రూ.9 వేలు: 75 శాతం మందికి అందజేత, రూ.627 కోట్ల ఖర్చు: ఈసీకి కంప్లైంట్
మునుగోడు ఉప ఎన్నికల్లో ధనప్రవాహం కొనసాగిందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ ఆరోపించింది. ఎన్నికలో రూ.627 కోట్లు ఖర్చు చేశారని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఓటుకు రూ.9 వేల చొప్పున 75 శాతం ఓటర్లకు డబ్బు అందించారని వెల్లడించింది. ఓటర్లకు ఇచ్చిన డబ్బే రూ.152 కోట్లు ఉంటుందని ఫోరం గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి తెలిపారు.
రూ.300 కోట్ల విలువైన మద్యం విచ్చలవిడిగా ప్రవహించిందని తెలిపారు. ర్యాలీల సందర్భంగా ఒక్కొక్కరికి బిర్యానీ, మద్యంతోపాటు రూ.300 ముట్టచెప్పారని తెలిపారు. ఒక్కొక్కరికి రూ.500 చెల్లించారని వెల్లడించారు. మునుగోడు ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం విచారణ చేపట్టాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ డిమాండ్ చేసింది.

ఎన్నికల రోజున కొన్ని గ్రామాల ప్రజలు డబ్బులు ఇవ్వకపోతే ఓటు వేయబోమని మధ్యాహ్నం 2 గంటల వరకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ రోడ్లపై బైఠాయించిన ఘటనలు జరిగాయని పద్మనాభరెడ్డి గుర్తుచేశారు. ఆయా గ్రామాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమై రాత్రి 11 గంటల వరకు కొనసాగిందని ఆరోపించారు.
పక్కన గల గ్రామాల్లో ఓటుకు రూ.5 వేలు ఇస్తున్నారని, తమకు కూడా అంతే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ధర్నాలు చేసిన ఘటనలు కూడా ఉన్నాయని వివరించారు. డబ్బు డిమాండ్ చేశారనేందుకు ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications