రంగంలో దిగిన మోడీ: ఉక్రెయిన్ అధ్యక్షుడికి ఫోన్ కాల్: భారత్ సహకారాన్ని కోరిన మరుసటి రోజే
న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ మధ్య ఆరంభమైన యుద్ధం.. రోజులు గడుస్తున్న కొద్దీ మరింత తీవ్రతరమౌతోంది. రెండు దేశాలు కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేనట్టు వ్యవహరిస్తోన్నాయి. సై అంటే సై అంటోన్నాయి. ఇప్పటికే ఖేర్సన్, మెలిటొపొల్ నగరాలు రష్యా సైనికుల ఆధీనంలోకి వెళ్లాయి. రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకోవడానికి రష్యా సైనికులు చేస్తోన్న ప్రయత్నాలను ఉక్రెయిన్ అడ్డుకుంటోంది. ఖార్కీవ్‌లో అదే పరిస్థితి నెలకొంది. ఛెర్నిహివ్, మరియోపొల్, సుమీ నగరాలను రష్యన్ సైనిక బలగాలు చుట్టుముట్టాయి.
Recommended Video

దాడుల తీవ్రత రెట్టింపు..
రష్యా సైనిక బలగాల దాడులకు ధీటుగా స్పందిస్తోంది. సరిహద్దుల్లోని కొన్ని నగరాలను చేజార్చుకున్నప్పటికీ- రాజధాని కీవ్‌ను కాపాడుకోవడానికి సర్వశక్తులను ఒడ్డుతోంది. ఉక్రెయిన్ ప్రతిఘటిస్తోన్న కొద్దీ- రష్యా మరింత తన దాడుల తీవ్రతను రెట్టింపు చేస్తోంది. మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. కీవ్‌ను సొంతం చేసుకోవడమే ప్రస్తుతం రష్యా ముందున్న లక్ష్యంగా కనిపిస్తోంది. దీన్ని స్వాధీనం చేసుకోగలిగితే- ఉక్రెయిన్‌పై పట్టు సాధించినట్టవుతుందని భావిస్తోంది.

భారత్ సహకారాన్ని కోరిన ఉక్రెయిన్..
ఈ పరిణామాల మధ్య ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి దిమిత్రో కులేబా తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించిన మాట్లాడారు. భారత్ సహకారాన్ని కోరారు. భారత్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని, దౌత్య సంబంధాలను గుర్తు చేశారు. యుద్ధాన్ని నివారించడానికి తన వంతు ప్రయత్నాలు సాగించే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. భారత్‌తో తమకు సత్సంబంధాలు ఉన్నాయని దిమిత్రో అన్నారు. తమ దేశం నుంచి పెద్ద ఎత్తున వ్యవసాయ ఉత్పత్తులు, విత్తనాలను భారత్‌కు ఎగుమతి చేస్తోన్నామని చెప్పారు.

మోడీని ఒప్పించాలంటూ విజ్ఞప్తి..
భారత్‌తో దౌత్య సంబంధాలను కలిగివున్న దేశాలన్నీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడాలని, యుద్ధాన్ని నిలిపివేయడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడేలా మోడీని ఒప్పించాలని దిమిత్రో అన్నారు. తాము మోడీని తరచూ సంప్రదిస్తున్నామని పేర్కొన్నారు. భారత విద్యార్థులు స్వదేశానికి వెళ్లడానికి అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలను అందిస్తున్నామని చెప్పారు. వారి కోసం రైళ్లు, హాట్‌లైన్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

ఆ ప్రకటన చేసిన మరుసటి రోజే..
దిమిత్రో కులేబా ఈ వీడియో సందేశాన్ని విడుదల చేసిన మరుసటి రోజే భారత్- సానుకూలంగా స్పందించినట్టే కనిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రంగంలోకి దిగారు. ఇవ్వాళ ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడనున్నారు. ఈ మధ్యాహ్నం మోడీ- జెలెన్‌స్కీతో మాట్లడతారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భారతీయుల తరలింపు విషయంలో సహకరించినందుకు జెలెన్‌స్కీకి కృతజ్ఞతలు తెలుపుతారని అంటున్నారు.

యుద్ధానికి దారి తీసిన పరిణామాలతో పాటు..
అలాగే- యుద్ధానికి దారి తీసిన కారణాలను అడిగి తెలుసుకుంటారని తెలుస్తోంది. మానవతా దృక్పథం కింద తాము ఉక్రెయిన్‌కు అత్యవసర వస్తువులు, మెడిసిన్‌ను సరఫరా చేస్తున్నామనే విషయాన్ని మోడీ జెలెన్‌స్కీకి వివరించే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. ఇప్పటికే ఐక్యరాజ్య సమితి అత్యవసర సమావేశం, భద్రత మండలి భేటీల్లో తాము అనుసరించిన వ్యూహాలు, తటస్థ వైఖరిని కూడా ప్రధాని మోడీ ఆయన దృష్టికి తీసుకెళ్తారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications