వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Gas flaring: చమురు వెలికితీసే సంస్థలు గ్యాస్‌కు నిప్పు పెడుతున్నాయి ఎందుకు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
గ్యాస్ ఫ్లేరింగ్

''గ్యాస్ ఫ్లేరింగ్’’తో పర్యావరణానికి, మనుషుల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల ఇంధనం కూడా వృథా అవుతుందని చెబుతున్నారు.

2030 నాటికి గ్యాస్ ఫ్లేరింగ్‌ను పూర్తిగా నిలిపివేయాలని ఇంధన కంపెనీలను ప్రపంచ బ్యాంకు కోరుతోంది.

ఇంతకీ గ్యాస్ ఫ్లేరింగ్ అంటే ఏమిటి?

చమురును వెలికితీసేటప్పుడు భూగర్భం నుంచి బయటకు వచ్చే గ్యాస్‌కు నిప్పు పెట్టడాన్ని గ్యాస్ ఫ్లేరింగ్‌గా పిలుస్తారు.

చమురు కేంద్రాల్లోని భారీ చిమ్నీలపై మనకు అప్పుడప్పుడు పెద్దపెద్ద మంటలు కనిపిస్తుంటాయి. వీటికి కారణం గ్యాస్ ఫ్లేరింగ్. మరోవైపు నేరుగా నేలపై లేదా చమురు మీద ఉండే గ్యాస్‌కు కూడా చమురు సంస్థలు నిప్పు పెడుతుంటాయి. అయితే, ఆ మంటలు చమురు లేదా భూగర్భ నిల్వలకు తాకకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటాయి.

రష్యా, అమెరికాతోపాటు గల్ఫ్ దేశాల్లో ఈ గ్యాస్ ఫ్లేరింగ్ మనకు సాధారణంగా కనిపిస్తుంటుంది.

ఏ సమయంలో చూసుకున్నా ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా పది వేల గ్యాస్ మంటలు చెలరేగుతూ ఉంటాయని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. గత ఏడాది మొత్తంగా మంట పెట్టిన గ్యాస్‌తో సబ్-సహరన్ ఆఫ్రికా మొత్తానికీ ఇంధనం అందించొచ్చని అంచనాలు ఉన్నాయి.

గ్యాస్ ఫ్లేరింగ్

గ్యాస్‌కు చమురు సంస్థలు ఎందుకు నిప్పు పెడుతున్నాయి?

కొన్నిసార్లు భద్రతా కారణాల దృష్ట్యా గ్యాస్‌కు నిప్పు పెట్టడం అనివార్యం అవుతుంది.

భూగర్భ రిజర్వాయర్లలో పేరుకునే చమురు చుట్టూ గ్యాస్ ఆవరించి ఉంటుంది. డ్రిల్లింగ్‌తో చమురును పైకి తీయాలంటే మొదట అక్కడుండే గ్యాస్‌ను తొలగించాల్సి ఉంటుంది.

డ్రిల్లింగ్ వల్ల ఒత్తిడి పెరిగితే ఒక్కోసారి గ్యాస్ పైకి దూసుకొచ్చే అవకాశముంటుంది. ఫలితంగా విస్ఫోటాలు జరిగే ప్రమాదం ఉంది.

అందుకే ముందుగా గ్యాస్‌కు నిప్పు పెట్టి ఒత్తిడిని సంస్థలు తగ్గిస్తుంటాయి. దీన్ని సేఫ్టీ లేదా నాన్-రొటీన్ ఫ్లేరింగ్ అంటారు.

కొన్నిసార్లు ఖర్చు తగ్గించుకోవడానికి కూడా గ్యాస్‌కు చమురు సంస్థలు నిప్పు పెడుతుంటాయి.

కొద్ది మొత్తంలో పైకివచ్చే గ్యాస్‌ను మారుమూల ప్రాంతాల నుంచి వెలికితీసి, రవాణా చేసేందుకు భారీగా ఖర్చు పెట్టేందుకు సంస్థలు ఇష్టపడవు.

దీంతో అక్కడి గ్యాస్‌కు నిప్పు పెట్టడం ద్వారా తేలిగ్గా వదిలించేసుకుంటాయి.

గ్యాస్ ఫ్లేరింగ్

ఇది పర్యావరణానికి ఎలా హాని చేస్తుంది?

2021లో మొత్తంగా 144 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌కు చమురు సంస్థలు నిప్పు పెట్టినట్లు ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. మొత్తంగా దీని వల్ల 400 మిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ గాలిలోకి విడుదల అయ్యిందని సంస్థ తెలిపింది.

తొమ్మిది ట్రిలియన్ మైళ్ల కారు ప్రయాణాల్లో విడుదలయ్యే కర్బన ఉద్గారాలకు ఈ మొత్తం సమానం.

గ్యాస్ ఫ్లేరింగ్ వల్ల ''బ్లాక్ కార్బన్’’ లేదా ''సూట్’’ కూడా పర్యావరణంలోకి విడుదల అవుతుంది.

ఆర్కిటిక్‌లో పేరుకునే 40 శాతం బ్లాక్ కార్బన్‌కు గ్యాస్ ఫ్లేరింగే కారణమని ద యూరోపియన్ జియోసైన్సెస్ యూనియన్ వెల్లడించింది. ఆర్కిటిక్‌ మంచు కరిగిపోవడంలో ఈ బ్లాక్ కార్బన్ ప్రధాన పాత్ర పోషిస్తోంది.

గ్యాస్ ఫ్లేరింగ్

ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతోంది?

గ్యాస్ ఫ్లేరింగ్‌ వల్ల ''బెంజీన్’’గా పిలించే రసాయనం గాల్లో కలుస్తుంది. ఈ గాలిని పీల్చడంతో పరిసరాల్లో జీవించే వారు తలనొప్పి, కాళ్లు చేతులు వణకడం, గుండె లయ తప్పడం లాంటి సమస్యలు చుట్టుముట్టే ముప్పు ఉంటుంది. మరోవైపు బెంజీన్ వల్ల క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదముంది.

గ్యాస్ ఫ్లేరింగ్ వల్ల ''నాఫ్తలీన్’’ కూడా పర్యావరణంలోకి విడుదల అవుతుంది. దీని వల్ల కళ్లు, కాలేయం దెబ్బతినొచ్చు. ఇది కూడా క్యాన్సర్ కారకమే.

మరోవైపు గ్యాస్ ఫ్లేరింగ్ వల్ల విడుదలయ్యే బ్లాక్ కార్బన్ వల్ల కూడా శ్వాస కోశ సమస్యలు, హృద్రోగాలు, పక్షవాతం వచ్చే ముప్పుంటుంది.

నెలల నిండకుండా శిశువులు జన్మించే ముప్పు పెరిగేందుకూ బ్లాక్ కార్బన్ కారణం అవుతుందని ఇటీవల ఒక అమెరికా అధ్యయనం వెల్లడించింది.

గ్యాస్ ఫ్లేరింగ్

ఏ దేశాలు ఎక్కువగా గ్యాస్‌కు నిప్పు పెడతాయి?

ప్రపంచ బ్యాంకు విడుదలచేసే గ్యాస్ ఫ్లేరింగ్ ట్రాకర్ నివేదిక ప్రకారం.. గ్యాస్ ఫ్లేరింగ్‌లో రష్యా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఇరాక్, ఇరాన్, అమెరికా, వెనెజువెలా, అల్జీరియా, నైజీరియా ఉన్నాయి. గత పదేళ్లలో ఎక్కువగా గ్యాస్ ఫ్లేరింగ్ ఈ దేశాల్లోనే జరిగింది.

అయితే, ఇటీవల కాలంలో మెక్సికో, లిబియా, చైనా కూడా గ్లాస్ ఫ్లేరింగ్ చేయడం ఎక్కువైంది.

ఈ పది దేశాలు మొత్తంగా ప్రపంచ చమురులో సగం వాటాను ఉత్పత్తి చేస్తున్నాయి. గ్యాస్ ఫ్లేరింగ్‌లో వీటి వాటా 75 శాతం.

ఫిన్లాండ్‌కు సరిహద్దుల్లోని పోర్టోవయా కర్మాగారంలో రోజూ 10 మిలియన్ డాలర్లు (రూ.81.76 కోట్ల) విలువైన గ్యాస్‌కు రష్యా నిప్పు పెడుతోంది. యూరప్‌లో గ్యాస్ కొరత వేధిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

ఇదివరకు ఈ గ్యాస్‌ను నార్ట్‌స్ట్రీమ్ 1 పైప్‌లైన్ ద్వారా జర్మనీకి రష్యా ఎగుమతి చేసేది. అయితే, సెప్టెంబరులో ఈ సరఫరాలను రష్యా నిలిపివేసింది.

గ్యాస్ ఫ్లేరింగ్

గ్యాస్ ఫ్లేరింగ్ ఆపేందుకు ఎవరు అంగీకరించారు?

2030నాటికి అనవసర గ్యాస్ ఫ్లేరింగ్‌ను నిలిపివేసేలా ఇంధన సంస్థలను ఒప్పించేందుకు ప్రపంచ బ్యాంకు ప్రయత్నిస్తోంది. దీని కోసం జీరో రొటీన్ ఫ్లేరింగ్ పథకాన్ని తీసుకొచ్చింది. గ్యాస్ ఫ్లేరింగ్‌ను నిలిపివేయాలంటే కంపెనీలు మొత్తంగా దాదాపు వంద బిలియన్ డాలర్లు (రూ.8.17 లక్షల కోట్లు) ఖర్చు పెట్టాలని అంచనాలు ఉన్నాయి.

2015 నుంచి దాదాపు 54 ఇంధన కంపెనీలతోపాటు అమెరికా, రష్యా, సౌదీ అరేబియా, ఇరాక్ సహా 32 ప్రభుత్వాలు కూడా ఈ పథకం కింద ప్రపంచ బ్యాంకుతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

మరోవైపు గ్యాస్ ఫ్లేరింగ్ చేసే ఇంధన సంస్థలపై నార్వే ప్రత్యేక పన్నులు విధిస్తోంది. చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో అతితక్కువ గ్యాస్ ఫ్లేరింగ్ జరిగేది అక్కడే.

గత రెండు దశాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా గ్యాస్ ఫ్లేరింగ్ తగ్గుముఖం పడుతూ వస్తోందని ప్రపంచ బ్యాంకు చెబుతోంది.

1996 నుంచి చమురు అన్వేషణ 20 శాతం పెరిగినప్పటికీ, గ్యాస్ ఫ్లేరింగ్ మాత్రం 13 శాతం తగ్గింది.

గ్యాస్ ఫ్లేరింగ్‌కు ప్రత్యామ్నాయాలు ఏమిటి?

గ్యాస్‌ను సేకరించి వ్యాపార సంస్థలకు, వినియోగదారులకు విక్రయించాలని చమురు సంస్థలకు ప్రపంచ బ్యాంకు సూచిస్తోంది.

అయితే, గ్యాస్‌ను మొదటగా ప్రాసెసింగ్ చేసిన తర్వాత విక్రయించాల్సి ఉంటుంది. ఎందుకంటే దీనిలో ప్రమాదకర రసాయనాలు ఉంటాయి.

ఇది కాస్త ఖరీదైన ప్రక్రియ. అందుకే కొన్ని చమురు సంస్థలు గ్యాస్ ఫ్లేరింగ్‌కే మొగ్గు చూపుతున్నాయి.

అయితే, ఇక్కడ కొన్ని ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయని ప్రపంచ బ్యాంకు చెబుతోంది.

మొబైల్ ఎలక్ట్రిసిటీ జనరేటింగ్ కేంద్రాల్లో చమురు డ్రిల్లింగ్ కోసం, పెట్రోకెమెకల్ ప్లాంట్లలో ఇంధనంగా గ్యాస్‌ను వినియోగించొచ్చని సంస్థ వివరిస్తోంది.

చమురు రిజర్వాయర్లలో ఒత్తిడిని పెంచేందుకు ఈ గ్యాస్‌ను మళ్లీ భూగర్భంలోకి పంపించొచ్చని, ఫలితంగా మరింత చమురును వెలికి తీయొచ్చని సంస్థ చెబుతోంది.

కొన్ని చమురు సంస్థలు నేరుగా పర్యావరణంలోకి గ్యాస్‌ను విడుదల చేస్తుంటాయి. అయితే, గ్యాస్ ఫ్లేరింగ్ కంటే ఇది మరింత ప్రమాదకరం. ఎందుకంటే దీని వల్ల పర్యావరణంలోకి మీథేన్ విడుదల అవుతుంది. దీని వల్ల భూమి వేడెక్కే ముప్పుంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Gas flaring: Why are oil companies flaring gas?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X