it and Unblock the Notifications