పేకాటలో భార్యను తాకట్టు పెట్టిన ఘనుడు..చివరికి ఏం చేశాడంటే..?
జూదం, అప్పులకు బానిసైన ఓ భర్త, తన భార్యను తాకట్టుగా పెట్టి, ఓడిపోయిన అనంతరం ఆమెను ఎనిమిది మందికి అప్పగించాడు.ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో ఈ ఘటన వెలుగు చూసింది.మీరట్‌లోని ఖివాయ్ గ్రామానికి చెందిన డానిష్‌ను గత అక్టోబర్‌లో వివాహం చేసుకుంది బాధితురాలు. పెళ్లయిన కొద్ది కాలానికే ఆమె జీవితం కష్టాలమయం అయ్యింది.
వివాహం జరిగిన వెంటనే, భర్త డానిష్, అతని అత్తమామలు కలిసి బాధితురాలిని అదనపు కట్నం కోసం హింసించడం మొదలుపెట్టారు. ప్రతిరోజూ మద్యం తాగి ఇంటికి వచ్చే డానిష్, భార్యపై శారీరక దాడులకు పాల్పడేవాడు. అతని జూద వ్యసనం పెరిగిపోవడంతో, ఆర్థికంగా చితికిపోయాడు. ఈ క్రమంలోనే అత్యంత నీచానికి దిగజారి, ఆమెను జూదంలో ఎరగా పెట్టాడు.

జూదంలో ఓడిపోయిన తర్వాత, ఆమెను ఇతరులతో శారీరక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేసేవాడు. ఈ అమానుష క్రమంలో, ఉమేష్ గుప్తా, మోను, అన్షుల్ సహా ఎనిమిది మంది పురుషులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ అరాచకం ఇంతటితో ఆగలేదు. బాధితురాలు తాను గర్భవతిని అని చెప్పినప్పుడు, వారు బలవంతంగా గర్భస్రావం చేయించారు. అంతేకాకుండా, ఆమె కాలుపై యాసిడ్ పోసి చిత్రహింసలకు గురి చేశారు. చివరకు, తమ నేరాలు బయటపడకూడదనే ఉద్దేశంతో ఆమెను చంపడానికి నదిలోకి తోసేశారు.
అయితే, అదృష్టవశాత్తూ అక్కడే ఉన్న కొందరు స్థానికులు ఆమెను రక్షించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. ప్రస్తుతం ఈ కేసును ఉపసంహరించుకోవాలని నిందితులు ఆమెను బెదిరిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications