Isha Foundation: సద్గురు కేసులో ట్విస్ట్.. మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే..
Isha Case: కోయంబత్తూర్‌లోని తొండముత్తూర్ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ ఇషా ఫౌండేషన్‌పై మద్రాస్ హైకోర్టు ఆదేశించిన దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో వ్యవహారం సుప్రీం కోర్టు పరిధిలోకి వెళ్లిపోయింది. వాస్తవానికి మద్రాసు హైకోర్టు ఆదేశాలను ఇషా ఫౌండేషన్ సుప్రీంకోర్టులో సవాలు చేసిన నేపథ్యంలో ఈ చర్య వచ్చింది.
వాస్తవానికి ఆశ్రమంలో అక్రమంగా నిర్బంధించారనే ఆరోపణలపై దర్యాప్తు చేయాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. దీంతో మంగళవారం 150 మంది అధికారులతో కూడిన పోలీసు బృందం ఆశ్రమంలోకి ప్రవేశించి సోదాలు చేపట్టడం పెద్ద దుమారానికి దారితీసింది. ఈ క్రమంలో ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఇద్దరు మహిళలతో కూడా మాట్లాడింది. వారు తమ స్వంత ఇష్టానుసారం ఆశ్రమంలో నివసిస్తున్నామని, ఎవరూ బలవంతం చేయలేదని కోర్టుకు వెల్లడించారు. తాము ఆశ్రమాన్ని ఎప్పుడైనా విడిచిపెట్టడానికి స్వేచ్ఛగా ఉన్నారని మహిళలు స్పష్టం చేశారు. విచారణ సందర్భంగా చాంబర్‌లో ఉన్న ఇద్దరు మహిళలతో బెంచ్ నేరుగా మాట్లాడింది.

అసలు ఈ సోదాలకు కారణం సదరు మహిళల తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం మెుదలైంది. రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్.కామరాజ్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ ఆధారంగా ఈ కేసు నమోదైంది. 42, 39 సంవత్సరాల వయస్సు గల తన ఇద్దరు "చదువుకున్న కుమార్తెలు" కోయంబత్తూరులోని ఈషా యోగా కేంద్రంలో నివసించేలా "బ్రెయిన్ వాష్" చేశారని కామరాజ్ ఆరోపించారు. ఫౌండేషన్ అధికారులు తన కుమార్తెలను వారి కుటుంబంతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవడానికి అనుమతించలేదని కామరాజ్ కోర్టుకు తెలిపారు. ఇషా ఫౌండేషన్‌పై అనేక క్రిమినల్ కేసులు, లైంగిక వేధింపులు, దుష్ప్రవర్తన ఆరోపణలు పెండింగ్‌లో ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు.
సద్గురుకు చెందిన ఆశ్రమంపై అనేక క్రిమినల్ ఫిర్యాదులు ఉన్నందున ఈ విషయాన్ని తదుపరి చర్చకు అర్హమైనదిగా మద్రాసు హైకోర్టు పేర్కొంది. ఈ క్రమంలో జగ్గీ వాసుదేవ్ తన కుమార్తెకు వైవాహిక జీవితాన్ని ఇచ్చి.. ఇతర మహిళలను సన్యాసం తీసుకునేలా ప్రోత్సహించటాన్ని కోర్టు తప్పుపట్టింది. దీనిపై ఇషా తరఫున హాజరైన న్యాయవాది వయోజనులు తమ మార్గాలను ఎంచుకునే స్వేచ్ఛ, జ్ఞానం కలిగి ఉంటారని చెప్పారు. జగ్గీ వాసుదేవ్ ఎవరినీ పెళ్లి చేసుకోవద్దని లేదా సన్యాసం తీసుకోవాలని ఎవరినీ బలవంతం చేయటం లేదని న్యాయస్థానం ముందు వాదనలు వినిపించారు. ఇది పూర్తిగా వారి వ్యక్తిగత ఎంపికగా ఉందని చెప్పారు. ప్రస్తుతం ఆశ్రమంలో సన్యాసం స్వీకరించిన కొద్దిమందితో పాటు చాలా మంది ఇషా యోగా సెంటర్లో వసతి పొందుతున్నట్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications