ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట: ఇకపై వందే భారత్‌లో..
Vande Bharat Express Trains: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ ఇచ్చింది. లీవ్ ట్రావెల్ కన్సెషన్ కింద దేశవ్యాప్తంగా అన్ని వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో ప్రయాణించే వెసలుబాటు కల్పించింది. దీనితో పాటు తేజస్, హమ్‌సఫర్‌లల్లో కూడా ఎల్టీసీని వర్తింపజేసింది.
ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ శాఖలు, విభాగాల నుండి వచ్చిన విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది. వందే భారత్, తేజస్, హమ్‌సఫర్‌లల్లో ఎల్టీసీని ఉపయోగించుకుని దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు.

ఇప్పటివరకు వందే భారత్, తేజస్, హమ్‌సఫర్ మినహా మిగిలిన అన్ని రకాల ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్టీసీ సౌకర్యం అందుబాటులో ఉంటోన్న విషయం తెలిసిందే. రాజధాని, శతాబ్ది, దురంతో కేటగిరీలో ఉన్న 144 హై-ఎండ్ రైళ్లలో ఏసీ టయర్‌లల్లోనూ ప్రయాణ సౌకర్యాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పొందుతున్నారు.
వందే భారత్, తేజస్, హమ్‌సఫర్ కూడా దీన్ని వర్తింపజేయాలంటూ ప్రభుత్వ ఉద్యోగులు.. డీఓపీటీకి విజ్ఞప్తులు పంపించారు. దీనిపై ఆ విభాగం సానుకూలంగా స్పందించింది. ఫలితంగా 241 అదనపు రైళ్లల్లో ఎల్టీసీ సేవలు అందుబాటులోకి వచ్చినట్టయింది. 136 వందే భారత్, 97 హమ్‌సఫర్, ఎనిమిది తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించే వెసలుబాటు కలిగింది.
లెవెల్ 11 గ్రేడ్ ఉద్యోగులు వందే భారత్, తేజస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లలో షార్ట్, మీడియం డిస్టెన్స్ వరకు చైర్ కార్ ప్రయాణాన్ని పొందవచ్చు. లెవెల్ 12 గ్రేడ్, అంతకంటే ఎక్కువ స్థాయి ఉన్న ఉద్యోగులు ఈ రైళ్లలో ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ప్రయాణం చేయడానికి అర్హులు. ఏసీ 2 టయర్ ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.
ప్రభుత్వ ఉద్యోగులకు రాయితీతో కూడిన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడానికి ప్రభుత్వం ఈ ఎల్టీసీని అమలు చేస్తోంది. దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించే వీలుంది.












Click it and Unblock the Notifications