తుపాకీ వదిలి ఉక్కు బాటలో.. గడ్చిరోలి మాజీ నక్సలైట్ల స్ఫూర్తిదాయక గాథ..!!
గడ్చిరోలి అడవుల్లో ఒకప్పుడు తుపాకీ గుళ్ల శబ్దం వినిపించేది.. కానీ ఇప్పుడు అదే అడవుల గుండా వెళ్లే బస్సుల్లో ప్రగతి గీతం వినిపిస్తోంది. చీకటి బాటను విడిచి వెలుగు వైపు అడుగులు వేస్తున్న మాజీ నక్సలైట్ల స్ఫూర్తిదాయక గాథ ఇది.
తెల్లవారుజామున మంచు దుప్పటిని చీల్చుకుంటూ గడ్చిరోలి జిల్లా కేంద్రంలోని 'నవజీవన్ కాలనీ'లో ఒక సందడి మొదలవుతుంది. కొందరు పురుషులు, మహిళలు ఉత్సాహంగా పనులకు సిద్ధమవుతుంటారు. వారంతా ఒక బస్సు ఎక్కి, దట్టమైన అడవుల గుండా 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న చమోర్షి తాలూకాలోని 'కోన్సరి'కి ప్రయాణమవుతారు. అక్కడ ఉన్నది లాయిడ్స్ మెటల్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ (LMEL) కు చెందిన అత్యాధునిక స్టీల్ ప్లాంట్.ఒకప్పుడు అదే అడవుల్లో తుపాకులు పట్టి, వ్యవస్థపై పోరాడిన చేతులు.. ఇప్పుడు అదే అడవుల నుంచి వచ్చిన ఇనుప ఖనిజంతో ఉక్కును తయారు చేస్తున్నాయి. వీరంతా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నీడ నుంచి బయటకు వచ్చి, మహారాష్ట్ర ప్రభుత్వ లొంగుబాటు-పునరావాస పథకం ద్వారా జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ నక్సలైట్లు.

చీకటి నుంచి వెలుగులోకి.. కొన్ని గుండె కోతలు!
ఈ ప్లాంట్‌లో పనిచేస్తున్న సుమారు 70 మందికి పైగా మాజీ నక్సలైట్ల వెనుక ఎన్నో కన్నీటి గాథలు, అంతకు మించిన మార్పు తాలూకు ఆనందం ఉన్నాయి.
- సురేష్ చామ్రూ హిచామి: 1999లో దళంలో చేరిన సురేష్, ఎనిమిదేళ్ల పాటు కొరియర్‌గా పనిచేశాడు. "మా చెల్లెలు ఒక పోలీసు అధికారిని పెళ్లి చేసుకుంది. దాంతో నా వాళ్లే నన్ను అనుమానించడం మొదలుపెట్టారు. అప్పుడే అనుకున్నాను.. ఈ అడవి బాట కంటే జనజీవన స్రవంతి మిన్న అని. ఇప్పుడు గౌరవంగా బతుకుతున్నాను" అని గర్వంగా చెబుతున్నాడు.
- గోవింద సామ్జీ అట్లా: టీనేజ్ వయసులోనే ఆశ్రమ పాఠశాల వదిలి, ఎవరో చెప్పిన మాటలు విని దళంలో చేరాడు గోవింద. చేతిలో కార్బైన్లు, ఏకే-47లు పట్టుకుని తిరిగాడు. "కొన్ని ఏళ్ల తర్వాత తెలిసింది.. ఈ బాట నన్ను ఎక్కడికీ తీసుకెళ్లదని. అందుకే వెనక్కి వచ్చేశాను. ఇప్పుడు నా జీవితం నా చేతుల్లో ఉంది" అని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.
- ప్రమీల బొగా & జాను సైను హేడు: జల్-జంగల్-జమీన్ అంటూ వీధుల్లో నాటకాలు వేసి దళంలో చేరిన మహిళలు వీరు. ఆరోగ్య సమస్యలు, మారుతున్న పరిస్థితుల రీత్యా జనజీవన స్రవంతిలోకి వచ్చిన వీరు, ఇప్పుడు ప్లాంట్ క్యాంటీన్‌లో పనుల చేస్తూ ఆత్మాభిమానంతో జీవిస్తున్నారు.
ప్రభుత్వ అండ.. అధికారుల చొరవ!
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పిలుపు, డీజీపీ రష్మీ శుక్లా పర్యవేక్షణ గడ్చిరోలిలో పెను మార్పుకు కారణమయ్యాయి. జిల్లా కలెక్టర్ అవిష్యంత్ పాండ మాటల్లో చెప్పాలంటే.. "ఇక్కడ నక్సలిజం అనేది ఇక గతం. ప్రజల్లో భద్రతా భావం పెరిగింది. లాయిడ్స్ ప్లాంట్ వీరికి ఉపాధి కల్పించడమే కాకుండా, శిక్షణ ఇచ్చి నైపుణ్యాన్ని పెంచుతోంది."
ఎస్పీ నీలోత్పల్ ఈ మార్పును ఒక మలుపుగా అభివర్ణించారు. ముఖ్యంగా మావోయిస్ట్ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు (భూపతి) లొంగుబాటు తర్వాత, అడవిలో ఉన్న చాలామందికి బయటకు రావాలనే ఆశ చిగురించిందని ఆయన పేర్కొన్నారు.
క్రమశిక్షణకు మారుపేరు!
సాధారణంగా నక్సలైట్లు అంటే భయపడే సమాజానికి, లాయిడ్స్ మెటల్ వైస్ ప్రెసిడెంట్ కర్నల్ ఎస్.కె. మహాపాత్ర (రిటైర్డ్) ఒక కొత్త విషయాన్ని చెప్పారు. "మా ప్లాంట్‌లో పనిచేస్తున్న ఈ మాజీ నక్సలైట్లు అత్యంత క్రమశిక్షణతో, అంకితభావంతో పనిచేస్తున్నారు. వారి పనితనం మమ్మల్ని ఆశ్చర్యపరుస్తోంది" అని కొనియాడారు.
గడ్చిరోలి అంటే ఒకప్పుడు 'రెడ్ కారిడార్'. కానీ నేడు అది 'ప్రగతి కారిడార్'గా మారుతోంది.రక్తం చిందించిన నేలపై ఇప్పుడు ఉక్కు కర్మాగారాలు వెలుస్తున్నాయి. విధ్వంసం నుంచి నిర్మాణం వైపు సాగుతున్న ఈ ప్రయాణం, దారి తప్పిన మరెందరో యువకులకు ఒక గొప్ప మార్గదర్శి.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications