గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో మహిళకు పురుడు పోసిన హిజ్రాలు
కరీంనగర్: సమాజంలో చిన్నచూపునకు, వివక్షకు గురవుతున్న హిజ్రాలు తమ మానవత్వాన్ని ప్రదర్శించారు. పురిటి నొప్పులతో బాధ పడుతున్న మహిళ వేదనను సాటి మహిళలే అర్థం చేసుకోని స్థితిలో ఉంటే వారు ముందుకు వచ్చి సాయం అందించారు. ఉత్తరప్రదేశ్ లక్నోలోని గొండాకు చెందిన నిర్మకు శుక్రవారం గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో హిజ్రాలు పురుడు పోశారు.
హైదరాబాద్‌లో కూలీ పని చేసుకుంటూ జీవనాన్ని సాగించే రాజు యాదవ్ తన భార్య నిర్మ నిండు గర్బిణీ. అయితే, అక్కడి వైద్యులు నిర్మ ప్రసవానికి పది రోజుల సమయం ఉందని తెలుపడంతో పురుడు పోయించేందుకు స్వగ్రామమైన లక్నోకు బయలు దేరాడు. శుక్రవారం ఉదయం సికింద్రబాద్ నుండి గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్తుండగా జమ్మికుంట రైల్వే స్టేషన్ దాటిన తరువాత నిర్మకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. అరగంట పాటు పురిటి నొప్పులతో తీవ్ర వేదన పడుతుండగా ఆందోళనకు గురైన భర్త రాజు బోగిలోని సాటి మహిళలను సహాయం చేయాలని ఒక్కొక్కరిని అర్థించాడు.

అదే బోగీలో ప్రయాణిస్తున్న రోషిణీ, ఉషా, సమీర, నగరం అనే నలుగురు హిజ్రాలు స్పందించి ప్రసవ వేదనకు గురవుతున్న మహిళకు దైర్యంతో ముందుకు వచ్చి ఆమెకు పురుడు పోశారు. సుఖ ప్రసవంతో నిర్మకు మగ శిశువు జన్మించింది. అప్పుడే పుట్టిన శిశువు రోదించక పోవడంతో ఆందోళనకు గురై వెంటనే ప్రయాణికులు 108కు సమాచారం అందివ్వడంతో సిబ్బంది వాహనంతో హుటాహుటిన రామగుండం రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు.
పుట్టిన శిశువుకు, తల్లికి 108 వైద్య సిబ్బంది అక్కడే ప్రాథమిక చికిత్స చేసి వీరిని గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వైద్యం కోసం తరలించారు. తన భార్యకు పురుడు పోసేందుకు హిజ్రాలు ముందుకు వచ్చినందుకు రాజు హిజ్రాలకు రోదిస్తూ కృతజ్ఞతలు తెలిపిన తీరు అందరినీ కదిలించింది. ఇది ఇలా ఉండగా హిజ్రాలు పురుడు పోయడం, మగ శిశువు పుట్టడం అదృష్టంగా భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications