కాక్రోచ్ లు తెచ్చిన మార్పు..! మోడీ రీల్స్ నుంచి లోక్ సభలో జెన్ జీ భాష వరకూ..!
నీట్ అక్రమాలకు బాధ్యతగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ ఢిల్లీలో నెల రోజుల పాటు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జరిగిన నిరసనలు దేశవ్యాప్తంగా విద్యార్దుల్ని ప్రభావితం చేశాయి. అలాగే జెన్ జీ తరానికి చెందిన విద్యార్ధుల్ని బుజ్జగించే క్రమంలో భారత రాజకీయ నాయకులపైనా వీరి ప్రభావం పడింది. ఇప్పుడు కాక్రోచ్ లు (Cockroaches) ఎక్కువగా కనిపించే ఇన్ స్టా లో ప్రధాని మోడీ రీల్స్ చేయడం దగ్గరి నుంచీ నిన్నటి లోక్ సభ చర్చలో ఎంపీలు వాడుతున్న జెన్ జీ భాషా ప్రయోగాల వరకూ చాలా స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.
ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా సాగిన సీజేపీ నిరసనల్లో భారీ ఎత్తున విద్యార్దులు పాలుపంచుకున్నారు. పార్లమెంట్ మార్చ్ సందర్భంగా పోలీసులు వీరిని అడ్డుకుని ఎక్కడికక్కడ లాఠీఛార్జ్ లు, భాష్పవాయువు ప్రయోగాలు చేశారు. దీంతో వీటిని మెయిన్ స్ట్రీమ్ మీడియా కవర్ చేస్తుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. దీని వెనుక కేంద్రానికి ఆగ్రహం తెప్పించకూడదనే కారణంతో పాటు చాలా కారణాలు ఉండొచ్చు. దీంతో సహజంగానే విద్యార్దులే తమపై దాడుల వీడియోల్ని తీసి ఇన్ స్టాలో పెట్టడం మొదలుపెట్టారు. ఇవి భారీఎత్తున వైరల్ అయ్యాయి. దీంతో ప్రధాని మోడీ (PM Modi)సైతం అర్దరాత్రి అదే ఇన్ స్టాలో (instagram) రీల్స్ చేసి విద్యార్దులకు సందేశాలు ఇవ్వాల్సి వచ్చింది.

ఇది అంతటితో ఆగలేదు. నిన్న లోక్ సభలో జరిగిన పేపర్ లీక్స్ నిరోధక బిల్లు చర్చ సందర్భంగా కూడా యువ ఎంపీలు అదే జెన్ జీ భాషలో మాట్లాడటం కనిపించింది. ఈ చర్చలో భాగంగా బీజేపీ ఎంపీ బాన్సురి స్వరాజ్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ పరీక్షల వ్యవస్థ లోపాలను సరిగ్గా గుర్తిస్తూ (క్లాక్ ఇట్) చట్టపరమైన పరిష్కారాన్ని చూపించారని ప్రశంసించారు. శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే సైతం ప్రతిపక్షాల తీరును ఈ జెన్-జీ భాషలోనే ఎండగట్టారు. ప్రతిపక్షాలు మొదట్లో ఎక్కడా కనిపించకుండా పోయాయని (MIA), ఆ తర్వాత వెనుకబడిపోతామేమోననే ఆందోళనతో (FOMO) నిరసనలు మొదలుపెట్టాయని, విద్యార్థులంతా తమతోనే ఉన్నారనే భ్రమలో (డెలూలూ) బతుకుతున్నాయని తీవ్ర విమర్శలు చేశారు. మరో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య కూడా కాంగ్రెస్ వైఖరిని తప్పుబడుతూ 'డెలూలూ' అనే పదాన్ని వాడారు.














Click it and Unblock the Notifications