Jagdeep Dhankar: రాజ్యసభ ఛైర్మన్ పై అవిశ్వాసం-ఇండియా కూటమి సంచలన నిర్ణయం..!
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఉభయ సభలు విపక్షాల నిరసనలతో అట్టుడుకుతున్నాయి. ముఖ్యంగా అదానీ అంశంతో పాటు పలు సమస్యలను ప్రస్తావిస్తున్న విపక్ష ఇండియా కూటమికి, అధికార పక్షం నుంచి మొండిచేయి ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ఉభయసభల్లో వాయిదాల పర్వం కూడా కొనసాగుతోంది. అదే సమయంలో రాజ్యసభ ఛైర్మన్ జగ్ దీప్ ధన్ కర్ విషయంలో విపక్షాలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నాయి. దీంతో ధన్ కర్ పై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి.
ప్రధాన విపక్షం కాంగ్రెస్ పార్టీతో రాజ్యసభ ఛైర్మన్ జగ్ దీప్ ధన్ కర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టించి తాము మద్దతివ్వడమా లేక ఇండియా కూటమి అంతా ఏకమై ఈ అవిశ్వాస తీర్మానం పెట్టాలా అన్న దానిపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఛైర్మన్ గా ఉంటూ అధికార పక్షానికి వంత పాడుతున్నారనేది ధన్ కర్ పై ప్రధాన అభియోగం. దీనిపై పలుమార్లు ఆయన్ను కలిసి చర్చించినా ఫలితం లేకపోవడంతో అవిశ్వాసం పెట్టి తీరాలని విపక్షాలు భావిస్తున్నాయి.

వాస్తవానికి లోక్ సభతో పోలిస్తే పెద్దల సభ అయిన రాజ్యసభలో ఎంపీల సస్పెన్షన్లతో పాటు దూకుడు నిర్ణయాలు దాదాపుగా ఉండేవి కాదు. కానీ కొంతకాలంగా పరిస్ధితి మారుతోంది. అదే సమయంలో విపక్షాల నుంచి ఎదురవుతున్న డిమాండ్లను ధన్ కర్ అస్సలు పట్టించుకోవడం లేదని, అధికార పక్షానికి పూర్తి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ధన్ కర్ ను అవిశ్వాసం పెట్టి ఇరుకునపెట్టాలని ఇండియా కూటమి భావిస్తోంది. అయితే రాజ్యసభలో తాజాగా మెజార్టీలోకి వచ్చిన అధికార ఎన్డీఏ.. అవిశ్వాసాన్ని అడ్డుకునే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications