ఎంపీల సస్పెన్షన్, టి నుండి: జగన్ సహా 17మంది వీరే
న్యూఢిల్లీ: లోకసభలో ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లు)ను ప్రవేశ పెట్టిన తీరును వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఎక్కువ మంది రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నప్పటికీ, అసెంబ్లీ తిరస్కరించి పంపించినప్పటికీ, లోకసభలో ఇంత గందరగోళం మధ్య బిల్లును ఎందుకు ప్రవేశ పెట్టారని ప్రశ్నించారు. కేంద్రం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు. ఎంపీలను సస్పెండ్ చేసి నెగ్గిస్తారా అని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతుందన్నారు.
లోకసభలో పెప్పర్ స్ప్రేతో దాడి చేసిన విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్‌ను సస్పెండ్ చేశారు. లగడపాటి రాజగోపాల్‌తో పాటు మరో పదిహేడు మంది ఎంపీలపై రూల్ 374 కింద సస్పెండ్ చేశారు. సమావేశాలు ముగిసి వరకు వీరిపై సస్పెన్షన్ కొనసాగనుంది. వీరికి లోకసభ మినహా మిగతా పార్లమెంటు ప్రాంగణంలోకి అనుమతి ఉంది.

సస్పెండైన వారిలో సీమాంధ్ర నుండి పద్నాలుగు మంది, తెలంగాణ నుండి ముగ్గురు ఉన్నారు. ఎస్పీవై రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్, సాయి ప్రతాప్, అనంత వెంకట్రామి రెడ్డి, రాయపాటి సాంబశివ రావు, లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి, కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, శివ ప్రసాద్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, వైయస్ జగన్, మేకపాటి రాజమోహన్ రెడ్డిలు ఉన్నారు. తెలంగాణ నుండి గుత్తా సుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు.
మరోవైపు, లోకసభలో లగడపాటి రాజగోపాల్ చల్లిన పెప్పర్ స్ప్రేతో అస్వస్థతకు గురైన ఎంపీల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఎంపిలు పొన్నం ప్రభాకర్, వినయ్ కుమార్ పాండే, బలరాం నాయక్ తదితరులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications