గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన బీజేపీ: ఇంకా సీట్ల లోటులో ఉన్నా..ధీమా
న్యూఢిల్లీ: ఏ మాత్రం ఊహించని విధంగా గోవాలో భారతీయ జనతా పార్టీ ఆధిక్యతను సాధించే దిశగా దూసుకెళ్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అందని విధంగా బీజేపీ మరోమారు గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సమాయాత్తమౌతోంది. తాము అధికారాన్ని నిలబెట్టుకుంటామని బీజేపీ నేతలు కూడా ఊహించి ఉండకపోవచ్చు. స్వయానా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సైతం- హంగ్ అసెంబ్లీ ఏర్పడవచ్చనే సంకేతాలు ఇచ్చారు. అదే జరిగితే- మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ సహకారాన్ని తీసుకుంటామనీ చెప్పారు.
Recommended Video
ఫలితాలు మాత్రం వేరుగా ఉన్నాయి. బీజేపీకి అనుకూలంగా వెలువడుతున్నాయి. కమలనాథులకు మెజారిటీని అప్పగించేలా ఉన్నాయి. ప్రస్తుతం 19 చోట్ల బీజేపీ అభ్యర్థులు ఆధిక్యతలో కొనసాగుతున్నారు. ఇందులో ఏడు విజయాలు ఉన్నాయి. సంక్వెలిన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ ఘన విజయం సాధించారు. తొలి రౌండ్లల్లో వెనుకంజలో కనిపించిన ఆయన ఆ తరువాత ఆధిక్యతను సాధించారు. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని రాలేదు. కాంగ్రెస్ అభ్యర్థి ధర్మేష్ సంగ్లానీని ఓడించారు.

ప్రస్తుతం బీజేపీ పూర్తిస్థాయి మెజారిటీకి రెండు స్థానాల దూరంలో ఉంది. కాంగ్రెస్ 12, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ మూడు చొప్పున, ఆమ్ ఆద్మీ పార్టీ రెండు నియోజకవర్గాల్లో ఆధిక్యతలో కొనసాగుతున్నారు. ఇతరులు నాలుగు చోట్ల లీడింగ్‌లో ఉన్నారు. బీజేపీ ఈ రెండు స్థానాలను గెలుచుకోగలిగితే- మరొకరి సహకారం అవసరం లేకుండా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుంది.
19 స్థానాల వద్దే నిలిచిపోతే మాత్రం రిసార్ట్ రాజకీయాలకు తెర లేచినట్టే అవుతుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ, స్వతంత్రుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఉమ్మడి శతృవు కావడం వల్ల బీజేపీని నిలువరించడానికి కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ జట్టు కట్టే అవకాశాలు లేకపోలేదు. ఈ మూడు పార్టీలు కూడా మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ సహకారాన్ని తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా ఎంజీపీ కింగ్ మేకర్‌లా ఆవిర్భవించే అవకాశాలు లేకపోలేదు.
ఇదిలావుండగా- ఓట్ల లెక్కింపు చివరిదశకు వచ్చిన ప్రస్తుత పరిస్థితుల్లో.. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లై అపాయింట్‌మెంట్‌ను కోరింది. అపాయింట్‌మెంట్ లభించడమంటూ జరిగితే- ఈ సాయంత్రమే బీజేపీ నేతలు గవర్నర్‌ను కలుసుకుంటారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమను ఆహ్వానించాల్సిందిగా ఆయనకు విజ్ఞప్తి చేయనున్నారు.












Click it and Unblock the Notifications