బీజేపీ ఎలా గెలిచింది: టీఎంసీ ఎంపీల వద్ద రాహుల్ ఆరా
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ఘన విజయంపై ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ తృణమూల్ కాంగ్రెసు (టిఎంసి) పార్టీ పార్లమెంటు సభ్యుల నుండి ఆరా తీసే ప్రయత్నాలు చేశారట. బుధవారం లోకసభలో రాహుల్.. ఇద్దరు టిఎంసీ ఎంపీలతో బిజెపి గెలుపుపై చర్చించారట.
లోకసభలో తనకు సమీపంలోనే కూర్చున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు సౌగతారాయ్, కకోలి ఘోష్ దస్తిదార్‌తో రాహుల్ ఇదే విషయమై ఆరా తీశారు. వారితో దాదాపు ముప్పావు గంట మాట్లాడారు. 16వ లోకసభలో బీజేపీకి ఇంతటి బలం ఎలా సాధ్యమైందని, ఉత్తరప్రదేశ్‌లో మత అంశాలు ప్రభావం చూపాయా? ఇక్కడి నుంచి బీజేపీ పెద్ద ఎత్తున సీట్లు గెలుచుకోగా.. వారిలో ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేకపోవడం గురించి వారి అభిప్రాయం తెలుసుకునేందుకు రాహుల్ ఆసక్తి చూపారట.

అలాగే పశ్చిమబెంగాల్లో బీజేపీ క్రమంగా ఎదిగే అవకాశముందా అని అడిగారట. ఇటీవలి లోకసభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఓటింగ్ శాతం పెరగడాన్ని రాహుల్ ప్రస్తావించారట. కాగా, బీజేపీ అఖండ విజయం రాహుల్ గాంధీకి దిమ్మదిరిగేలా చేసినట్లుందని, బీజేపీ గెలుపు ఎలా సాధ్యమైందోననే విషయం రాహుల్‌కు అంతుబట్టటం లేనట్లుగా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
కాగా, రాహుల్ గాంధీ టీఎంసీ ఎంపీలతో ఓ వైపు బిజెపి గెలుపు పైన 45 నిమిషాల పాటు చర్చించగా.. అదే రోజు లోకసభలో ప్రధాని నరేంద్ర మోడీ టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ప్రశంసించారు.
35 ఏళ్లుగా బెంగాల్లో పేరుకుపోయిన చీడను (అన్నేళ్లు లెఫ్ట్ పార్టీ అధికారం ఉంది) నా సోదరి మమత తీవ్రంగా కష్ట పడుతున్నారని, అందుకు ఆమెను తాను అభినందిస్తున్నానని వ్యాఖ్యానించారు. కాగా, ఇటీవలి ఎన్నికల సమయంలో పశ్చిమ బెంగాల్లో బీజేపీ వర్సెస్ టీఎంసీగా కనిపించింది. ఎన్నికల అనంతరం కూడా రాష్ట్రంలో అలాంటి పరిస్థితే ఉంది. ఇలాంటి సమయంలో మమతను మోడీ అభినందించడం అందర్నీ ఆకట్టుకుంది.












Click it and Unblock the Notifications