వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనావైరస్: మహారాష్ట్రలో మళ్లీ లాక్‌డౌన్ అవసరం ఎందుకు వచ్చింది... ప్రభుత్వ ఎక్కడ విఫలమైంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
మహారాష్ట్రలో మళ్లీ వలస కూలీలు ఇళ్ల బాట పట్టారు

కరోనా సెకండ్ వేవ్ కారణంగా మహారాష్ట్రలో మళ్లీ లాక్‌డౌన్ విధించారు.

పెరుగుతున్న కేసులను దృష్టిలో పెట్టుకుని బుధవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి రాష్ట్రంలో కఠినంగా కోవిడ్ నిబంధనలను అమలు చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆదేశించారు.

దీనికి లాక్‌డౌన్ అని పేరు పెట్టలేదుగానీ ఈ పరిస్థితి కర్ఫ్యూకు కొంచెం ఎక్కువగా, లాక్‌డౌన్‌కు కాస్త తక్కువగానూ కనిపిస్తోంది.

గత ఏడాది మార్చిలో, కొన్ని గంటల వ్యవధిలోనే లాక్‌డౌన్ అమలు అవుతుందని ప్రధాని మోదీ ప్రకటించినప్పుడు అనేక రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. వాటిల్లో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది.

అయితే, కేంద్ర ప్రభుత్వం, అనేకమంది వైద్యులు లాక్‌డౌన్ విధానాన్ని సమర్థించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి, మౌలిక వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసుకునేందుకు లాక్‌డౌన్ అవకాశం కల్పిస్తుందని అభిప్రాయపడ్డారు.

మళ్లీ ఇప్పుడు ఏడాది తరువాత ఉద్ధవ్ ఠాక్రే "బ్రేక్ ది చైన్" అంటూ పిలుపునిచ్చారు.

మళ్లీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? గత ఏడాది కరోనా విజృంభణ నుంచి, లాక్‌డౌన్ నిబంధనలు, పరిణామాల నుంచి మనం ఏ రకమైన పాఠాలూ నేర్చుకోలేదా? లేదా నేర్చుకున్న పాఠాలను అంత త్వరగా మర్చిపోయామా?

"గత సంవత్సరం ప్రభుత్వం పాటించిన విధానాలన్నీ అప్పటి కోసమే. అయితే, గత ఏడాదిగా నేర్చుకున్న పాఠాలను కొంత ప్రజలు మర్చిపోయారు, కొంత ప్రభుత్వం మర్చిపోయింది" అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) మహారాష్ట్ర చాప్టర్ 2020 అధ్యక్షుడు డాక్టర్ అవినాష్ భోండ్వే అన్నారు.

"సామాజిక దూరం పాటించడం, మాస్కులు వేసుకోవడం, చేతులు కడుక్కోవడం వంటి నిబంధనలను ప్రజలు నిర్లక్ష్యం చేశారు. జ్వరం వస్తే తేలికగా తీసుకున్నారు. ఆలస్యంగా ఆస్పత్రులకు చేరుకున్నారు. పరిస్థితి చేయి దాటిపోయిందని రోజూ నమోదవుతున్న గణాంకాలు పరిశీలిస్తే తెలుస్తుంది" అని డాక్టర్ అవినాష్ అన్నారు.

ప్రభుత్వం మర్చిపోయిన పాఠాల గురించి ఆయన వివరంగా చెప్పారు.

మహారాష్ట్ర

1. ఆరోగ్య సేవలకు బడ్జెట్‌లో వ్యయం

మహారాష్ట్రలో ఆరోగ్య సేవల నిమిత్తం సంవత్సరానికి సుమారు 0.5 శాతం ఖర్చు పెడుతున్నారు.

అయితే, కోవిడ్ తరువాత ఇది పెరిగినప్పటికీ 1 శాతానికి చేరుకోలేదు.

ఈసారి బడ్జెట్‌లో ఖర్చును 500 కోట్లకు పెంచనున్నట్లు తెలిపారు.

కోవిడ్ పెరుగుతున్న నిష్పత్తిలో ఆరోగ్య సేవలకు బడ్జెట్ పెరగట్లేదు.

ఐఎంఏ అంచనాల ప్రకారం బడ్జెట్‌లో ఆరోగ్య, వైద్య సదుపాయాలకు 5 శాతం వ్యయం కేటాయించాలి.

గత ఏడాది కాలంలో మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఆస్పత్రులేవీ తెరుచుకోలేదు.

ఆస్పత్రులు, వైద్యులు, నర్సులు, సాంకేతిక నిపుణుల సంఖ్య ఇంకా తక్కువగానే ఉంది.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో కేవలం 10,000 పడకలు మాత్రమే ఉన్నాయి. దాంతో ప్రజలు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. కోవిడ్ భారాన్ని 80 శాతం ప్రైవేటు ఆస్పత్రులు మోస్తున్నాయి. 20 శాతం మాత్రమే ప్రభుత్వ ఆస్పత్రులు మోస్తున్నాయి.

కార్డియాలజీ, ఐసీయూ, బైపాస్ సర్జరీకి కావలసిన సౌకర్యాలు ప్రభుత్వ ఆస్పత్రులలో తక్కువగా ఉన్నాయి.

అయితే, ఇది కేవలం ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యం కాదని డాక్టర్ అవినాష్ అన్నారు. గత కొన్నేళ్లుగా మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, ల్యాబ్ టెక్నీషియన్ చదువుల మీద దృష్టి తగ్గింది.

ఫలితంగా మహారాష్ట్రలో రిజిస్టర్ చేయించుకున్న వైద్యులు 1 లక్ష 25 వేల మంది ఉండగా, అవసరం అంతకు రెట్టింపు ఉంది.

నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్ల కొరత కూడా ఎక్కువే. కోవిడ్‌లాంటి మహమ్మారి విజృభించినప్పుడు ఈ అంశాలన్నీ ప్రతికూలంగా నిలిచాయి.

వీటన్నిటినీ ఒక్క ఏడాదిలో సరి చేయలేరుగానీ, ఆ దిశగా ప్రభుత్వం కనీసం ఒక్క అడుగు కూడా వేయకపోవడం విచారకరం అని డాక్టర్ అవినాష్ అభిప్రాయపడ్డారు.

ఈ పరిస్థితుల్లో, కొత్త డాక్టర్లు, రిటైర్ అయిన డాక్టర్లు, నర్సులు కూడా గత సంవత్సరంలాగే ముందుకు వచ్చి సహాయం అందించాలని ఉద్ధవ్ ఠాక్రే కోరారు.

2. కరోనా టెస్టుల వేగం

సంవత్సర కాల అనుభవం తరువాత కూడా కరోనా పరీక్షలు చేయించుకోవడానికి 2-3 రోజులు పడుతోందనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఫలితాలు రావడానికి మరో రెండు మూడు రోజులు పడుతోంది.

గత ఏడాదితో పోలిస్తే టెస్టుల సంఖ్య పెరిగింది కానీ ల్యాబ్‌ల సంఖ్య పెరగలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో టెస్టుల సంఖ్య పెరుగుతోంది కానీ, అది సరిపోవట్లేదు.

జరుగుతున్న టెస్టుల్లో ఆర్‌టీపీసీఆర్ టెస్టుల సంఖ్య తక్కువే. కోవిడ్‌కి ఇది నిఖార్సయిన పరీక్ష. కానీ అవే తక్కువ సంఖ్యలో జరుగుతున్నాయి.

కోవిడ్ సెకండ్ వేవ్‌లో కుటుంబం మొత్తానికి వైరస్ సోకిన కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కాంట్రాక్ట్ ట్రేసింగ్ పెరగాలి, టెస్టుల సంఖ్య కూడా పెరగాలి.

कोरोना

4. ఆక్సిజన్, మందుల అవసరాన్ని అంచనా వేయడం

"రాబోయే రోజుల్లో ఆక్సిజన్ సరఫరా ఎక్కువ కావాల్సి ఉంటుంది. రోడ్డు మార్గాల ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ రప్పించడంలో ఆలస్యం చోటు చేసుకుంటోంది. 1000 కిలోమీటర్ల దూరం నుంచీ ఆక్సిజన్ చేరేలోపు అనేకమంది ప్రాణాలకే ముప్పు రావొచ్చు. ఈ విషయమై నేను ప్రధానితో మాట్లాడాను. మాకు ఎయిర్‌ఫోర్స్ సహాయం అవసరం అవుతుందని చెప్పాను" అని ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు.

కరోనా సెకండ్ వేవ్ రాబోతోందని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. పుస్తకాలు రాశారు.

"అలాంటప్పుడు సెకండ్ వేవ్ వస్తుందని ఊహించి అందుకు తగ్గ ప్రణాళికలు ముందే వేసుకోవాల్సింది. అలా చేస్తే ఈ పరిస్థితే రాకపోదును. మన దగ్గర కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ గానీ, కోవిడ్ అప్రాప్రియేట్ యాటిట్యూడ్ గానీ లేదని డాక్టర్ అవినాష్ విమర్శించారు.

5. వ్యాక్సినేషన్ వేగవంతం చేయడం

మనం మొత్తం ప్రపంచానికి టీకాలు అందించే ప్రణాళికలు వేస్తున్నాంగానీ మనింట్లో పరిస్థితేంటో పరిశీలించట్లేదని డాక్టర్ అవినాష్ అన్నారు.

సెకండ్ వేవ్‌ను కట్టడి చేయాలంటే కఠినమైన లాక్‌డౌన్ అయినా విధించాలి లేదా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

మహారాష్ట్రలో ఇప్పటికి ఒక్క కోటి మందికి మాత్రమే టీకాలు వేశారు.

వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయకపోతే మహమ్మారిని అడ్డుకోవడం చాలా కష్టమని, ఈ విషయంలో ఇతర దేశాల నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

6. వలస కూలీల వెతలు

గత ఏడాది వలస కూలీలు పడ్డ అవస్థలు చూసిన తరువాత కూడా మనం ఏ పాఠాలు నేర్చుకోలేదని నిపుణులు అంటున్నారు.

ఇప్పుడు మళ్లీ అదే ప్రహసనం మొదలైంది. మహారాష్ట్రలో చాలామంది వలస కూలీలు ఇళ్ల బాట పట్టారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని సరిగ్గా నిర్వహించలేకపోయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

క్రితంసారి కేంద్ర ప్రభుత్వం నాలుగు గంటల సమయం ఇచ్చింది. ఈ సారి మహారాష్ట్ర ప్రభుత్వం 24 గంటల సమయం ఇచ్చింది. రెండిటికీ పెద్ద తేడా లేదు. ఒక్కరోజు ముందు పరిస్థితి మారిపోదు.

గత ఏడాది వలస కూలీలు కాలిబాటన వాళ్ల వాళ్ల ఇళ్లకు చేరుకున్నారు. వారికి అక్కడే ఉపాధి అవకాశాలు కల్పించాల్సింది.

ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారికి ఆరోగ్య మౌలిక సదుపాయాల కోసం విడిగా రూ .5776 కోట్లు ఖర్చు చేసే ప్రణాళికను ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రకటించారు.

కానీ, వారిని ఉద్యోగాల్లోంచి తీసేయకూడదని, అద్దె ఇళ్ల నుంచి వెళ్లగొట్టకూడదనే నియమాలు తీసుకు రావలసిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

7. జంబో కోవిడ్ 19 కేంద్రాలు మూసివేశారు

కరోనా ఫస్ట్ వేవ్‌లో మహారాష్ట్రలో 1,000-2,000 పడకలతో తాత్కాలికంగా జంబో కోవిడ్ కేంద్రాలు తెరిచారు.

వీటిని నిర్వహించడానికి ప్రభుత్వం ఇతర ఏజెన్సీలకు అనుమతి ఇచ్చింది.

అయితే, గత ఏడాది సెప్టెంబర్ తరువాత వీటిల్లో చేరే రోగుల సంఖ్య తగ్గిపోవడంతో వీటిని మూసివేశారు.

కాంట్రాక్ట్‌పై తీసుకున్న డాక్టర్ల ఒప్పందాలను కూడా రద్దు చేశారు.

ఇది పెద్ద తప్పిదంగా డాక్టర్ అవినాష్ భావిస్తున్నారు.

ఇప్పుడు మళ్లీ జంబో కేంద్రాలను తెరవాలంటే అంత సులువు కాదు. మళ్లీ కాంట్రాక్ట్ డాక్టర్లు లభించడం కష్టమవుతుంది.

ఈ పాఠాలన్నీటినీ ప్రభుత్వం, ప్రజలు గుర్తు చేసుకుంటే పరిస్థితిని కొంతైనా నివారించవచ్చని నిపుణులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Coronavirus: Why the lockdown is needed again in Maharashtra Where did the government fail
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X